
బీహార్ లో రాజకీయ మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మారడానికి కౌంట్‌డౌన్ మొదలైంది. నితీష్‌కుమార్ ఇండియా కూటమి నుంచి ఎన్డీయే కూటమికి వెళ్లడానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట్లో కీలక భేటీ నడిచింది. LJP నాయకుడు చిరాగ్ పాశ్వాన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా, అమిత్ షా వెళ్లారు. దీంతో కొత్త ప్రభుత్వంలో బెర్తులపై ఫోకస్ పెరిగింది.
బీజేపీకి వ్యతిరేకంగా జత కట్టిన ఇండియా కూటమి తొలి మీటింగ్‌కు వేదికగా నిలిచిన బీహార్‌లో పాగా వేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఆదివారం (జనవరి 28) ఆ మార్పుకు అద్దంపట్టే కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. జేడీయూ చీఫ్, ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్‌తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని కమలదళం ఏర్పాటు చేయనుంది. వాస్తవానికి నితీష్‌కుమార్ ఇవాళ రాజీనామా చేయాల్సి ఉంది. అయితే, బీజేపీ నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో ప్లాన్ మారిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీకి రెండు ఉపముఖ్యమంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవి ని నితీశ్ ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.
అయితే నితీష్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పిస్తారని చెబుతున్నారు. గవర్నర్‌కు నితీశ్ రాజీనామా లేఖను సమర్పించి.. బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నట్లు సమాచారం. వెంటనే, అంటే సాయంత్రం నాలుగు గంటలకు ఆయన మళ్లీ సీఎంగా ప్రమాణం చేయడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇక, బీజేపీ, జేడీయూ మధ్య పొత్తు కుదిరితే రాష్ట్రంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండొచ్చని తెలుస్తోంది. బీజేపీకి చెందిన సుశీల్ మోదీ, రేణుదేవి డిప్యూటీ సీఎంలు కావచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు శనివారం పాట్నాలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు నితీశ్ రాజీనామా చేయలేదని, ఎవరూ మద్దతు ఉపసంహరించుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది.
ఇదే సమయంలో ఇటు పాట్నాలో బిహార్ బీజేపీ కోర్ కమిటీ భేటీ అయింది. పదవులపై కసరత్తులు సాగుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేల బేరసారాలకు రంగం సిద్ధమైంది. ఒకవైపు JD-U, ఇంకోవైపు RJD పరస్పరం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. నితీష్ మాత్రం, ఇటు RJD ఎమ్మెల్యేలను, అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నితీశ్‌తో కలిసి ఎన్డీఏ కూటమిలోకి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదంతా జరిగిపోతే తదుపరిగా విశ్వాస పరీక్ష ద్వారా నితీశ్ కుమార్‌కు సవాల్ విసరాలని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ యోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 5న బీహార్ బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజున విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఆర్జేడీ చీఫ్ భావిస్తున్నారు. మహాకూటమి నుంచి నితీశ్ ఫిరాయించిన తీరుపై బీహార్ అసెంబ్లీలో చర్చించాలని కూడా లాలూ పార్టీ ప్లాన్ చేస్తోంది. మరోవైపు నితీష్‌కు నచ్చచెప్పడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే , సోనియాగాంధీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఖర్గే మూడుసార్లు ఫోన్ చేసినప్పటీ నితీష్ స్పందించలేదని తెలిపారు కాంగ్రెస్ నేత జైరాంరమేశ్.
మరోవైపు నితీశ్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం పాట్నాకు వస్తున్నారు. 40 లోక్‌సభ సీట్లున్న బిహార్ హిందీ బెల్ట్‌లో బీజేపీకి చాలా కీలకమైంది. అందుకే సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు కమలనాథులు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చేందుకు ఇంత పెద్ద స్కెచ్‌ను అమలుచేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..