మన్యంలో వింతకాంతులు..కెమెరాకు కూడా చిక్కడం లేదు.. ఏమిటీ మిస్టరీ..?

Mystery lighting in Manyam forest, మన్యంలో వింతకాంతులు..కెమెరాకు కూడా చిక్కడం లేదు.. ఏమిటీ మిస్టరీ..?

ఎన్నడూ లేనిది మన్యంలో వింతకాంతులు కనబడుతున్నాయి. రాత్రి వేళ.. కళ్లు జిగేల్ మనేలా.. మెరుపుల్లా వెలుగులు వెదజల్లుతున్నాయి. ఈ మధ్య భారీ వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన అరుదైన వింత వాతావరణ ప్రభావమో మరేమో కానీ.. చెట్ల మీద పరుచుకుంటున్న ఈ కాంతులు.. స్థానికులను సంభ్రమాశ్చర్యాలకు, ఆందోళనలకు గురిచేస్తున్నాయి. మన్యం అటవీ ప్రాంతం ఇలా ఒక్కసారిగా రాత్రివేళ పగలును తలపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా మన్యం ప్రాంతంలోని రాజవొమ్మంగి మండలం జడ్డంగి, వాతంగి గ్రామాల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వింతకాంతులను చూసేందుకు గిరిజనులు తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చారు. రాత్రి 11.30 నుంచి తెల్లవారు జాము వరకు ఈ వింతకాంతులు కనిపిస్తున్నాయి. అయితే వీటిని ఫోటో తీసేందుకు ఎంత ప్రయత్నించినా.. అవి కెమెరాకు చిక్కడం లేదని స్థానికులు చెబుతున్నారు. కాంతులు వచ్చిన చెట్ల వద్దకు వెళ్లిన ప్రజలు పరిశీలించి.. వాటి వద్ద పూజలు కూడా చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సోమవారం రాత్రి ఆ ప్రాంతంలో పర్యటించారు. అయితే దుష్టశక్తుల ప్రభావమని పుకార్లు రావడంతో.. గ్రామాల్లో జ్వరాలు పెరిగిపోతాయని గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే గతంలో కూడా ఇలా కాంతులు వచ్చాయని.. భయపడేది ఏం లేదని.. పోలీసులు ధైర్యం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *