Lifestyle: జీలకర్రను కూడా వదలని కల్తీగాళ్లు.. అలసైన దాన్ని ఎలా గుర్తించాలో తెలుసా.?
ఇంట్లో కచ్చితంగా ఉపయోగించే పదార్థాల్లో జీలకర్ర కూడా ఒకటి. అయితే ప్రస్తుతం కల్తీ ప్రపంచంలో కేటుగాళ్లు జీలకర్రను కూడా వదిలిపెట్టడం లేదు. ఇంతకీ కల్తీ జీలకర్రను ఎలా గుర్తు పట్టాలి.? ఇందుకోసం ఫాలో అవ్వాల్సిన చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం మార్కెట్లో కల్తీ రాజ్యమేలుతోంది. ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఉప్పు నుంచి పప్పు వరకు అన్ని వస్తువులను కల్తీ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం ఏమైపోయినా పర్లేదు, తమ జేబులు నిండితే చాలని చూస్తున్నారు. ఇలా మార్కెట్లో రోజుకో కల్తీ బాగోతం బయటపడుతోంది.
మనం నిత్యం ఉపయోగించే జీలకర్రను కూడా కల్తీ రాయుళ్లు వదలిపెట్టడం లేదు. నకిలీ జీలకర్రను ఎంచక్కా మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. వంటింట్లో కచ్చితంగా ఉండే కల్తీ జీలకర్రను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. సాధారణంగా కల్తీ జీలకర్రను గడ్డి బెల్లం, రాతిపొడి, మట్టితో కలిసి తయారు చేస్తున్నారు. అసలు జీలకర్రకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటుందీ నకిలీ జీలకర్ర.
అయితే మీ వంటింట్లో ఉంది అసలు జీలకర్ర లేదా నకిలీ జీలకర్ర అనే విషయాన్ని తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు అందుబాటులో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కొద్దిగా జీలకర్రను తీసుకొని నీటిలో వేసి ఐదు నిమిషాలు నానబెట్టాలి. నీరు రంగు మారితే ఆ జీలకర్రలో ఏదో కల్తీ జరిగి ఉండొచ్చని అర్థం. జీలకర్రలో ఏదో రంగు కలిపారని అర్థం చేసుకోవాలి.
ఇక నకిలీ జీలకర్రకు ఎలాంటి వాసన ఉండదు. ఇందుకోసం చేతిలో కొంత జీలకర్ర వేసుకొని వాసన చూడాలి. ఒకవేళ ఎలాంటి వాసన లేకపోతే అది నకిలీ అని అర్థం చేసుకోవాలి. జీలకర్రను కొంత రబ్ చేసినా వెంటనే వాసన వస్తుంది. అలాగే జీలకర్రను చేతిలో వేసి నలిపితే ఎలాంటి మార్పు జరగకపోతే అది స్వచ్ఛమైన జీలకర్రగా అర్థం చేసుకోవాలి. ఇక జీలకర్రను నీటిలో నానబెడితే సులభంగా కరిగిపోయి మట్టిలాంటి పదార్థం పైకి తేలితే అది నకిలీ జీలకర్ర అని అర్థం చేసుకోవాలి. నకిలీ జీలకర్రకు చెక్ పెట్టాలంటే వీలైనంత వరకు లూజ్ కాకుండా మంచి బ్రాండ్ కంపెనీలకు చెందిన జీలకర్రను కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..