మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజునే సభలో గందరగోళం జరిగింది. స్పీకర్ స్థానంలో ఉన్న భాస్కర్ జాదవ్ ని దుర్భాషలాడుతూ ఆయనపై చెయ్యి చేసుకున్నట్టు చెబుతున్న 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. ఈ రభస జరుగుతుండగా కేబిన్ లో ఉన్న ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్.. తమ పార్టీ సభ్యులు ఎవరినీ దూషించలేదని, ఎవరిపైనా చెయ్యి చేసుకోలేదని అన్నారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలన్నారు. అసలిదంతా కట్టు కథ అని..తమ పార్టీ నుంచి ఎవరూ అనుచిత చర్యలకు పాల్పడలేదన్నారు. తొలుత ఓబీసీ సమస్యపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఈ అంశంపై మాట్లాడేందుకు తమను అనుమతించాలని కోరగా భాస్కర్ జాదవ్ ఇందుకు నిరాకరించారని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ రభసతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. ఆ తరువాత కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కాగా విపక్ష సభ్యులు తన కేబిన్ లో ప్రవేశించి తనను దూషించారని,మ్యాన్ హ్యాండిల్ చేశారని(దౌర్జన్యం) ..పైగా దేవేంద్ర ఫడ్నవిస్, చంద్రకాంత పాటిల్ సమక్షంలోనే వారిలా ప్రవర్తించారని భాస్కర్ జాదవ్ పేర్కొన్నారు.
కాగా బీజేపీ ఎమ్మెల్యేల కథనం మరోలా ఉంది. భాస్కర్ జాదవ్ ని కలుసుకునేందుకు వెళ్లిన తమ సహచరులను ఆయన దూషించారని వారు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ స్పందిస్తూ.. ఈ రభస తాలూకు వీడియోను పోస్ట్ చేశారు. అసెంబ్లీ ప్రారంభమైన రోజే తీరు ఇలా ఉందన్నారు. అటు-మాజీ స్పీకర్ నానాపటోల్ రాజీనామా చేసి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేబట్టడంతో కొత్త స్పీకర్ ను సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంది. ఈ పోస్టు తమకే దక్కాలని బీజేపీ కోరుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: రంగంలోకి దిగిన యాక్షన్ కింగ్..!సర్కారు వారి పాటకు స్పెషల్ అట్రాక్షన్ నిలవనున్న అర్జున్ :Arjun in Sarkaru Vaari Paata video.