Kids: ప్రతీ ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి ఆ సమస్య.. ఇలాగే కొనసాగితే..

|

Sep 27, 2024 | 10:14 AM

ఇక అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆసియా దేశాలలో 85% మంది పిల్లలు బలహీనమైన కళ్ళు కలిగి ఉన్నారు. జపాన్‌లో 73% మంది పిల్లలు, దక్షిణ కొరియా, చైనా, రష్యాలో 40% మంది పిల్లలు దృష్టి లోపంతో బాధపడుతున్నారు. అయితే వీరందరి వయసు 10 ఏళ్ల లోపు మాత్రమే కావడం గమనార్హం. 'బ్రిటీష్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీ'లో ప్రచురించిన అధ్యయనం...

Kids: ప్రతీ ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి ఆ సమస్య.. ఇలాగే కొనసాగితే..
Kids
Follow us on

ప్రస్తుతం చిన్నారుల్లో కంటి సంబంధిత సమస్యలు తీవ్రమవుతున్నాయి. తాజా గణంకాల ప్రకారం ముగ్గురిలో ఒకరికి కళ్లు బలహీనంగా మారుతున్నాయిని తేలింది. ఇది ఇలాగే కొనసాగితే.. 2050 నాటికి 50% మంది పిల్లలు దగ్గర లేదా దూర దృష్టి సమస్యతో ఇబ్బందిపడుతున్నారని తేలింది. ప్రపంచ స్థాయిలో నిర్వహించిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

ఇక అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆసియా దేశాలలో 85% మంది పిల్లలు బలహీనమైన కళ్ళు కలిగి ఉన్నారు. జపాన్‌లో 73% మంది పిల్లలు, దక్షిణ కొరియా, చైనా, రష్యాలో 40% మంది పిల్లలు దృష్టి లోపంతో బాధపడుతున్నారు. అయితే వీరందరి వయసు 10 ఏళ్ల లోపు మాత్రమే కావడం గమనార్హం. ‘బ్రిటీష్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీ’లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. 1990తో పోల్చితే 2023లో పిల్లల బలహీనమైన కంటి చూపు కేసుల్లో సుమారు 36% పెరుగుదల కనిపించిందని తేలింది.

యూకే, ఐర్లాండ్, అమెరికాలో దాదాపు 15% మంది పిల్లలు షార్ట్ సైటెడ్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నారని నివేదికలో తేలింది. అయితే అత్యల్పంగా పరాగ్వే, ఉగాండాలో కేవలం ఒక శాతం మంది పిల్లలు మాత్రమే కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. 50 దేశాలకు చెందిన 50 లక్షల మందికి పైగా పిల్లలను పరిగణలోకి తీసుకొని ఈ సర్వేను నిర్వహించారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి తరువాత చిన్నారులు కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కేసులు పెరిగినట్లు తేలింది.

ఇది జన్యుపరమైన సమస్య అని వైద్యులు చెబుతున్నారు. చాలా సార్లు, తల్లిదండ్రుల కళ్లు బలహీనంగా ఉన్నప్పుడు పిల్లలలో కూడా ఈ సమస్య వస్తుంది. 2 ఏళ్ల వయసులో ఉన్న పిల్లల్లో కంటి చూపు వేగంగా క్షీణించడాన్ని నిపుణులు గుర్తించారు. ఎక్కువ సేపు మొబైల్‌ ఫోన్స్‌, స్క్రీన్స్‌కు అతుక్కుపోవడంతో చిన్న పిల్లల కంటి కండరాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..

పిల్లల స్క్రీన్‌ టైమ్‌ను వీలైనంత వరకు తగ్గించాలి. వారిని స్మార్ట్ ఫోన్స్‌కు బదులుగా బయట ఆడడం అలవాటు చేయాలి. ఒకవేళ టీవీలు చూసినా, ఫోన్‌లు వాడినా దానిని పరిమితం చేయాలి. అలాగే టీవీలకు పిల్లలను కనీసం 10 అడుగుల దూరంలో కూర్చొని చూడమని చెప్పాలి. ముఖ్యంగా పెద్ద స్క్రీన్‌ ఉన్న టీవీల విషయంలో మరింత ఎక్కువ దూరం పాటించాలి. అలాగే తీసుకునే ఆహారంలో జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్ ఎ, సి, ఇలు తప్పకుండా ఉండేలా జాగ్రత్త పడాలి. పిల్లలు తరచూ తలనొప్పి సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే కంటి పరీక్షలు చేయించాలి.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..