హ‌నుమంత వాహ‌నంపై వేంక‌టాద్రిరామునిగా మ‌ల‌య‌ప్పస్వామి

జగదానందకారకుడైన శ్రీనివాసుడికి ఎన్నో అలంకారాలు.. ఎన్నో వాహనవిశేషాలు.. ఎన్నో ఆరాధన విధానాలు..ఆకారాలు ఎన్నయినా , అలంకారాల్లో ఎన్ని వైవిధ్యాలున్నా అందరివాడైన ఆ వేంకటేశ్వరస్వామి ఒక్కడే!

హ‌నుమంత వాహ‌నంపై వేంక‌టాద్రిరామునిగా మ‌ల‌య‌ప్పస్వామి
Follow us

|

Updated on: Sep 24, 2020 | 12:21 PM

జగదానందకారకుడైన శ్రీనివాసుడికి ఎన్నో అలంకారాలు.. ఎన్నో వాహనవిశేషాలు.. ఎన్నో ఆరాధన విధానాలు..ఆకారాలు ఎన్నయినా , అలంకారాల్లో ఎన్ని వైవిధ్యాలున్నా అందరివాడైన ఆ వేంకటేశ్వరస్వామి ఒక్కడే! భక్తుల గుండెల్లో ఆయనపట్ల వెల్లివెరిసే భక్తిభావం ఒక్కటే! ఉన్నది ఒక్కడే అయినా ఆయన్ను వివిధ రకాలుగా సేవించుకోవడంలో ఏదో విశేషం ఉంది. దివ్యమైన వినోదం ఉంది. సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఏడు కొండల వాడు ఏక స్వరూపుడుగా మారి కోటానుకోట్ల భక్తులను ఆశీర్వదిస్తున్నారు… బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరవ రోజు, గురువారం ఉదయం హనుమద్వాహనసేవ జరిగింది..హనుమంతుడు..శ్రీరాముని నమ్మినబంటు.. త్రేతాయుగంలో తనకు అపార సేవలను అందించిన ఆ భక్తుడిని శ్రీవారు మర్చిపోతారా?

అందుకే ఆ బంటుకు మళ్లీ తన సేవా భాగ్యాన్ని అందించింది… ఆ దివ్య దృశ్యాన్ని చూడాలే తప్ప వర్ణించడం వీలు కాదు.. అంతే కాదు.. తాను కూడా ఆ మహా విష్ణువు స్వరూపమేనని భక్తులకు స్వామి తెలియచెప్పే మధురమైన సన్నివేశమది.. ఇవాళ ఉదయం తొమ్మిది గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్సవ మండ‌పంలో మలయప్పస్వామి వారు వేంక‌టాద్రిరాముని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. పండితుల వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. హనుమంతుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. కాగా, సాయంత్రం నాలుగు గంటల నుంచి అయిదు గంట‌ల వ‌ర‌కు స్వర్ణ ర‌థం బదులుగా స‌ర్వభూపాల వాహ‌నసేవ జ‌రుగుతుంది. రాత్రి ఏడు గంటలకు గ‌జ‌వాహనంపై స్వామివారు కటాక్షిస్తారు. వాహనసేవల‌లో పెదజీయ‌ర్ స్వామి, చిన్నజీయ‌ర్ స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ధ‌ర్మకర్తల మండ‌లి స‌భ్యులు డా.నిశ్చిత‌, శేఖ‌ర్ రెడ్డి, గోవింద‌హ‌రి, డి.పి అనంత‌, సీఈ ర‌మేష్‌రెడ్డి, అదనపు సీవీఎస్వో శివకుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.