క్లాస్ రూంలోనే పెళ్లి చేసుకున్న మైనర్ విద్యార్థులు.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న పెళ్లి వీడియో..

పెద్దలు లేరు, పెళ్లి పీటలు లేవు, భజంత్రీలు లేవు, బంధువులు ఎవరూ లేరు, చివరికి వారిద్దరికి పెళ్లి వయసు కూడా లేదు.

  • uppula Raju
  • Publish Date - 11:30 am, Thu, 3 December 20
క్లాస్ రూంలోనే పెళ్లి చేసుకున్న మైనర్ విద్యార్థులు.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న పెళ్లి వీడియో..

పెద్దలు లేరు, పెళ్లి పీటలు లేవు, భజంత్రీలు లేవు, బంధువులు ఎవరూ లేరు, చివరికి వారిద్దరికి పెళ్లి వయసు కూడా లేదు. అయినా ఇద్దరు ఒక్కటయ్యారు, తరగతి గదినే పెళ్లిమండపంగా మార్చేసింది ఆ జంట. చదువుకుంటామని కాలేజీకి వెళ్లిన ఆ టీనేజర్స్ ఏకంగా క్లాస్ రూంలోనే పెళ్లి చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఇంటర్ విద్యార్థుల పెళ్లి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇద్దరు మైనర్లు కాలేజీలో పెళ్లి చేసుకోవటం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థినికి, అదే కాలేజీలో ఇంటర్ చేస్తున్న మరో విద్యార్థి క్లాసురూంలోనే పసుపు కొమ్ముతో తాళి కట్టేశాడు. క్లాసు రూంలో ఎవరూ లేరు. వారిద్దరే ఉన్నారు. తెలిసి తెలియని వయసులో ఒక్కటయ్యారు. క్లాస్ రూం బెంచ్‌లు, చదువుకుంటున్న బుక్సే సాక్ష్యాలుగా నిలిచాయి. ఒకరినొకరు ఇష్టపడ్డాం పెళ్లి చేసుకున్నాం అనేది వారి వెర్షన్. కానీ పెద్దలు దీనిని ఆమోదిస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మిగిలింది.

కాలేజీలో మైనర్ల పెళ్లి విషయం తెలిసి తల పట్టుకున్నారు తల్లిదండ్రులు. చదువుకోమని కాలేజీకి పంపితే ఇంతగా ముదిరిపోతారా అని ముక్కున వేలేసుకుంటున్నారు స్థానికులు. ఇంత ఘనకార్యం చేసిన ఇద్దరు విద్యార్థులకు కాలేజీ ప్రిన్సిపాల్ టీసీలు ఇచ్చి పంపించారని సమాచారం. వారి పెళ్లి పెద్ద అదే పక్కన ఉండి వారి పెళ్లి వీడియో తీసిన అమ్మాయిని కూడా సస్పెండ్ చేశారని తెలుస్తోంది. నవంబర్ 17న వీరిద్దరు పెళ్లి చేసుకోగా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియోలో చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారింది. అయితే లైకుల కోసమే మేము ఇలా చేశామని చెప్పుకొచ్చింది ఈ జంట. అయితే ప్రిన్సిపాల్ గట్టిగా నిలదీసేసరికి అసలు విషయం ఒప్పుకున్నారు ఈ జంట.