మమతా బెనర్జీ ఆలపించిన జాగో దుర్గ పాటకు మిశ్రమ స్పందన, ఉద్యోగాలు కావాలంటున్న యువత

బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కళలంటే అపారమైన ప్రేమ! ఆమె కళావిశారద..! ఆమె సృజనాత్మకతను, తైల వర్ణ చిత్రాలను తృణమూల్‌ క్యాడరే కాదు, కొద్దో గొప్పో ఇతరులు కూడా మెచ్చుకుంటారు.

మమతా బెనర్జీ ఆలపించిన జాగో దుర్గ పాటకు మిశ్రమ స్పందన, ఉద్యోగాలు కావాలంటున్న యువత
Follow us

|

Updated on: Sep 18, 2020 | 6:42 PM

బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కళలంటే అపారమైన ప్రేమ! ఆమె కళావిశారద..! ఆమె సృజనాత్మకతను, తైల వర్ణ చిత్రాలను తృణమూల్‌ క్యాడరే కాదు, కొద్దో గొప్పో ఇతరులు కూడా మెచ్చుకుంటారు. మమతా దీదీ కవితలు రాస్తారు.. సింథసైజర్‌ వాయిస్తారు. పెయింటింగ్స్‌ గీస్తారు. ఆమె గీతకర్తే కాదు, ఆ గేయాలను చక్కగా స్వరపరుస్తారు కూడా! అన్నట్టు లఘు చిత్రాలకు కథనం కూడా సమకూరుస్తారు.. ఇక్కడితో ఆగిపోలేదామె! స్వరాన్ని సవరించుకుని పాట కూడా పాడారు.. దుర్గాదేవికి స్వాగతం పలుకుతూ జాగో తుమి జాగో అన్న పాటను శ్రావ్యంగా ఆలపించి మహాలయ అమావాస్య రోజున సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు..బెంగాల్‌లో మహాలయ అమావాస్య నుంచి దేవి పక్షాలు ప్రారంభమవుతాయి. కైలాస పర్వతం నుంచి ఆ మహాదేవి భూమ్మీదకు వచ్చే రోజులివి! ఆ అమ్మవారికి మేలుకొలపు గీతాన్ని ఆలపించారు మమతా బెనర్జీ. తన అధికార ఫేస్‌బుక్‌లో ఆ పాటను అప్‌లోడ్‌ చేశారో లేదో లక్షలాది మంది వీక్షించారు.. 11 వేల మందికి లైకులు కొట్టారు.. వెయ్యి కామెంట్లు కూడా వచ్చాయి.. కొందరు ఆమె గీతాలాపనను మెచ్చుకున్నా.. చాలామంది విమర్శించారు.

ప్రసిద్ధమైన మహాలయ పాటలో ఆమె శ్రుతిలయలను విస్మరించారని, గమకాలను సరిగ్గా పలకలేకపోయారని అన్నారు. యువత మాత్రం పాట జోలికి వెళ్లకుండా తమకు ఉద్యోగాలను ప్రసాదించు తల్లి అని మమతాను వేడుకున్నారు.. బెంగాల్‌లో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి చాలా కాలమే అయ్యింది. అయిదారేళ్ల కిందట ఉపాధ్యాయుల కోసం పరీక్షలను నిర్వహించారు.. మెరిట్‌ లిస్టును కూడా ప్రకటించారు.. ఉద్యోగాలే ఇవ్వలేదు.. బెంగాలీ ప్రజలమైన తమకు ఇవాళ ప్రత్యేకమైన రోజనీ, అయితే ఈ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తపరిచారు. నిరుద్యోగం తమను ఎంతగానో బాధిస్తున్నదని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ఉద్యోగ ప్రకటనలను ఇప్పించండి మేడమ్‌ అంటూ వేడుకున్నారు. పోలీసు విభాగంలో కూడా చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.. వాటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం మీనమేషాలను లెక్కిస్తోంది.. మరోవైపు తృణమూల్‌ కాంగ్రెస్‌ మాత్రం నిరుద్యోగం ఇంత ప్రబలడానికి మోదీ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తోంది. కరోనా వైరస్‌ కారణంగా ఉన్న ఉద్యోగాలే పోతున్నప్పుడు కొత్త ఉద్యోగాలను ఎక్కడ్నుంచి తెచ్చేది అన్నది కొందరి వాదన..! నిజానికి పశ్చిమ బెంగాల్‌లో నిరుద్యోగ సమస్య ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యమంత్రులు మారుతున్నారు కానీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపెట్టలేకపోతున్నారు. ఉద్యోగ సమస్యను తీర్చగలిగే శక్తి సామర్థ్యాలు మమతకే ఉన్నాయన్నది తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతల భావన. మరోవైపు కాంగ్రెస్‌ మాత్రం ఇటు మమతా బెనర్జీని అటు మోదీని తిట్టిపోస్తున్నది.. ఇద్దరి డీఎన్‌ఏలు ఒకటేనని ఎత్తిపొడుస్తున్నది. మోదీనేమో నెమళ్లకు ఆహారం అందిస్తున్న ఫోటోలను సోషల్‌ మీడియాలలో అప్‌లోడ్‌ చేస్తుంటే, మమతానేమో తను పాడిన పాటలను పోస్టు చేస్తున్నారని, ఇద్దరికీ పెద్ద తేడా లేదని విమర్శిస్తోంది.