గాంధీనగర్ డివిజన్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాదయాత్ర ప్రారంభం.. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అభ్యర్థన..

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీనగర్ డివిజన్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాదయాత్ర ప్రారంభించారు‌. డివిజన్‌లోని పలు బస్తీలు, కాలనీల్లో పాదయాత్ర చేస్తూ, ప్రజలను పలకరిస్తున్నారు.

  • uppula Raju
  • Publish Date - 12:09 pm, Sun, 29 November 20

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీనగర్ డివిజన్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాదయాత్ర ప్రారంభించారు‌. డివిజన్‌లోని పలు బస్తీలు, కాలనీల్లో పాదయాత్ర చేస్తూ, ప్రజలను పలకరిస్తున్నారు. దాదాపు 500 మందికి పైగా కార్యకర్తలు, నాయకులతో కలిసి పాదయాత్ర చేస్తున్నారు. ముషీరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా పద్మ నరేష్, నాయకులు జైసింహ, శ్రీధర్ రెడ్డి పాదయాత్రలో కవిత వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఆరేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, టీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలతో పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

ఇప్పుడున్న హైదరాబాద్, గత ఆరేండ్ల కిందటి హైదరాబాద్‌ను ఒకసారి ఓటర్లు భేరీజు వేసుకోవాలన్నారు. జాతీయ పార్టీలు చాలా ఏళ్లు అధికారంలో ఉన్నా హైదరాబాద్‌ను ఏనాడు పట్టించుకోలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నగరం రూపురేఖలు మార్చేసిందన్నారు. అద్దంలా మెరిసే రోడ్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, ఈ కామర్స్ మొదలైనవన్ని టీఆర్ఎస్ వల్లే సాధ్యమయ్యాయన్న విషయం ప్రజలు గుర్తించాలన్నారు. హైదరాబాద్‌కు వరదలు వస్తే ఏ ఒక్క పార్టీ కానీ, నాయకుడు కానీ పట్టించుకోలేదు కానీ మన టీర్ఎస్ ప్రభుత్వం నష్టపోయిన కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. ఈ ఎన్నికల తర్వాత మిగిలిన వారికి కూడా పదివేల ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు. కరోనా సమయంలో కూడా పనిచేసిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని కొనియాడారు. టీఆర్ఎస్‌కు ఓటు వేసి హైదరాబాద్‌ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అమూల్యమైన ఓటుతో అభ్యర్థులందరిని గెలిపించుకోవాలని సూచించారు.