
బరువు తగ్గాలని (Weight Loss) ప్రయత్నించేవారు తరచుగా చక్కెరను పూర్తిగా మానేసి, దానికి బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా బెల్లం (Jaggery) వాడుతుంటారు. బెల్లం చక్కెర కంటే తక్కువ ప్రాసెస్ చేయబడుతుంది. కాబట్టి, ఇందులో ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే, పోషకాహార నిపుణుల ప్రకారం.. కేవలం చక్కెర స్థానంలో బెల్లం తిన్నంత మాత్రాన బరువు తగ్గరు, పైగా అతిగా తింటే బరువు మరింత పెరిగే అవకాశం ఉంది. బరువు తగ్గడానికి మొత్తం క్యాలరీల నియంత్రణ, మితంగా తినడం చాలా ముఖ్యం అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
న్యూట్రిషనిస్ట్ ఎడ్వినా రాజ్ ప్రకారం, చక్కెరతో పోలిస్తే బెల్లాన్ని చాలా తక్కువగా ప్రాసెస్ (Refine) చేస్తారు. దీనివల్ల బెల్లంలో ఐరన్ (ఇనుము), పొటాషియం, కాల్షియం, మేగ్నీషియం వంటి అవసరమైన ఖనిజాలు మరియు పోషకాలు అలాగే నిలిచివుంటాయి. బెల్లం పీచు పదార్థాన్ని కలిగి ఉండటం వల్ల అది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
అయితే బరువు తగ్గే విషయానికి వస్తే ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. చక్కెర, బెల్లం రెండింటిలోనూ ఉండే క్యాలరీల పరిమాణం (Calorie Content) దాదాపు సమానంగానే ఉంటుంది. వంద గ్రాముల చక్కెరలో ఎంత క్యాలరీలు ఉంటాయో, అంతే బెల్లంలోనూ ఉంటాయి. కాబట్టి, మీరు చక్కెర మానేసి, బెల్లం కదా అని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడంతో పాటు బరువు తగ్గడానికి బదులు వేగంగా పెరిగే ప్రమాదం ఉంది.
వెయిట్ లాస్ జర్నీలో కేవలం పదార్థాన్ని మార్చడం మాత్రమే ముఖ్యం కాదు. మీరు రోజంతా తీసుకునే మొత్తం క్యాలరీల పరిమాణం (Total Calorie Intake) మీద నియంత్రణ ఉండాలి. బెల్లం శరీరానికి మంచిదే అయినప్పటికీ బరువు తగ్గాలనుకునే వారు రోజుకు కేవలం 1 నుండి 2 చిన్న చెంచాలు (సుమారు 5-10 గ్రాములు) మాత్రమే పరిమిత పరిమాణంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..