మద్యం తాగే మహిళలకు ముప్పు.. బీ అలర్ట్..!

Over Alcohol is Very Dangerous for women, మద్యం తాగే మహిళలకు ముప్పు.. బీ అలర్ట్..!

మగవాళ్లు సరే.. మహిళలు తాగితే యమ డేంజర్‌ అంటున్నారు పరిశోధకులు.. అర్ధరాత్రిదాకా పార్టీలు, పీకలదాకా మద్యం సేవించే పురుషుల కంటే మహిళలకే ముప్పు ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆడ, మగ అనే తేడా లేకుండా ఇప్పుడు అందరూ మద్యపానానికి అలవాటు పడుతున్నారు. ఫంక్షన్లు, పార్టీలు ఇలా సందర్భం ఏదైనా మగవారితో పాటుగానే ఆడవారు సైతం ఫుల్లుగా తాగేస్తున్నారు. అయితే అతిగా మద్యం సేవించి, రాత్రివేళ ఆలస్యం అయ్యేదాకా పార్టీలకు వెళ్లే మగవారికంటే ఆడవారి ఆరోగ్యానికే అత్యంత ముప్పు అని జర్నల్‌ ఆఫ్‌ ఫార్మకాలజీ అండ్‌ ఎక్స్‌పరిమెంటల్‌ థెరఫ్యూటిక్స్‌లో ఆర్టికల్ ప్రచురితమైంది. మిస్సౌరీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం దీనిపై ప్రయోగాత్మకంగా అధ్యయనం జరిపినట్లుగా ఆ పత్రిక వెల్లడించింది. ఈ మేరకు మగ, ఆడ ఎలుకలపై పరిశోధన జరిపిన శాస్త్రవేత్తలు సరికొత్త విషయాలను కనుగొన్నారు.

అతిగా మద్యం సేవించే ఆడవారిలో రక్తపోటు పెరుగుతుందని, గుండెపోటు ముప్పు పెరిగే ఆస్కారముందని తెలిపారు. ఆల్కహాల్‌ మహిళల్లో గర్భధారణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ హర్మోన్లుపై ప్రభావం పడుతుంది. మహిళల్లో అండం ఉత్పత్తి మీద కూడా ఆల్కహాల్‌ ప్రభావం ఉంటుంది. దాంతో నెలసరి సమస్యలు తప్పవంటున్నారు. ముఖ్యంగా మద్యం అలవాటు కాలేయాన్ని దెబ్బతీస్తుంది. కణితి పెరుగుదల, క్యాన్సర్‌ కణాల అధిక ఉత్పత్తికి దోహదం చేస్తుంది. ఫలితంగా మద్యం సేవించే మహిళలు క్యాన్సర్‌ బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువేనని పరిశోధకులు స్పష్టం చేశారు.

పార్టీలు చేసుకోవడం, పబ్బులకెళ్లడం, మద్యం సేవించడం ప్రస్తుతం కార్పొరేట్‌ సంస్కృతిలో భాగమైపోయింది. అయితే, పరిస్థితులు మారినా..తాగుడు విషయంలో ఆరోగ్యరీత్యా అందరూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు వైద్య నిపుణులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *