కొత్త ప్రభుత్వ ఏర్పాటులో వీళ్లే ‘కింగ్ మేకర్స్’

King Makers, కొత్త ప్రభుత్వ ఏర్పాటులో వీళ్లే ‘కింగ్ మేకర్స్’

ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికే ఓటేశాయి. స్పష్టమైన మెజారిటీతో ఈసారి మోదీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అన్ని సర్వేలు వెల్లడించాయి. దీంతో కాషాయ జెండా మరోసారి ఎగరనుందని రాజకీయ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఇదంతా ఓకే కానీ ఒకవేళ ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు తారుమారైతే..? ఎన్డీయే ప్రభుత్వం మేజిక్ ఫిగర్‌ను సాధించలేకపోతే..? అప్పుడు దేశంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కచ్చితంగా కొన్ని పార్టీల సహాయం ఇటు ఎన్డీయేకు, అటు యూపీఏకు అవసరమౌతుంది. ఈ నేపథ్యంలో దేశంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో పలు ప్రాంతీయ పార్టీల నేతలే కింగ్ మేకర్లుగా మారనున్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఆ లిస్ట్‌లో నవీన్ పట్నాయక్, కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్, స్టాలిన్ ఉండనున్నారని వారు అంచనా వేస్తున్నారు.

కేసీఆర్:
కేంద్రంలో చక్రం తిప్పాలనుకొని ఎప్పటినుంచో ప్రణాళికలు రచిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎన్డీయే, యూపీఏలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటుకై ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీల నేతలతోనూ ఆయన భేటీ అయ్యారు. ఇక ప్రస్తుత ఎన్నికల్లో ఆయన పార్టీకి 10 నుంచి 13 సీట్లు రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కేసీఆర్ కింగ్ మేకర్‌గా మారనున్నారు.

జగన్ మోహన్ రెడ్డి:
గత ఎన్నికల్లో తక్కువ ఎంపీ సీట్లు వచ్చినప్పటికీ.. ఈ ఎన్నికల్లో జగన్‌ పార్టీ అధిక సీట్లు సాధించవచ్చునని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అధికార టీడీపీ కంటే వైసీపీకే ఎక్కువ సీట్లు రానున్నాయని వారు చెబుతున్నారు. దాదాపుగా 20ఎంపీ సీట్లను వైసీపీ సొంతం చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయనను తమతో రావాల్సిందిగా ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రత్యేక హోదా డిమాండ్‌ లక్ష్యంగా గత ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తోన్న జగన్.. ఏ పార్టీకి మద్దతిస్తారో అన్నది కూడా ఆసక్తిగా మారింది.

స్టాలిన్:
మొన్నటి వరకు యూపీఏ ప్రభుత్వానికే మద్దతిస్తూ వస్తోన్న డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్.. ఎగ్జిట్ పోల్స్ విడుదల తరువాత యూటర్న్ తీసుకున్నారు. ప్రస్తుతం అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌కు మద్దతివ్వకుండా తటస్థంగా ఉన్న స్టాలిన్.. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్నట్లు పలువురు రాజకీయ నాయకులు అంచనా వేస్తున్నారు.

నవీన్ పట్నాయక్:
ఒడిశా ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్‌కు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కీ మేకర్‌గా మారనున్నారు. గత ఎన్నికల్లో మొత్తం 18 లోక్‌సభ సీట్లను కైవసం చేసుకున్న బీజేడీ.. అధిక ఎంపీ సీట్లు గెలిచిన పార్టీల్లో ఐదో స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన పార్టీకి(బీజేడీ) 2 నుంచి 15సీట్లు రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మరోవైపు ఇటు మోదీ, అటు రాహుల్‌ ఇద్దరితో ఈయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మద్దతు కీలకం కానుంది.

మమతా బెనర్జీ:
బీజేపీ, కాంగ్రెస్‌లను పక్కనపెడితే.. దేశంలో ప్రస్తుతమున్న స్ట్రాంగ్ లీడర్లలో మమతా బెనర్జీ ఒకరు. గత ఎన్నికల్లో 33 ఎంపీ సీట్లను సొంతం చేసుకున్న ఆమె పార్టీ.. అతిపెద్ద పార్టీగా నాలుగో పార్టీకి తమ సత్తాను చూపింది. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమె పార్టీకి 24 నుంచి 29 ఎంపీ సీట్లు రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే ఎన్డీయే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తోన్న ఆమె.. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మాయావతి:
ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా కింగ్ మేకర్‌గా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆమె పార్టీ విపక్షాలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఇప్పటికే ఆమె బీజేపీయేతర పార్టీలను కూడగట్టుకోవడానికి యత్నిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుతో సుదీర్ఘంగా మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే.

అఖిలేష్ యాదవ్:
మాయావతి మాదిరే తాజాగా ఆమె పార్టీతో జట్టు కట్టిన ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా కింగ్ మేకర్‌గా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆస్తుల కేసులో తాజాగా ఆయనకు సీబీఐ నుంచి క్లీన్‌చిట్ రావడంతో.. ఎస్పీ మద్దతు ఎవరికో అన్నది ఆసక్తిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *