టీ20 క్రికెట్‌లో ధోనీయే బెస్ట్ కెప్టెన్‌: మైఖేల్‌వాన్‌

MS Dhoni best white ball captain of this Era, టీ20 క్రికెట్‌లో ధోనీయే బెస్ట్ కెప్టెన్‌: మైఖేల్‌వాన్‌

ప్రస్తుత క్రికెట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ పరిమిత ఓవర్ల ఆటలో అత్యుత్తమ నాయకుడని, కోహ్లీ శక్తి సామర్థ్యాలు టెస్టుల్లో అతడిని ఉత్సాహభరితమైన కెప్టెన్‌గా నిలుపుతాయని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌వాన్‌ తెలిపాడు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన వాన్‌ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ‘ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ వన్డేల్లో ఉత్తమ కెప్టెన్‌ అని అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీ ఇప్పుడు కెప్టెన్సీ చేయకపోయినా నేను చూసిన బెస్ట్‌ కెప్టెన్‌ అతడే. వికెట్ల వెనుక నుంచి ఆటను అర్థం చేసుకునే విధానం, ఒత్తిడిని తట్టుకునే నేర్పు, బ్యాటింగ్‌ చేయగల నైపుణ్యం ధోనీలో ఉన్నాయి. అలాగే విరాట్‌కోహ్లీ టెస్టుల్లో బిజీగా ఉంటూ, ఉత్సాహంగా కనిపిస్తాడు. అతడు జీవితాంతం అద్భుత బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతాడు. కోహ్లీ కెప్టెన్సీ చేసే పద్ధతి నాకు చాలా నచ్చుతుంది’ అని వాన్‌ చెప్పుకొచ్చాడు.

నాయకత్వమనేది మైదానం బయటే ఎక్కువగా కనపడుతుందని, అక్కడే కెప్టెన్‌ వ్యూహాత్మకంగా ఆలోచిస్తాడని వాన్‌ అన్నాడు. అలా చేయడంవల్లే ఇతర ఆటగాళ్లను సమన్వయం చేసుకోవడం కెప్టెన్‌కు తేలికగా మారుతుందని తెలిపాడు. కెప్టెన్‌కు క్రికెట్‌పై పూర్తి అవగాహన ఉండడంతో పాటు ఆటగాళ్లను మేనేజ్‌ చేసే సత్తా ఉండాలన్నాడు. బయట ప్రజలతో వ్యవరించే తీరు, మీడియాతో మాట్లాడే పద్ధతి, జట్టుకు లక్ష్యాన్ని నిర్దేశించడం వంటివి నాయకత్వాన్ని ప్రతిబింబిస్తాయని చెప్పాడు. ఒక ఉత్తమ కెప్టెన్‌ తన జట్టుకు పరిమిత కాలంలో లక్ష్యాన్ని నిర్దేశిస్తాడని వాన్‌ పేర్కొన్నాడు. కాగా ధోనీ సారథ్యంలోని టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే ప్రపంచకప్‌ గెలుపొందింది. అలాగే 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీని సైతం సొంతం చేసుకుంది. ధోనీ టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టును ఉన్నతస్థితికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *