గణపతి బాటలో మల్లోజుల వేణుగోపాల్‌ లొంగుబాటు?

మావోయిస్టు పార్టీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లోగిపోతున్నారన్న ప్రచారం జరుగుతున్న కొన్ని గంటలకే, మరో అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి లొంగుపోయేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు సంచలనంగా మారాయి.

గణపతి బాటలో మల్లోజుల వేణుగోపాల్‌ లొంగుబాటు?
Follow us

| Edited By:

Updated on: Sep 02, 2020 | 4:25 PM

మావోయిస్టు పార్టీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పద్నాలుగు ఏళ్ల పాటు నిషేధిత మావోయిస్టు పార్టీ సారధ్య బాధ్యతలు నిర్వహించిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లోగిపోతున్నారన్న ప్రచారం జరుగుతున్న కొన్ని గంటలకే మరో అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి లొంగుపోయేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు సంచలనంగా మారాయి.

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్‌ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ భూపతి కూడా లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలంగాణ పోలీసుల వద్ద ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి గణపతి అలియాస్‌ ముప్పాల లక్ష్మణరావుతోపాటే వేణుగోపాల్‌ కూడా లొంగిపోయేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.

2018, డిసెంబర్ 4న జరిగిన ఎన్ కౌంటర్ లో వేణుగోపాల్ భార్య తారక్క చనిపోయారు. సుదీర్ఘకాలంగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వేణుగోపాల్, ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లే లొంగుబాటు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మావోయిస్టు పార్టీలో అగ్రనాయకత్వంలో పనిచేసిన కిషన్‌జీ అలియాస్‌ మల్లోజుల కోటేశ్వరరావుకు వేణుగోపాల్‌ తమ్ముడు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లికి చెందిన వేణుగోపాల్ 70వ దశకంలో భార్య తారక్కతో కలిసి పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ ద్వారా విప్లవోద్యమంలోకి ప్రవేశించారు.

2011లో ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీ మృతి చెందిన తర్వాత వేణుగోపాల్‌ను పశ్చిమ బెంగాల్‌లోని ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న లాల్‌గఢ్‌ ఉద్యమానికి నాయకునిగా నియమించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, చత్తీ‌స్ గఢ్‌ పోలీసులు మల్లోజుల వేణుగోపాల్‌ తలపై పెద్ద మొత్తాన్ని రివార్డుగా ప్రకటించారు. పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌లో నాయకుడిగా మల్లోజుల వేణుగోపాల్‌ అ లియాస్‌ భూపతి అలియాస్‌ సోను అలియాస్‌ మాస్టర్‌ అలియాస్‌ అభయ్‌ పేర్లతో పనిచేశారు.

మహారాష్ట్రంలోని గడ్చిరోలి మావోయిస్టు దండకారణ్య ప్రత్యేక జోనల్‌ కమిటీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2010లో చెరుకూరి రాజ్‌కుమార్‌ అలియాస్‌ ఆజాద్‌ మరణం తర్వాత వేణుగోపాల్‌ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధిగా నియమితుడయ్యారు. పార్టీ ప్రచురణల విభాగంలోనూ బాధ్యతలు నిర్వహించారు. 2010లో దంతెవాడ ఘటనలో 70 మందికిపైగా సీఆర్‌పీఎఫ్‌ బలగాలు మృతి చెందడం వెనక వేణుగోపాల్‌ ప్రమేయం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

మావోయిస్టు ఇద్దరు అగ్రనేతలు తెలంగాణ పోలీసుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఛత్తీస్ గఢ్ లో లొంగిపోతే ఆ తర్వాత వేధింపులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, తెలంగాణలో తొలి నుంచీ అలాంటి పరిస్థితులు లేవని భావించడం వల్లే మావోయిస్టు నేతలు, ఇక్కడ లొంగిపోవడానికి సిద్ధపడినట్టు తెలుస్తోంది.