సాయికి ప్రేమతో.. జీహెచ్‌ఎంసీపై కన్నేసిన తలసాని..!

Minister Talasani Srinivas Yadav eyes GHMC Elections for his son?, సాయికి ప్రేమతో.. జీహెచ్‌ఎంసీపై కన్నేసిన తలసాని..!

టీఆర్ఎస్‌ పార్టీలో కీలకంగా వినిపించే నాయకుల పేర్లలో తలసాని శ్రీనివాస్ ఒకరు. రాష్ట్ర విభజనకు ముందు టీడీపీలో ఉన్న ఆయన.. 2014 ఎన్నికల్లోనూ ఆ పార్టీ తరపునే పోటీ చేసి గెలుపొందారు. ఇక ఆ తరువాత టీఆర్ఎస్‌ పార్టీలోకి జంప్ అయిన తలసాని.. అప్పటి నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు అత్యంత సాన్నిహిత్యంగా ఉంటూ వస్తున్నారు. దీంతో ఆయనకు అప్పట్లో మంత్రి పదవిని ఇచ్చారు కేసీఆర్. ఇక 2018లోనూ మరోసారి సీఎం కుర్చీని కేసీఆర్‌ సొంతం చేసుకోగా.. మరోసారి ఆయన కేబినెట్‌లో తలసాని స్థానం దక్కించుకున్నారు.

అయితే ఆయనను మరో బాధ వెంటాడుతోంది. అదేంటంటే.. తలసాని వారసుడు సాయి కిరణ్ రాజకీయ భవితవ్యం ఏమిటనే ప్రశ్న. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడిని ప్రత్యక్ష ఎన్నికల్లోకి తీసుకొచ్చారు తలసాని. అంతకుముందు తలసాని శ్రీనివాస్ సేవా సమితి పేరిట కొన్ని కార్యక్రమాలు నిర్వహించే సాయి కిరణ్.. సికింద్రాబాద్ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున ఎంపీగా పోటీ చేశారు. అయితే టీఆర్ఎస్ అధిష్టానం ఈ స్థానాన్ని సాయికి కేటాయించే వెనుక తలసాని కష్టం చాలానే ఉందన్నది చాలా మందికి తెలిసిన విషయం. అందుకు తగ్గట్లుగా సాయి కూడా బాగానే ప్రచారం చేశారు. అయితే అనూహ్యంగా ఆ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి గెలిచారు. అంతేకాదు మోదీ 2.0 కేబినెట్‌లో స్థానం కూడా సంపాదించుకున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు సాయికి మరో అవకాశం ఇచ్చేలా టీఆర్ఎస్‌తో సంప్రదింపులు జరుపుతున్నారట తలసాని. మామూలుగా 2021కు జీహెచ్‌ఎంసీ మేయర్ పదవీకాలం ముగియనుంది. అయితే ముందుగానే ఈ ఎన్నికలను నిర్వహించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం యోచనలో ఉందట. ఈ క్రమంలో ఈ ఏడాది చివరి లోగా జీహెచ్‌ఎంసీ ఎలక్షన్లకు కేసీఆర్ ప్రభుత్వం సిద్ధమౌతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సారి టీఆర్ఎస్ పార్టీ తరఫున తన కుమారుడికి టికెట్ లభించేలా తలసాని తాపత్రయ పడుతున్నారట. దీనిపై టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో సైతం సంప్రదింపులు జరుపుతున్నారట తలసాని. ఇక ఈ విషయంపై కేటీఆర్ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సారి జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తలసాని కీలకం కానున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *