ట్రక్ డ్రైవర్‌ పొంతనలేని సమాధానాలు.. డౌట్ వచ్చి చెక్ చేయగా.. సబ్బు పెట్టెలు లోపల అంతకుమించి..

సబ్బు పెట్టెల్లో హెరాయిన్‌ రవాణా చేస్తుండగా.. అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రూ.47కోట్ల విలువైన హెరాయిన్‌ను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్రక్ డ్రైవర్‌ పొంతనలేని సమాధానాలు.. డౌట్ వచ్చి చెక్ చేయగా.. సబ్బు పెట్టెలు లోపల అంతకుమించి..
Soap Boxes
Follow us

|

Updated on: Oct 11, 2022 | 4:12 PM

డ్రగ్స్ నియంత్రణకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.. అయినప్పటికీ.. కేటుగాళ్లు రూటు మార్చి మరీ.. డ్రగ్స్‌ను సరిహద్దులు దాటిస్తున్నారు.. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. డ్రగ్స్ డీలర్లు చేపడుతున్న అక్రమ రవాణాకు.. పోలీసులు వారిని తలదన్నేలా చెక్ పెడుతున్నారు. తాజాగా.. ఓ భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. అస్సాంలో సబ్బు పెట్టెల్లో హెరాయిన్‌ రవాణా చేస్తుండగా.. అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రూ.47కోట్ల విలువైన హెరాయిన్‌ను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్ఎఫ్), అస్సాం పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి డ్రగ్స్‌ ముఠా ఆటకట్టించినట్లు తెలిపారు. తనిఖీల అనంతరం పోలీసులు ట్రక్‌ డ్రైవర్‌ అరెస్టు చేశారు. మరికొందరు నిందితులు తప్పించుకున్నారని.. వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మరికొందరు స్మగ్లర్లను సైతం పట్టుకుంటామని వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిజోరాం నుంచి కరీంగంజ్‌ మీదుగా త్రిపుర వెళ్తున్న ట్రక్కులో కోట్లాది రూపాయల విలువైన హెరాయిన్‌ను తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందించింది. దీంతో బీఎస్‌ఎఫ్‌, కరీంగంజ్‌ పోలీసులు రంగంలోకి దిగారు. మంగళవారం కరీంగంజ్‌ రైల్వేస్టేషన్‌కు సమీపంలో తనఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అనుమానాస్పద ట్రక్కు నుంచి హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్‌ను సబ్బు పెట్టెల్లో పెట్టి.. ఎవరికీ అనుమానం రాకుండా డ్రైవర్‌ క్యాబిన్‌లో దాచినట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం 9.47 కిలోల హెరాయిన్ లభ్యమైందని.. దీని విలువ మార్కెట్లో రూ. 47.4 కోట్లు ఉంటుందని పోలీసు అధికారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

నిందితులు అక్రమ రవాణా కోసం.. ట్రక్ క్యాబిన్ సీలింగ్‌లో ఓ ప్రత్యేక సొరంగం తయారు చేశారని తెలిపారు. హెరాయిన్‌తో కూడిన 764 సబ్బు కేసులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితు సరికొత్త మార్గంలో డ్రగ్స్ రవాణా చేస్తున్నారని.. వారిని నిరోధించేందుకు తమ బృందం రేయింబవళ్లు పనిచేస్తుందని తెలిపారు.

కాగా.. అక్టోబరు 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గౌహతిలో ‘మాదక ద్రవ్యాల రవాణా – జాతీయ భద్రత’పై అన్ని ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

ఇదిలాఉంటే.. 2014 నుంచి ఇప్పటి వరకు రూ.20 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేశామని, ఈశాన్య రాష్ట్రాల్లో 4,888 మంది డ్రగ్స్‌ పెడ్లర్లను అరెస్టు చేశామని అధికారులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..