మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారా?… అలా అయితే మూడు కోట్ల మంది ఉద్యోగులు రోడ్డున పడతారు..!

మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.. ఆ మధ్యన కాసింత అదుపులోకి వచ్చినట్టు అనిపించిన ఆ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ లాక్‌డౌన్‌ విధించే అవకాశాలున్నాయనే వార్తలు అక్కడక్కడ వినిపిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారా?... అలా అయితే మూడు కోట్ల మంది ఉద్యోగులు రోడ్డున పడతారు..!
Maharashtra Lockdown News
Follow us

|

Updated on: Nov 26, 2020 | 11:07 AM

మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.. ఆ మధ్యన కాసింత అదుపులోకి వచ్చినట్టు అనిపించిన ఆ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ లాక్‌డౌన్‌ విధించే అవకాశాలున్నాయనే వార్తలు అక్కడక్కడ వినిపిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్‌ అనుభవం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టే కలవరపడుతున్నారు. మార్చి నెలలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ప్రజలలో మానసిక ఆందోళన పెరిగింది. దినసరి కూలీల పరిస్థితి దయనీయంగా మారింది.. పేదలు నిరుపేదలయ్యారు. చేద్దామంటే పని లేక, తినడానికి తిండి లేక నానా అవస్థలు పడ్డారు. అన్‌లాక్‌ తర్వాత పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది..ఫ్యాక్టరీలు తెరచుకున్నాయి.. రెస్టారెంట్లు ఓపెనయ్యాయి.. దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఇంతకాలం ఉపాధిలేక ఇబ్బందుల పడినవారికి ఉపాధి దొరుకుతున్నది.. ఇలాంటి తరుణంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే బతకడం కష్టమవుతుందన్న భయం ప్రజలను వెంటాడుతున్నది. ఒకవేళ లాక్‌డౌన్‌ అంటూ విధిస్తే మహారాష్ట్రలో కనీసం మూడు కోట్ల మంది రోడ్డున పడే అవకాశాలున్నాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 19 లక్షల చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి.. వీటితో పాటు ఆరు వేల భారీ పరిశ్రమలు కూడా ఉన్నాయి.. వీటిల్లో మూడు కోట్ల మంది వరకు పని చేస్తున్నారు.. లాక్‌డౌన్‌ అమలులోకి వస్తే ఇవన్నీ మూతపడతాయి.. మార్చిలో విధించిన లాక్‌డౌన్‌తో పది లక్షల పరిశ్రమలు మూతపడినట్టు సమాచారం. చాలా మంది ఉద్యోగాలు పోయాయి. మళ్లీ లాక్‌ డౌన్‌ విధించే అవకాశాలున్నాయంటూ వస్తున్న కథనాలు ఈ కంపెనీలు, ఉద్యోగులలో తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. అందుకే కాబోలు హర్షల్‌ మిరాశీ అనే లాయర్‌ మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించకుండా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో పిల్‌ వేశారు. లాక్‌డౌన్‌ విధించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని అందులో కోరారు. అయితే సుప్రీంకోర్టులో కాకుండా హైకోర్టులో ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయాలని మిరాశీకి సుప్రీంకోర్టు సూచించింది. లాక్‌డౌన్‌ను విధించే పరిస్థితి వరకు తీసుకొచ్చింది ప్రజలే కదా! కోవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించి ఉంటే కేసులు ఇంతగా పెరిగి ఉండేవి కావు కదా అని నిపుణులు అంటున్నారు..