ప్రమాణ స్వీకారోత్సవానికి రోజా డుమ్మా?

ఏపీ కేబినెట్ ప్రమాణ స్వీకారం పూర్తయ్యింది.. కొత్త మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు. సీనియర్లు, జూనియర్లు, మహిళలు, యువతతో జగన్ టీమ్ సమతూకంతో ఉంది. అయితే మంత్రివర్గంలో స్థానం దక్కని నేతలు కొందరు అలక పాన్పు ఎక్కినట్లు కనిపిస్తోంది. ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టడం ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోస్తోంది. రోజాతో పాటు మరో ఇద్దరు ముగ్గురు నేతలు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే రోజా శుక్రవారం సాయంత్రమే అమరావతి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ జాబితా విడుదల కాగానే.. ఆమె అమరావతి నుంచి బయల్దేరి వెళ్లినట్లు సమాచారం. ఆమె హైదరాబాద్ వెళ్లారా.. సొంత నియోజకవర్గమైన నగరికి వెళ్లారా అన్నది క్లారిటీ లేదట. మంత్రి పదవి దక్కకపోవడంతో రోజా అక్కడి నుంచి వెళ్లిపోయారా.. లేక మరేదైనా వ్యక్తిగత కారణాలున్నాయా అన్నది తెలియాల్సి ఉంది. రోజాతో పాటూ మరికొందరు నేతలు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి రాలేదట.

రోజా మంత్రి పదవిపై ఆశపెట్టుకున్నారు. స్పీకర్ పదవైనా వస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఆమెకు పదవి దక్కలేదు. రోజాకు మంత్రి పదవి ఖాయమని అనుచరులు కూడా భావించారు. శుక్రవారం జరిగిన వైసీపీఎల్పీ సమావేశానికి వచ్చిన రోజా.. మీడియాతోనూ మాట్లాడారు. జగన్ ఏ బాధ్యత అప్పగించినా సమర్థంగా నిర్వర్తిస్తానని చెప్పుకొచ్చారు. తనది ఐరెన్ లెగ్ కాదు.. గోల్డెన్ లెగ్ అంటూ మరోసారి ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. ఇటు మహిళా కోటాలో హోంమంత్రి పదవి దక్కబోతుందని కొద్దిరోజులుగా ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఆమెకు పదవి దక్కకుండా పోయింది. రోజాకు పదవి దక్కకపోవడం ఆమె అనుచరుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *