‘విశ్వాస ఘాతుకానికి శివసేన మూల్యం చెల్లించుకుంది’.. నితీశ్ కుమార్‌కు బీజేపీ నేత హెచ్చరిక

బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో చేతులుకలపడం ద్వారా నితీశ్ కుమార్ విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ మండిపడ్డారు.

‘విశ్వాస ఘాతుకానికి శివసేన మూల్యం చెల్లించుకుంది’.. నితీశ్ కుమార్‌కు బీజేపీ నేత హెచ్చరిక
Nitish Kumar
Follow us

|

Updated on: Aug 10, 2022 | 11:58 AM

Bihar Politics: జేడీయు అధినేత నితీశ్ కుమార్‌ (Nitish Kumar)పై బీహార్ బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ(Sushil Modi) తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో చేతులుకలపడం ద్వారా నితీశ్ కుమార్ విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని మండిపడ్డారు. బీజేపీతో కలిసి ఉన్నప్పుడు నితీశ్ కుమార్‌కు సరైన గౌరవం ఇచ్చామన్నారు. అయితే కొత్త ప్రభుత్వంలో నితీశ్ కుమార్‌కు తగిన గౌరవం దక్కబోదన్నారు. బీజేపీ ఇచ్చిన గౌరవం.. ఆర్జేడీ ఇవ్వబోదని వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే ఎక్కువ స్థానాలు వచ్చినా.. నితీశ్ కుమార్‌ను బీహార్ సీఎం చేసినట్లు గుర్తుచేశారు. అలాగే జేడీయును చీల్చేందుకు బీజేపీ ఎప్పుడూ ప్రయత్నించలేదన్నారు.

విశ్వాస ఘాతుకానికి పాల్పడిన వారికి మాత్రమే బీజేపీ గుణపాఠం చెప్పిందని సుశీల్ మోదీ అన్నారు. మహారాష్ట్రలో శివసేన విశ్వాస ఘాతుకానికి పాల్పడిందని.. దానికి ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. నితీశ్ కుమార్ కూడా అలాంటి అనుభవాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుదంటూ ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో సుశీల్ మోదీ పరోక్ష హెచ్చరికలు చేశారు.

కాగా బీహార్ సీఎంగా ఎనిమిదో సారి నితీశ్ కుమార్ మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. పాట్నాలోని రాజ్ భవన్‌లో ఈ మధ్యాహ్నం 2 గం.లకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు. కొత్త కేబినెట్ కూర్పు ఎలా ఉండబోతుందన్న అంశంపై ఆసక్తికర ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గరిష్ఠంగా 35 మందికి కేబినెట్‌లో చోటు కల్పించేందుకు వీలుంది. వీరిలో ఆర్జేడీకి 16, జేడీయుకి 13 మంత్రి పదవులు దక్కే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. జితన్ రాం మాంజి నేతృత్వంలోని హెచ్ఏఎంకు చెందిన ఒకరు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు మంత్రులు కావచ్చని సమాచారం. ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యేని అసెంబ్లీ స్పీకర్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..