చందమామపై నీటి జాడ, కనుగొన్న నాసా !

చంద్రుని ఉపరితలంపై నీరు లేదని సుమారు దశాబ్దం క్రితం వరకు  శాస్త్రజ్ఞులు భావిస్తూ వచ్చారు. కానీ అది తప్పని తేలిపోయింది. అసలు అంచనా వేసినదానికన్నా ఎక్కువగా నీరు ఉందని నాసా శాస్త్రవేత్తలు ఇప్పుడు తేల్చారు.

  • Umakanth Rao
  • Publish Date - 9:02 am, Tue, 27 October 20

చంద్రుని ఉపరితలంపై నీరు లేదని సుమారు దశాబ్దం క్రితం వరకు  శాస్త్రజ్ఞులు భావిస్తూ వచ్చారు. కానీ అది తప్పని తేలిపోయింది. అసలు అంచనా వేసినదానికన్నా ఎక్కువగా నీరు ఉందని నాసా శాస్త్రవేత్తలు ఇప్పుడు తేల్చారు. సూర్య కాంతి పడిన చోట నీరు ఉన్నట్టు నేచర్ యేస్ట్రోనమీలో ప్రచురితమైన ఓ ఆర్టికల్ తెలిపింది. మొట్టమొదటిసారిగా చంద్రుని ఉపరితలంపై నీటి జాడ కనుగొన్నట్టు హవాయ్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ జియో ఫిజిక్స్, ప్లానెటాలజీ రీసెర్చర్, కో-ఆథర్ కూడా అయిన కేసీ హానిబాల్ వెల్లడించారు. గతంలో సూర్యరశ్మి పడని చోట నీరు కొంతవరకు ఉన్నట్టు భావించినప్పటికీ, సూర్య కాంతుల క్రేటర్లలోనూ  వాటర్ ఉందన్నట్టు ఆయన తెలిపారు. ఇన్ ఫ్రారెడ్ యేస్ట్రోనమీ (సోఫియా) కి సంబంధించిన స్ట్రాటోస్ఫెరిక్ అబ్జర్వేటరీనుంచి సేకరించిన డేటాను వినియోగించి..ఎయిర్ బోర్న్ టెలిస్కోప్ ద్వారా చంద్రుని ఉపరితలాన్ని తాము స్కాన్ చేసినట్టు హానిబాల్ వివరించారు. ఈ నీటిలో ఆక్సిజన్ ఉందని, దీనిని మంచినీటిగానే గాక, రాకెట్ ఫ్యూయెల్ గా కూడా వాడవచ్ఛునని  ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని హానిబాల్ పేర్కొన్నారు.

ఉపరితలంపై చాలాచోట్ల ఐస్ గడ్డ కట్టి ఉందని,  ఇందులో నీరు పుష్కలంగా ఉందని భావిస్తున్నారు.  లోతైన గోతుల వంటి చోట్ల ఇంకా నీటి జాడ ఉందేమో నాసా పరిశోధకులు తెలుసుకోగోరుతున్నారు. ఇప్పటికే చంద్రునిపై ప్లాట్స్ కోసం కొన్ని లక్షల డాలర్ల చార్జీలు చెల్లించి వాటిని ‘బుక్’ చేసుకున్నవారికి ఈ సంగతి తెలిస్తే ఎగిరి గంతేయరూ ?