ఎమ్మార్వో సజీవ దహనం కేసు.. మరో “అపరిచితుడు” సురేష్..!

అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో కార్యాలయం… సోమవారం.. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతం.. ఎప్పటిలాగే ప్రజా దర్బార్ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే లంచ్ సమయం కావడంతో.. పిర్యాదులు తీసుకునే అధికారి అక్కడి నుంచి వెళ్లారు. అదే సమయంలో అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి తన రూంలో ఉన్నారు. అప్పుడే వచ్చాడు ఓ వ్యక్తి.. అతడే సురేష్.. ఎమ్మార్వోతో మాట్లాడాలంటూ పర్మిషన్ తీసుకుని.. తహశీల్దార్ రూంలోకి వెళ్లాడు. అయితే తన భూ తగాదాకు సంబంధించిన విషయంలో.. విజయారెడ్డితో కాసేపు మాట్లాడాడు. ఆ […]

ఎమ్మార్వో సజీవ దహనం కేసు.. మరో అపరిచితుడు సురేష్..!
Follow us

| Edited By:

Updated on: Nov 05, 2019 | 6:47 PM

అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో కార్యాలయం… సోమవారం.. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతం.. ఎప్పటిలాగే ప్రజా దర్బార్ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే లంచ్ సమయం కావడంతో.. పిర్యాదులు తీసుకునే అధికారి అక్కడి నుంచి వెళ్లారు. అదే సమయంలో అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి తన రూంలో ఉన్నారు. అప్పుడే వచ్చాడు ఓ వ్యక్తి.. అతడే సురేష్.. ఎమ్మార్వోతో మాట్లాడాలంటూ పర్మిషన్ తీసుకుని.. తహశీల్దార్ రూంలోకి వెళ్లాడు. అయితే తన భూ తగాదాకు సంబంధించిన విషయంలో.. విజయారెడ్డితో కాసేపు మాట్లాడాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం జరగడం.. ఆ తర్వాత వెంట తీసుకొచ్చిన బాటిల్‌లోని పెట్రోల్‌ను ఆ ఎమ్మార్వోపై పోసి.. నిప్పంటించాడు. ఆ తర్వాత హాహాకారాలు పెడుతూ.. మంటల్లో చిక్కుకుని తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం అయ్యారు. ఈ ఘటనలో నిందితుడు సురేష్ కూడా తనకు తాను పెట్రోల్ పొసుకుని నిప్పంటించుకున్నాడు. అదే సమయంలో ఎమ్మార్వోను కాపాడే ప్రయత్నం చేసిన ఇద్దరు సిబ్బంది కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. అందులో విజయారెడ్డి డ్రైవర్ గురునాథం చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. నిందితుడు సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దాదాపు 35 శాతం గాయాలవ్వడంతో.. సురేష్‌ను కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ కేసు 24 గంటల్లోనే అనేక మలుపులు తిరుగుతూ ట్విస్టులపై ట్విస్టులు ఇస్తోంది. ముఖ్యంగా నిందితుడి సురేష్ మనస్తత్వంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

నిందితుడు ఎమ్మార్వో విజయారెడ్డిని హత్యచేసేందుకు పక్కా ప్లాన్ వేసి హతమార్చాడన్న అనుమానాలు తలెత్తుతుండగా.. అతని గురించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. వాస్తవానికి తన భూమికి సంబంధించిన కేసు.. కోర్టులో ఉంది. అయితే అదే సమయంలో పాస్‌బుక్‌ అప్డేట్ చెయ్యాలంటూ.. ఎమ్మార్వోను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరోవైపు నిందితుడి తల్లిదండ్రులు.. ఈ ల్యాండ్ విషయం గురించి తమకేం తెలిదనడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే సురేష్ మానసిక పరిస్థితి వింతగా ఉంటుందని తనకు సంబంధించిన వారు చెబుతున్నారు.

అపరిచితుడు సినిమాలో.. విక్రమ్ వ్యవహారంలా ఉంటుందని గ్రామస్థుల ద్వారా తెలుస్తోంది. తనకు సంబంధించిన విషయంపై ఖచ్చితంగా ఉంటూ.. తనకు అనుకూలంగా వ్యవహరించకపోతే.. ప్రభుత్వాధికారులతో తరుచూ గొడవ పడే మనస్తత్వం అని తెలుస్తోంది. ట్రాఫిక్ పోలీసులు బండి ఆపితే.. డాక్యుమెంట్లు అన్నీ చూపిన తర్వాత.. సదరు అధికారి తనను పట్టించుకోకపోతే.. వారిపై కూడా వాగ్వాదానికి దిగేవాడని తెలుస్తోంది. తన దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నా.. తనను పంపించకుంటా.. ఎందుకు తన సమయాన్ని వృథా చేస్తున్నారంటూ గొడవ పడే సందర్భాలు అనేకమని తెలుస్తోంది. అంతేకాదు.. గతంలో కూడా అనేక మార్లు గ్రామ సభల్లో రెవెన్యూ అధికారులతో గొడవ పడినట్లు సమాచారం. తన సమస్య అనుకున్న సమయంలో పరిష్కారం కాకపోతే.. తీవ్ర ఒత్తిడికి గురై వారితో ఘర్షణ పడే అలవాటు ఉందని తెలుస్తోంది. అయితే ఈ వీక్ పాయింట్‌ను అవకాశంగా తీసుకుని.. ఏవరైనా సురేష్‌ను ఎమ్మార్వో విజయారెడ్డిని హతమార్చేందుకు ఉసిగొల్పి ఉంటారన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. మరోవైపు ఎన్నో రోజుల నుంచి పాస్ బుక్ కోసం ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నానని.. లంచం అడిగినందుకే.. ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సురేష్ పొలీసు విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అసలు ఈ భూ వివాదం కోర్టులో ఉండగా.. పాస్ బుక్ అంటూ తిరగడం.. ఎమ్మార్వో హత్యకు గురవ్వడం అన్నీ.. అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మార్వో విజయారెడ్డిని హతమార్చేందుకు సురేష్‌ను ఎవరైనా ఉసిగొల్పారా అన్న కోణంలో కూడా కేసు దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సురేష్ మానసిక పరిస్థితి కూడా అపరిచితుడి మాదిరిగా ఉండటమే ఈ ఘోరానికి దారితీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు సురేష్ ఆస్పత్రిలో చికిత్స పోందుతున్నాడు.