సూర్యుడిపై పరిశోధనలు ఎంత వరకు వచ్చాయంటే..

, సూర్యుడిపై పరిశోధనలు ఎంత వరకు వచ్చాయంటే..

భానుడు. భాస్కరుడు. సూర్యనారాయణుడు. అర్కుడు. దినకరుడు. ప్రభాకరుడు, విభాకరుడు. ప్రభాత కిరణుడు, రవి. పేరు ఏదైనా అర్థం ఒక్కటే. భౌతిక దృష్టితో చూస్తే మండుతున్న అగ్నిగోళం సూర్యుడు. వైజ్ఞానిక సృష్టితో చూస్తే ఒక నక్షత్రం. ఉపాసనా కళ్లతో దర్శిస్తే సప్తాశ్వ రథమారూఢం. మనం చూసే కోణం ఎలా ఉన్నా..విషయం ఒక్కటే. ఇప్పుడా సూర్యుడులో ఏం జరుగుతుంది. మండుతున్న పదార్థాలు ఎన్ని కాలం పాటు వస్తాయి. ఎప్పటికీ ఆ భగ భగ మంటలు ఆరిపోయే ప్రమాదముంది. వాస్తవం ఏంటనే విషయం పై జరుగుతున్న పరిశోధనలు వేగవంతమయ్యాయి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు సూర్యుడిపై పరిశోధనలు సాగించాయి. ఇంకా సాగిస్తున్నాయి. ఇప్పుడు వారికి పోటీగా వచ్చింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో). నెల్లూరు శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ–ఎక్స్‌ఎల్‌ రాకెట్‌ ద్వారా ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని పంపనుంది ఇస్రో. ఇందుకు రంగం సిద్దమవుతోంది.

ఇస్రో ఏం చేస్తుందంటే :

ఖగోళశాస్త్రం ప్రకారం భానుడి వయసు నాలుగువందల అరవై కోట్ల సంవత్సరాలు. సృష్టి వయసూ ఇంచుమించు అంతే. సూర్యుడు వేలవేల నక్షత్రాల మధ్య ఓ మహానక్షత్రం. హైడ్రోజన్‌, హీలియంలతో నిండిన వాయుగోళం. దాని గురుత్వాకర్షణశక్తి కారణంగానే, భూమి సహా వివిధ గ్రహాలు సూర్యభ్రమణం చేస్తున్నాయి. సౌర వ్యవస్థలో తొంభై తొమ్మిదిశాతం దినకరుడి అధీనంలోనే ఉంది. సూర్యుడి వ్యాసం భూమి కంటే వందరెట్లు పెద్దది. భూమి మీద నుంచి ఏ రాకెట్టో ఎక్కి, భానుడి వద్దకు వెళ్లాలంటే పదిహేను కోట్ల మైళ్లు ప్రయాణించాలి. ఆ మహోజ్వల కాంతి భూమిని చేరడానికి ఎనిమిదిన్నర నిమిషాలు పడుతుంది. సూర్య కిరణాలు అనంత శక్తికేంద్రాలు. ఓ అరవై నిమిషాలు భూమిని తాకిన కిరణాలను సౌరశక్తిగా మార్చుకున్నా చాలు. ప్రపంచం మొత్తం ఏడాది పాటూ కరెంటు వాడుకోవచ్చు. భారతదేశం మీద సూర్యుడి కటాక్ష వీక్షణాలు ఎక్కువగానే ప్రసరిస్తాయి. ఏడాదిలో మూడొందల రోజులూ ఎండే ఉంటోంది.

