మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారో చూసుకోండి..

కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర…ఈ రెండింటిలో తేడాలు వస్తే మనిషి అనారోగ్యం పాలవుతాడు. తిండి తినకుండా కొద్ది రోజుల వరకు ఉండొచ్చు. కానీ నిద్ర పోకుండా మాత్రం ఎక్కువ రోజులు ఉండటం అసాధ్యం. ప్రస్తుతం నిద్ర సమయాలు పూర్తిగా మారి పోయాయి. రాత్రి పూట పడుకోవాల్సినవాళ్లు ఉదయం పూట పడుకుంటున్నారు. ఉదయం పనిచేయాల్సిన వారు రాత్రి పనిచేస్తున్నారు ఫలితంగా చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని వైద్యులు చెబుతున్నారు. జామా పీడియాట్రిక్స్‌ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక […]

మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారో చూసుకోండి..
Follow us

|

Updated on: Sep 18, 2019 | 4:57 PM

కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర…ఈ రెండింటిలో తేడాలు వస్తే మనిషి అనారోగ్యం పాలవుతాడు. తిండి తినకుండా కొద్ది రోజుల వరకు ఉండొచ్చు. కానీ నిద్ర పోకుండా మాత్రం ఎక్కువ రోజులు ఉండటం అసాధ్యం. ప్రస్తుతం నిద్ర సమయాలు పూర్తిగా మారి పోయాయి. రాత్రి పూట పడుకోవాల్సినవాళ్లు ఉదయం పూట పడుకుంటున్నారు. ఉదయం పనిచేయాల్సిన వారు రాత్రి పనిచేస్తున్నారు ఫలితంగా చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని వైద్యులు చెబుతున్నారు. జామా పీడియాట్రిక్స్‌ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక తాజా అధ్యయనం నిద్రలేమి – బరువు పెరగడం మధ్య సంబంధాన్నివిశ్లేషించింది. అమెరికాలోని హెల్త్‌కేర్ సంస్థ కైజర్ పర్మనెంట్ పరిశోధకులు జరిపిన అధ్యయనం మేరకు..ఎక్కువగా టీనేజ్‌లో ఉన్న యువతీ యువకులు నిద్రలేమితో సమస్యలను ఎదుర్కొంటున్నట్లుగా వెల్లడించారు. నిద్రలేమి మన శరీర జీవక్రియపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. దీనితో పాటుగా ఆకలి, శక్తి వంటి వాటిపై కూడా దాని ఎఫెక్ట్‌ ఎక్కువగా పడుతుంది. వీటి కారణంగా శరీర బరువు నిర్వహణలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిద్రలేమి మన శరీర బరువును ఎలా ప్రభావిత పరుస్తుందో పరిశోధకులు స్పష్టం చేశారు. మనం తీసుకున్నఆహారం కేలరీలలో దాదాపు 60 నుండి 65 శాతం వరకు పడుకున్నపుడు కరిగించబడతాయి. మిగిలిన 30 నుండి 35 శాతం కేలరీలు రోజూ మనం చేసే ఇతర పనులలో ఖర్చు చేయబడతాయి. కావున సరైన సమయంలో నిద్రపోయిన వారితో పోలిస్తే తక్కువ సమయం పాటూ నిద్రపోయే వారిలో చాలా తక్కువ కేలరీలు వినియోగించబడతాయి. ఇలా కొంతకాలం పాటూ నిద్రలేమికి గురైతే బరువు గణనీయంగా పెరుగుతుందని ఆ అధ్యయనం ద్వారా వారు నిరూపించారు. 11-16 ఏళ్ల మధ్య వయసు గల 804 మందిపై ఈ అధ్యయనం జరిపినట్లుగా వారు స్పష్టం చేశారు. సరైననిద్ర లేకపోతే బీపీ, ఒత్తిడి పెరుగుతుంది. గుండె స్పందనల్లో తేడాలు కనిపిస్తాయి. మధుమేహం నియంత్రణలోకి రాకపోవడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముంది. నిద్రలేమితో బాధపడేవారు గురక వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అంతేకాకుండా, మానసికంగా చిరాకుగా ఉండటం, చేసే పనిమీద ధ్యాస లేకపోవడం, ఆందోళన, ఆతృత, ఒత్తిడి పెరగడం, భయం, భయంగా ఉండటం, బీపీ పెరగడం, గుండె స్పందనలో మార్పులు, నరాల్లో బలహీనత, వణకడం, చేతులు, తిమ్మిర్లు రావడం, రోగ నిరోధక శక్తి సన్నగిల్లడం వంటివి జరుగుతాయి. నిద్రలేమికి ప్రధానంగా అధిక బరువు, పని ఒత్తిడి పెరగడం, టీవీలు చూడటం, సెల్‌ఫోన్‌ మాట్లాడటం, టీ, కాఫీ, మద్యం, సిగరెట్లు తాగడం, రాత్రిపూట ఉద్యోగాలు చేయడం, విపరీతంగా ఆలోచన చేయడం వంటి వాటివల్ల నిద్రకు దూరమవుతున్నట్టు తాజా అధ్యయనాలు వెల్లడించాయి. నిద్రలేమి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. అయితే, మంచి నిద్ర కోసం కొన్ని ఆహార పదార్థాలను తప్పక తీసుకోవాలని, వాటిల్లో ముఖ్యంగా చెర్రీస్‌, బాదం, అరటి పండ్లు, డార్క్ చాక్లెట్, చమోమిలే టీ వంటివి ఉండేలా చూసుకోవాలని సూచించారు.