కరోనా కష్టకాలంలో ఖాకీల మానవీయ కోణం మరువలేనిది: ప్రధాని

కరోనా సంకట పరిస్థితుల్లో పోలీసుల సేవలు ప్రశంసనీయమని.. కరోనా కట్టడిలో పోలీసులే ముందుండి పోరాడుతున్నారన్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఐపీఎస్ ప్రొబెష‌న‌రీ ఆఫీస‌ర్ల‌ శిక్ష‌ణ కాలం ముగిసింది.

కరోనా కష్టకాలంలో ఖాకీల మానవీయ కోణం మరువలేనిది: ప్రధాని
Follow us

|

Updated on: Sep 04, 2020 | 12:37 PM

కరోనా సంకట పరిస్థితుల్లో పోలీసుల సేవలు ప్రశంసనీయమని.. కరోనా కట్టడిలో పోలీసులే ముందుండి పోరాడుతున్నారన్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఐపీఎస్ ప్రొబెష‌న‌రీ ఆఫీస‌ర్ల‌ శిక్ష‌ణ కాలం ముగిసింది. ఇవాళ హైద‌రాబాద్‌లోని స‌ర్ధార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మీలో దీక్షంత్ ప‌రేడ్ నిర్వహించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ .. ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌ను ఉద్దేశించి వీడియో సందేశం అందించారు. కరోనా వేళ మానవతా దృక్పథంతో సేవలందిస్తున్న పోలీసులను ప్రధాని అభినందించారు. కరోనా కష్ట కాలంలో ఖాకీల మానవీయ కోణం ప్రజలకు తెలిసిందన్న మోదీ.. ఈ కష్టకాలంలో పోలీసుల పాత్రను చరిత్రలో లిఖించారన్నారు. ఐపీఎస్‌ ప్రొబేషనర్లను గతంలో ఇంటికి ఆహ్వానించే వాడిని. కొవిడ్‌ కారణంగా ముఖాముఖి కలుసుకోలేకపోతున్నా. త్వరలోనే మీతో సమావేశమవుతానని మోదీ తెలిపారు.

ఖాకీ దుస్తులను చూసి గర్వపడాలి తప్ప అహంభావం ఉండకూడదని ప్రధాని మోదీ అన్నారు. ప్రజా సేవలో ఉండే అధికారులు ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని మోదీ తెలిపారు.పోలీసులు ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ప్రాణాయామం ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని అన్నారు. పనిచేసే చోట ఉపాధ్యాయులు, నిపుణులతో నెలకోసారైనా భేటీ కావాలన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, సహాయక మంత్రి కిషన్‌రెడ్డి, జితేంద్రసింగ్‌, వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా, ఈ ఏడాది 131 మంది ఐపీఎస్‌ అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. 121 మంది 2018 బ్యాచ్‌కు చెందినవారు కాగా.. మరో 10 మంది 2017 బ్యాచ్‌కు చెందినవారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 28 మంది మహిళా ప్రొబేషనర్లు కూడా ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 11 మందిని తెలంగాణకు, ఐదుగురిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌కు తమిళనాడు కేడర్‌కు చెందిన కిరణ్‌ శృతి నాయకత్వం వహించారు.