చంద్రుడితో పోలిస్తే సూర్యుడు నాలుగువందల రెట్లు పెద్ద. చంద్రుడి కంటే నాలుగువందల రెట్లు దూరం ఉంటాడు సూర్యుడు. ఇప్పుడు ఆ సూర్యుడి పై పరిశోధనల కోసం భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2018–19 మధ్యలో దీనిని ప్రయోగించే అవకాశం ఉంది. ఇస్రో ప్రయోగించే ఈ ఉపగ్రహంలో యాస్‌పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్‌ అనే ఆరు ఉపకరణాలను (పేలోడ్స్‌) అమర్చి పంపనున్నారు. ఈ ఉపగ్రహం భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్‌ బిందువు–1 (ఎల్‌–1)లోకి చేరుస్తారు. అక్కడి నుంచి ఎలాంటి అవరోధాలు లేకుండా సూర్యుడ్ని నిరంతరం పరిశీలించే అవకాశముంటోంది. సూర్యుడి బాహ్య వలయాన్ని కరోనా అంటారు. సూర్య గోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు పది లక్షల డిగ్రీల కెల్విన్‌ (అంటే 999726.85 డిగ్రీల సెల్సియస్‌) వరకు ఉంటుందని అంచనా. భాస్కరుడు అంతర్భాగ ఉష్ణోగ్రత ఆరు వేల కెల్విన్‌ డిగ్రీల వరకు ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం తెలియడం లేదు. సౌర గోళంలో సౌర గాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై ఆదిత్య–ఎల్‌1 ద్వారా పరిశోధనలు చేయనుంది. ఫలితంగా ఆ జ్వాలలు పెరిగేందుకు దారి తీసిన కారణాలు తెలియనున్నాయి. అందుకే ఇస్రో పూర్తి స్థాయిలో పరిశోధనలు చేసేందుకు వీలవుతోంది.

సౌర తుపాన్‌ వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అడ్డంకి ఏర్పడుతోంది. అంతే కాదు…కాంతి మండలం (ఫొటోస్ఫియర్‌), వర్ణ మండలాలను (క్రోమోస్ఫియర్‌) అధ్యయనం చేసి సమాచారాన్ని తెలుసుకుంటారు. బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రంలో ఆదిత్య–ఎల్‌1ను తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నాసా లెక్కల ప్రకారం..

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ సూర్యుడిపై పరిశోధనకు ఓ వ్యోమనౌకను పంపనుంది. ‘సోలార్ ప్రోబ్ ప్లస్ మిషన్’ పేరిట చేపట్టనున్న ఈ ప్రయోగాన్ని వచ్చే ఏడాది నిర్వహించనుంది. భగభగమండే సూర్యుడి ఉపరితలం నుంచి ఆరు మిలియన్ల కిలోమీటర్ల దూరానికి ఓ వ్యోమనౌకను పంపుతారు. ‘సూర్యుడిపైకి పంపే తొలి వ్యోమనౌక ఇదే అవుతోంది. సూర్యుడి ఉపరితలం మీదికి ఇది వెళ్లలేదు. నాసా గొడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ పరిశోధకుడు ఎరిక్ క్రిస్టియన్ తెలిపిన వివరాల ప్రకారం సూర్యుడి వాతావరణం (కరోనా-రెండు మిలియన్ల డిగ్రీలు) కంటే ఉపరితలం (ప్రోటోస్పియర్-5500 డిగ్రీలు)పై ఉష్ణోగ్రత ఎందుకు తక్కువగా ఉంటుందనే అంశాన్ని పరిశీలించనున్నారు. సౌర గాలులు భారీ వేగాన్ని (గంటకు మిలియన్ మైళ్లు) ఎలా అందుకోగలుగుతున్నాయనే చిక్కుముడులు వీడనున్నాయి. సూర్యుడి నుంచి అప్పుడప్పుడు ఎందుకు అత్యంత శక్తిమంతమైన రేణువులు వెలువడుతున్నాయనే అంశం తెలుసుకునేందకుు ఈ పరిశోధనలు దోహదం చేయనున్నాయి. నాసా ఇప్పుడు సూర్యుడి సమీపానికి పంపే వ్యోమనౌకను ప్రయోగానికి సిద్దం చేస్తోంది. మరోవైపు ఇస్రో అదే పని చేస్తోంది. పలితంగా వాస్తవాలు వెలుగులోకి వచ్చే వీలుంది.

