హైదరాబాదులో పాల ఏటీఎం

ఇప్పటివరకు నగదు ఏటీఎంలు, వాటర్ ఏటీఎంలు చూశాం. ఇకపై పాల ఏటీఎంలు సర్వీసును అందించనున్నాయి.

  • Ram Naramaneni
  • Publish Date - 3:00 pm, Sat, 24 October 20

ఇప్పటివరకు నగదు ఏటీఎంలు, వాటర్ ఏటీఎంలు చూశాం. ఇకపై పాల ఏటీఎంలు సర్వీసును అందించనున్నాయి. ఎల్బీనగర్‌ పరిధిలో ఉన్న హస్తినాపురం డివిజన్‌ హనుమాన్‌నగర్‌ చౌరస్తాలో ‘పాల సరఫరా ఏటీఎం’ కేంద్రం శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయంతో ఆ ప్రాంత ప్రజలు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలను తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. దీనిలోకి ప్రవేశించిన వినియోగదారులు అవసరాల మేరకు అక్కడ ఉండే లీటర్‌, అర లీటర్‌, పావు లీటర్‌ బటన్ నొక్కగానే ఆ మేరకు పాలు ఒక పాత్రలోకి వస్తాయి. ఇలా యంత్రం నుంచి బయటకి వచ్చిన పాలను ఇళ్లకు తీసుకెళ్లేందుకు వీలుగా వారు తమ వెంట బాటిల్ లేదా డబ్బాను తెచ్చుకోవాలి. డబ్బులను మాత్రం అక్కడ ఉండే స్టాఫ్‌కు ఇవ్వాల్సి ఉంటుంది.  మార్కెట్‌ ధరల ప్రకారమే మిల్క్ ఏటీఎంల వద్ద పాల రేట్లు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ తరహా ఏటీఎం రాష్ట్రంలోనే మొదటిదని, నిత్యం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దీని సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్రంలోనే ఫస్ట్ పాల ఏటీఎం ను శ్రీ గీతా డెయిరీ చైర్మన్ లక్ష్మీనరసింహగుప్తా ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి శుక్రవారం (అక్టోబర్ 23,2020)న ప్రారంభించారు. (‘బాహుబ‌లి’ సినిమాకు వీరాభిమాని ఈ తైవాన్ మంత్రి )