
చాలామంది తమ ఉద్యోగమే తమ జీవిత గమ్యం అని నమ్ముతుంటారు, ఇది పెద్ద పొరపాటు. ప్రతీ ఉద్యోగం మీ జీవిత లక్ష్యాన్ని పూర్తి చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగం అనేది కేవలం ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చే ఒక సాధనం మాత్రమే. మీ జీవిత ఉద్దేశ్యం మీ ఉద్యోగానికి అతీతమైనదని గుర్తించండి. మీ ఉద్యోగం మీకు సంతృప్తిని ఇవ్వడం లేదని బాధపడటం ఆపేసి, కేవలం మీ తదుపరి అడుగు వరకు దానిని ఒక మార్గంగా చూడండి.
మీరు పొందే జీతం, హోదా లేదా పర్ఫార్మెన్స్ రివ్యూలు మీ విలువను నిర్ణయించవు. మీరు ఆఫీసులో ఒక హోదాలో ఉండవచ్చు, కానీ ఇంటికి వెళ్ళాక మీరు ఒక మంచి వ్యక్తిగా, భాగస్వామిగా, తల్లిదండ్రిగా అద్భుతమైన పాత్రను పోషిస్తుంటారు. మీ వ్యక్తిగత విలువను వృత్తిపరమైన విజయాలు లేదా వైఫల్యాలతో ముడిపెట్టకండి. ఇలా చేయడం వల్ల ఆఫీసులో జరిగే సమస్యలను వ్యక్తిగతంగా తీసుకోకుండా ఉంటారు.
ఆఫీసు పని తర్వాత కూడా మీకు ఆసక్తి ఉన్న చిన్న చిన్న పనులు లేదా అలవాట్లను పెంపొందించుకోండి. ఉదయాన్నే ఒక చిన్న నడక, నచ్చిన మ్యూజిక్ వినడం లేదా కొత్తగా ఏదైనా నేర్చుకోవడం వంటివి మీకు ఉత్సాహాన్నిస్తాయి. ఇవి మిమ్మల్ని పని ఒత్తిడి నుండి దూరం చేస్తాయి.
ఒకవేళ మీరు ఉద్యోగం మానేయాలని ఫిక్స్ అయితే, వెంటనే రాజీనామా చేయకుండా మీకు నచ్చిన రంగంలో కొత్త కోర్సులు చేయండి, ఫ్రీలాన్సింగ్ ప్రయత్నించండి లేదా ఆ రంగానికి చెందిన వ్యక్తులతో మాట్లాడండి. ఉద్యోగంలో ఉంటూనే ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక భద్రత ఉంటుంది, అలాగే మీ ఆసక్తి ఏంటో స్పష్టత వస్తుంది.
పని పట్ల ప్రేమ ఉన్నా, లేకపోయినా.. ఆఫీసు వెలుపల మీకంటూ ఒక జీవితం ఉండాలి. మంచి స్నేహితులు, అర్థవంతమైన అభిరుచులు మరియు ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీ ఆనందం కేవలం ఉద్యోగంపైనే ఆధారపడి ఉంటే, ఆఫీసులో ఏదైనా చిన్న సమస్య వచ్చినా మీరు కుంగిపోతారు. కాబట్టి, బహుళ మార్గాల్లో ఆనందాన్ని వెతుక్కోండి. సరైన ప్రణాళికతో, స్పష్టతతో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును మెరుగుపరుస్తుంది. కాబట్టి ఆవేశంలో కాకుండా, ఆలోచనతో నిర్ణయం తీసుకోండి.