హాంకాంగ్..ఒక్క బిల్లుపై పోటెత్తిన ప్రొటెస్ట్..

హాంకాంగ్ లో ఆదివారం ప్రజా సముద్రం వెల్లువెత్తింది. సుమారు 10 లక్షల మందికి పైగా ఆందోళనకారులు వీధుల్లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేస్తూ ముందుకు సాగారు. వివాదాస్పదంగా మారిన నేరస్తుల అప్పగింత బిల్లును వ్యతిరేకిస్తూ సాగిన ఈ ప్రొటెస్ట్.. చాపకింద నీరులా కనీవినీ ఎరుగని టెన్షన్ ని సృష్టించింది. హాంకాంగ్ నుంచి నేరస్తుల అప్పగింతకు సంబంధించి చైనా ఈ బిల్లును తెచ్చింది. 1997 లో హాంకాంగ్ నగరాన్ని చైనా తన స్వాధీనం చేసుకున్న అనంతరం ఇంత పెద్ద ఎత్తున ప్రదర్శన జరగడం ఇదే మొదటిసారి. దీనికి నేతృత్వం వహించిన సివిల్ హ్యూమన్ రైట్స్ ఫ్రంట్.. ఈ మహా నిరసనలో పది లక్షల ముఫై వేలమందికి పైగా పాల్గొన్నట్టు ప్రకటించగా.. పోలీసులు మాత్రం దాదాపు రెండున్నర లక్షల మంది పాల్గొన్నట్టు పేర్కొన్నారు. ఈ నగరంలో నివసించే ఎవరినైనా రాజకీయ కారణాలతోనో లేదా వ్యాపార సంబంధ నేరాలకు పాల్పడ్డారనే అభియోగాలతోనో చైనా అధికారులు అరెస్టు చేయడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. పైగా ఈ నగరానికి గల సెమి-అటానమస్ లీగల్ సిస్టం ని ఇది దెబ్బ తీసేదిగా ఉందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. చైనా నుంచి విడిపోయాక హాంకాంగ్ కు పాక్షిక స్వయం ప్రతిపత్తి లభించింది. అయితే హాంకాంగ్ ను చైనా ఇంకా తన గుప్పిట్లోనే ఉంచుకుని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ఈ సిటీలో కన్సర్వేటివ్ అనుకూల వ్యాపారవర్గాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ బిల్లు వీరిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వర్గాల మధ్య తరచూ ఘర్షణలు జరగడం, ఇందుకు అమెరికా, యూరోపియన్ యూనియన్ బాధ్యులంటూ హాంకాంగ్ పాలకవర్గం ఆరోపించడంతో ఇది రాజకీయ సంక్షోభాన్ని సృష్టించింది.
సంఘ విద్రోహులు, నేరస్థులను తైవాన్, మకావూ, చైనా వంటి దేశాలకు పంపివేయాలా, లేక ఇక్కడే విచారణ జరపాలా అన్న అంశంపై కేసుల వారీగా నిర్ణయించేందుకు ప్రస్తుత చట్టంలోని లొసుగులను తొలగించడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తోందని చైనా ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ బిల్లు నిబంధనల ప్రకారం వారి విచారణ సరిగా జరుగుతుందా, లేదా అన్న గ్యారంటీ లేదని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. కాగా-‘ హాంకాంగ్ నెవర్ గివప్ ‘ అని నినాదాలు చేస్తూ ప్లకార్డులు చేతబట్టుకుని నిరసనకారులు సెంట్రల్ హాంకాంగ్ లోని విక్టోరియా పార్క్ వద్ద ఆదివారం నిర్వహించిన భారీ ప్రదర్శన నగరాన్ని ఓ కుదుపు కుదిపింది. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ రాజీనామా చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. మూడు కి.మీ. మేరా సాగిన ఈ ప్రొటెస్ట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వరకు సాగింది. ఒక దశలో వీరి ఆందోళన హింసాత్మకంగా మారడంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. అటు-ఆదివారం రాత్రి పొద్దుపోయాక..
హాంకాంగ్ ప్రభుత్వం ఓ స్టేట్ మెంట్ విడుదల చేస్తూ.. ఈ బిల్లుపై ఇంకా ఈ నెల 12 న విస్తృత చర్చ జరగాల్సి ఉందని, లెజిస్లేటివ్ కౌన్సిల్ దీనిని కూలంకషంగా స్క్రూటినీ చేయాల్సి ఉందని పేర్కొంది. హాంకాంగ్ నగరాన్ని సురక్షితంగా, అన్ని వర్గాలూ శాంతి, సామరస్యాలతో జీవించేందుకు అంతా సహకరించాలని ప్రభుత్వం కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *