భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కర్తార్ పూర్ కారిడార్ విషయంలో నేడు చర్చలు జరగనున్నాయి. గత కొద్ది రోజులుగా కాశ్మీర్ విషయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ, కర్తార్‌పూర్ సాహిబ్ అంశంలో ఇరు దేశాల అధికారులు ఇవాళ చర్చలు జరుపనున్నారు. సరిహద్దులోని జీరోపాయింట్ వద్ద ఇరు దేశాల అధికారులు సమావేశమై కర్తార్‌పూర్ కారిడార్ విషయంలో సాంకేతికపరమైన అంశాలపై చర్చించనున్నట్లు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్ తెలిపారు. పాక్ ప్రతిపాదనను భారత్ అంగీకరించిందని.. కర్తార్ పూర్ సాహిబ్‌పై సమావేశం ఆగస్టు 30 శుక్రవారంనాడు జీరో పాయింట్ వద్ద జరుగుతుందని ఫైజల్ పాక్ మీడియాతో పేర్కొన్నారు. తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటన మేరకు కర్తార్‌పూర్ కారిడార్‌ను పూర్తి చేసి, ప్రారంభించేందుకు పాకిస్తాన్ కట్టుబడి ఉందని కూడా తెలిపారు. అయితే సాంకేతిక అంశాలపై చివరిసారి చర్చలు జరగనున్న నేపథ్యంలో.. కర్తార్‌పూర్ కారిడార్‌పై వచ్చేనెల మొదటి వారంలో సరిహద్దుకు ఇవతల అట్టారి వద్ద మరో రౌండ్ చర్చలకు భారత్ ప్రతిపాదించింది. పాక్ దీనికి అంగీకరిస్తే భారత్, పాకిస్తాన్ అధికారుల మరో సమావేశం కానుంది.