మధ్యప్రదేశ్… సంక్షోభంలో కమల్ నాథ్ ప్రభుత్వం.. గుర్ గావ్ హోటల్లో అర్ధరాత్రి హైడ్రామా

మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ఆద్వర్యంలోని 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. మంగళవారం సాయంత్రం నుంచి ప్రారంభమైన ఈ రాష్ట్ర రాజకీయ సంచలనాలు అర్దరాత్రి,  బుధవారం ఉదయం వరకు కూడా కొనసాగాయి.

మధ్యప్రదేశ్... సంక్షోభంలో కమల్ నాథ్ ప్రభుత్వం.. గుర్ గావ్ హోటల్లో అర్ధరాత్రి హైడ్రామా
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 04, 2020 | 11:35 AM

మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ఆద్వర్యంలోని 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. మంగళవారం సాయంత్రం నుంచి ప్రారంభమైన ఈ రాష్ట్ర రాజకీయ సంచలనాలు అర్దరాత్రి,  బుధవారం ఉదయం వరకు కూడా కొనసాగాయి. అసలే అరకొర మెజారిటీతో కొనసాగుతున్న కమల్ నాథ్ ప్రభుత్వం బీజేపీ ఎత్తుగడలతో చిక్కుల్లో పడింది. తమ పార్టీకి చెందిన సుమారు ఎనిమిదిమంది ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు గుర్ గావ్ లోని ఫైవ్ స్టార్ హోటల్ ..’మానెసార్’ కి బలవంతంగా తరలించి నిర్బంధించారని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. కాగా..ఈ ఎనిమిది మంది శాసన సభ్యుల్లో నలుగురు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. ఒకరు బీఎస్పీ నుంచి సస్పెండయిన రమాబాయి అనే ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అయితే రమాబాయిని, కాంగ్రెస్ కు చెందిన బిసాహులాల్ సింగ్ అనే ఎమ్మెల్యేని ఇద్దరు రాష్ట్ర మంత్రులు జైవర్ధన్ సింగ్, జీతూ పట్వారి ఈ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో హోటల్ నుంచి బయటికి తీసుకువఛ్చి..’రక్షించారు’. (దిగ్విజయ్ సింగ్ కుమారుడే జైవర్ధన్ సింగ్). ఈ దేశ రాజకీయాలను బీజేపీ భ్రష్టు పట్టిస్తోందని, డబ్బు, కండ బలంతో కమల్ నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు యత్నిస్తోందని జైవర్ధన్ సింగ్ ఆరోపించారు. అయితే ఈ సర్కార్ ఐదేళ్లూ కొనసాగుతుందని ఆయన ట్వీట్ చేశారు. అటు-ఒక్కో ఎమ్మెల్యేకి 25 నుంచి 35 కోట్లు ఇఛ్చి తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ నేతలు బేరసారాలాడుతున్నారని దిగ్విజయ్ సింగ్ అన్నారు. మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, మరో బీజేపీ నేత నరోత్తమ్ మిశ్రా, మరికొందరు కమలం పార్టీ నాయకులు వీరిని ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. 230 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో 113 మంది కాంగ్రెస్ పార్టీకి, 107 మంది బీజేపీకి చెందినవారు ఉన్నారు. ఇద్దరు బహుజన్ సమాజ్ పార్టీకి చెందినవారు కాగా.. ఒకరు సమాజ్ వాదీ పార్టీ సభ్యుడు. నలుగురు ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ సభలో మెజారిటీ మార్క్ 116. అంటే నలుగురు ఎమ్మెల్యేలు ఫిరాయించినా  కమల్ నాథ్ ప్రభుత్వం గండంలో పడుతుంది.