దేశవ్యాప్తంగా వర్ష బీభత్సం.. ముంబైకి రెడ్ అలర్ట్..!

Monsoon 2019, దేశవ్యాప్తంగా వర్ష బీభత్సం.. ముంబైకి రెడ్ అలర్ట్..!

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. ఇంకా రెండు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వరదలకు రోడ్లు, రైలు మార్గాలు కొట్టుకుపోవడంతో.. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అటు ప్రజలను రక్షించడానికి కేంద్ర, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాయి. ఒడిశా ఉత్తర ప్రాంతం నుంచి ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ వరకు 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉంది. మరోవైపు రాజస్థాన్‌ దక్షిణ ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి ఉంది. వీటి కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం సోమవారం సాయంత్రం 4 గంటలకు 23.9 అడుగులకు చేరింది. భద్రాచలంలో స్నానఘట్టాలకు కింది భాగం నీట మునగడంతో హెచ్చరిక బోర్డులను పైకితీశారు. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి విద్యుత్తు కేంద్రం నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి.

ఇక వాణిజ్య రాజధాని ముంబైని వానలు వీడటం లేదు. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. మరో 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో.. ముంబై కార్పొరేషన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు జమ్మూకశ్మీర్‌లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రాంబన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *