బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా గతంలో కూడా అద్వానీ వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ చాలాసార్లు ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన వయస్సు 97 ఏళ్లు. రెండు రోజుల క్రితం అద్వానీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలోనూ వృద్ధాప్య సమస్యలతో ఆస్పత్రికి వచ్చారు.
దేశ విభజనకు ముందు ప్రస్తుతం పాకిస్థాన్ భూభాగంలోని కరాచీలో 1927 నవంబరు 08న అద్వానీ జన్మించారు. జాతీయ పార్టీకి బీజేపీ నిర్మాణంలో అద్వానీ అత్యంత కీలక పాత్ర పోషించారు. 1980లో బీజేపీ ఆవిర్భావం మొదలుకుని ఆ పార్టీకి సుదీర్ఘకాలం పాటు అధ్యక్షుడిగా ఆయన సేవలందించారు. 1986 నుంచి 1990 వరకు, 1993 నుంచి 1998 వరకు, 2004 నుంచి 2005 వరకు అద్వానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 1980 -1990 మధ్య కాలంలో బీజేపీని బలమైన జాతీయ శక్తిగా తీర్చిదిద్దడంలో అద్వానీ సఫలీకృతమయ్యారు. 1984లో కేవలం 2 స్థానాల్లో గెలిచిన బీజేపీ.. 1989లో 86 లోక్‌సభ స్థానాల్లో గెలిచింది.
1992లో 121 స్థానాలు, 1996లో 161 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. దేశ స్వాతంత్ర చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ నాటి ఎన్నికల్లో రెండో స్థానానికి పడిపోయింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం అద్వానీ చేపట్టిన ఉద్యమం బీజేపీ నిర్మాణానికి ఎంతో దోహదపడింది. 1999 నుంచి 2004 మధ్య కాలంలో నాటి ప్రధాని వాజ్‌పేయి హయాంలో అద్వానా కేంద్ర హోం మంత్రిగా.. ఆ తర్వాత డిప్యూటీ ప్రధానిగా సేవలందించారు. దాదాపు మూడు దశాబ్ధాల పాటు అద్వానీ పార్లమెంటు సభ్యుడిగా సేవలందించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..