కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ.. జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్ సర్టిఫికేషన్ లేబరేటరీ ఏర్పాటుకు విజ్ఞప్తి

హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్ సర్టిఫికేషన్ లేబరేటరీ ఏర్పాటు చేయాలని కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.

కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ.. జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్ సర్టిఫికేషన్ లేబరేటరీ ఏర్పాటుకు విజ్ఞప్తి
Follow us

|

Updated on: Jan 20, 2021 | 4:59 PM

KTR letter to Harsha Vardhan : కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌కు ఐటీ, పుర‌పాల‌క, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్ సర్టిఫికేషన్ లేబరేటరీ ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. జీనోమ్ వ్యాలీలో ప్రభుత్వ మెడికల్ స్టోర్ డిపో కూడా ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. జీనోమ్ వ్యాలీ ప్రపంచ వ్యాక్సిన్ తయారీ రాజధానిగా ఉందని గుర్తుచేశారు. ఆరు బిలియన్ డోసులను ఇక్కడి బయోటెక్ కంపెనీలు తయారు చేస్తున్నాయని కేటీఆర్‌ తెలిపారు.

హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో తయారవుతున్న ఔషధాలకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఇంతటి ప్రాధాన్యత కలిగి ఉన్నందునే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స‌హా 80 దేశాలకు చెందిన రాయబారులు జీనోమ్ వ్యాలీని సందర్శించారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. కొవిడ్- 19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్ తయారీపై వివరాలు అడిగి తెలుసుకున్నార‌ని కేంద్రమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

దేశంలోనే అత్యధికంగా వ్యాక్సిన్లను తయారుచేస్తున్న జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్ లాబరేటరీని ఏర్పాటు చేయాలని గతంలో ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో వ్యాక్సిన్ తయారీకి సంబంధించి మరింత వేగంగా కార్యక్రమాలు నిర్వహించాలంటే హైదరాబాద్ఋలో ప్రత్యేక టెస్టింగ్ లేబరేటరీ ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్‌ల తయారీకి సంబంధించి సెంట్రల్ డ్రగ్ లేబరేటరీ హిమాచల్‌ప్ర‌దేశ్‌లోని కసౌలిలో ఉన్నదని, ప్రతిసారి అక్కడికి తమ వ్యాక్సిన్లను పంపి పరీక్షించడం, సర్టిఫికేషన్ పొందడంలో హైదరాబాద్ బయోటెక్ కంపెనీలు సమయాభావాన్ని ఎదుర్కొంటున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.

కేంద్ర ప్రభుత్వం జీనోమ్ వ్యాలీ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో దేశంలోనే అతిపెద్ద నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిందన్నారు. ఈ సంస్థకు కావాల్సిన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందించిందన్న కేటీఆర్.. ప్రత్యేకంగా వ్యాక్సిన్లు, మెడికల్ డివైస్ టెస్టింగ్, సర్టిఫికేషన్ బాధ్యత కూడా ఉంద‌న్నారు.

అలాగే, ప్రస్తుతం కోల్‌క‌తా, ముంబై, చెన్నై, కర్నూలులో మాత్రమే ఉన్న ప్రభుత్వ మెడికల్ స్టోర్ డిపోను తెలంగాణలో ఏర్పాటు చేయాలని మంత్రి తన లేఖలో కేంద్రాన్ని కోరారు. ఈ డిపో ఏర్పాటును అంతర్జాతీయ ప్రమాణాలతో డాటా మానిటరింగ్ అండ్ ట్రాకింగ్ సిస్టం వంటి సౌకర్యాలతో ఏర్పాటు చేస్తే ఆయా కంపెనీల భవిష్యత్తు ప్రణాళికలకు, భారత వ్యాక్సిన్ తయారీ రంగానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

Read Also…. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్యాలయంలో ఏసీబీ సోదాల కలకలం.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎండీ భాస్కరాచారి..!