పురాణాల్లో భానుడు

మహాభారతంలోనూ సూర్యుడి ప్రస్తావన ఉంటోంది. తెలిసీ తెలియని వయసులో కుంతీదేవి సూర్యనారాయణుడిని ప్రార్థించిందట. ఫలితంగా ఆమెకు కర్ణుడు జన్మించాడని చెబుతుందా గ్రంధం. పాండురాజు రెండోభార్య మాద్రి పిల్లలైన నకుల సహదేవులు అశ్వినీదేవతల వరమే. అశ్వినుల తండ్రీ సూర్యుడే. ఇంట్లోంచి వెళ్లిపోయిన సంజ్ఞాదేవి అశ్వరూపంలో అడవుల్లో సంచరిస్తున్నప్పుడు, మగ గుర్రమై ఆమెతో రమిస్తాడు. అలా పుట్టినవారే అశ్వినీ దేవతలు. అశ్వమంటే కిరణమనే అర్థమూ ఉంది. అలనాటి చక్రవర్తులు, రాజులు తాము సూర్య వంశం వారిమని..కాదు కాదు తాము చంద్ర వంశస్థులమని చెప్పుకోవడం తెలియంది కాదు. శ్రీకాకుళంజిల్లా అరసవల్లిలోని ఆలయం క్రీస్తుపూర్వం నాటిది. హనుమకొండలోని వేయిస్తంభాల గుడిలో పూర్వం సూర్య విగ్రహమూ ఉండేది. ఒడిశాలోని కోణార్క్‌ సూర్యాలయం సంగతి తెలియంది కాదు. కోణార్క్‌ ఆలయం అద్భుత రథాకృతిలో ఉంటుంది. కాశీ క్షేత్రంలో సూర్యుడు ద్వాదశాదిత్యుడిగా పన్నెండు రూపాల్లో కొలువుదీరాడు. ఈ ఆలయాల్లో ఏడాదిలో ఒకటి రోజులు సూర్యుడి కిరణాలు నేరుగా వచ్చి గర్భగుడిలోని దేవుడి మీద పడతాయి. ఆ అరుదైన దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు పోటీలు పడటం ఎప్పటి నుంచో చూస్తున్నాం. అక్కడ పడిన సూర్య కిరణాలు పరావర్తనం చెంది భక్తుల పైకి ప్రసరిస్తాయి. అది వారికి శక్తిగా ఉపయోగపడుతుందని…శాస్త్రవేత్తల మాటగా ఉంది.

భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చిన్నప్పుడే మనం పాఠాల్లో చదువుకుంటాం. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో భూమి సూర్యుడికి చాలా దూరంగా ఉంటుంది. దీంతో ఆ కిరణాలు మనల్ని చేరుకోడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అందుకే ఆ సమయంలో ఎరుపురంగు ఎక్కువగా మన కంటికి చేరడం వల్లే సంధ్యాకిరణాలు బంగారపు రంగులో మెరిసిపోతుంటాయి. సూర్య నమస్కారాలు చేయమని వైద్యులు చెబుతారు. సూర్యకిరణాలు తగిలితే పరిపూర్ణ ఆరోగ్యం ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. అందుకే చిన్నారులను ఉదయం ఏడు గంటల లోపు, సాయంత్రం 5 గంటల తర్వాత సూర్య కిరణాలను తాకించాలని చెబుతారు పెద్దలు. వాస్తవంగా అలా చూపడం వల్ల డి విటమిన్ వస్తుందనేది నిజం. విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్న పనిలో పడి సౌరశక్తిని సరిగా వినియోగించుకోవడం లేదు ప్రభుత్వాలు. సూర్యుడు శక్తిని ఎవరైనా తీసుకోవచ్చు. అందుకే సౌరశక్తి పై ప్రభుత్వాలు దృష్టి పెడితే మంచిది. భారతదేశంలోని ప్రతి సూర్యక్షేత్రం వెనుకా ఓ ఖగోళపరమైన రహస్యం ఉంది. అపార సౌరశక్తి అక్కడ నిక్షిప్తమైనట్టు నిరూపించే పరిశోధనలు జరుగుతున్నాయి. అవి ఒక కొలిక్కి వస్తే మానవాళికి మరింత మేలు జరుగుతోంది.

కొండవీటి శివనాగరాజు
సీనియర్ జర్నలిస్టు, టీవీ9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *