శ్రీనగర్..పుల్వామాలో భద్రతా దళాలు అప్రమత్తం.. భారీ ఉగ్ర కుట్ర భగ్నం.

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో భారీ ఉగ్ర కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. 20 కేజీల పేలుడు పదార్థాలతో కూడిన తెల్లని హ్యుందాయ్ శాంత్రో కారును జవాన్లు పేల్చివేశారు...

శ్రీనగర్..పుల్వామాలో భద్రతా దళాలు అప్రమత్తం..  భారీ ఉగ్ర కుట్ర భగ్నం.
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 28, 2020 | 10:59 AM

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో భారీ ఉగ్ర కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. 20 కేజీల పేలుడు పదార్థాలతో కూడిన తెల్లని హ్యుందాయ్ శాంత్రో కారును జవాన్లు పేల్చివేశారు. ఫేక్ రిజిస్ట్రేషన్ నెంబరుతో కూడిన ఈ కారును బుధవారం రాత్రి ఓ చెక్ పాయింట్ వద్ద జవాన్లు నిలిపివేశారు. అయితే బ్యారికేడ్లను ఛేదించుకుని డ్రైవర్ కారును ముందుకు తీసుకువెళ్లబోగా జవాన్లు కాల్పులు జరపడంతో.. డ్రైవర్ కారులోంచి పారిపోయాడు. ఈ దాడి జరగడానికి గల అవకాశాల గురించి తమకు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ముందే సమాచారం అందిందని, నిన్న సాయంత్రం నుంచే అప్రమత్తంగా ఉన్నామని ఐజీపీ విజయ కుమార్ తెలిపారు. ఆర్మీ, పోలీసులు, పారామిలిటరీ దళాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్టు ఆయన చెప్పారు. ఈ వాహనాన్ని బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఆ తరువాత పేల్చి వేశారు. ఈ పేలుడుతో చుట్టుపక్కల గల ఇళ్ళు దెబ్బ తిన్నాయి. అయితే ఆ ఇళ్లవారిని ముందుగానే ఖాళీ చేయించినట్టు విజయ కుమార్ తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరి 14న  ఇదే జిల్లాలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లు మృతి చెందారు.