చూయింగ్ గమ్ నమిలితే ముఖంలో కొవ్వు కరుగుతుందా..? అపోహలు కాదు అసలు నిజాలు తెలుసుకోండి..
చూయింగ్ గమ్ నమలడం వల్ల ముఖంలోని కండరాలు ఉత్తేజితమై ఫేస్ స్లిమ్‌గా మారుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ సైన్స్ చెబుతున్న వాస్తవం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. అతిగా నమలడం వల్ల దవడ కండరాలు వాచి, ముఖం అందంగా మారాల్సింది పోయి మరింత వెడల్పుగా తయారవుతుందట. అంతేకాదు ఖాళీ కడుపుతో చూయింగ్ గమ్ నమలడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం..

ఈ రోజుల్లో పర్‌ఫెక్ట్ ఫేస్ కట్, పదునైన దవడ ఆకృతి సొంతం చేసుకోవడం ఒక పెద్ద ట్రెండ్‌గా మారింది. దీని కోసం గంటల తరబడి చూయింగ్ గమ్ నమలడం ఒక ముఖ వ్యాయామం అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల దవడ ఎముకలు బలపడి, మోడల్స్ లాంటి లుక్ వస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఈ వాదనల్లో ఎంతవరకు నిజం ఉంది? అసలు నిరంతరం చూయింగ్ గమ్ నమలడం వల్ల ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు పొంచి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చూయింగ్ గమ్ ముఖంలోని కొవ్వును కరిగించదు
చూయింగ్ గమ్ నమలడం వల్ల ముఖంలోని మాసెటర్ అనే దవడ కండరాలు ఉత్తేజితమవుతాయనేది నిజమే అయినప్పటికీ, అది ముఖంలో పేరుకుపోయిన కొవ్వును మాత్రం అస్సలు కరిగించలేదు. ఒక వ్యక్తికి పదునైన దవడ రేఖ ఏర్పడటం అనేది పూర్తిగా వారి శరీరంలో ఉన్న తక్కువ కొవ్వు శాతం, వారి జన్యువులు, చర్మం యొక్క స్థితిస్థాపకతపై ఆధారపడి ఉంటుంది. కేవలం చూయింగ్ గమ్ నమలడం వల్లే దవడ ఆకృతి శాశ్వతంగా మెరుగుపడుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు.
ముఖం అందంగా మారాల్సింది పోయి.. వికృతంగా మారుతుంది
చాలా మంది తమ దవడ రేఖను పదునుగా మార్చుకుని ముఖాన్ని స్లిమ్‌గా చూపించుకోవాలని చూయింగ్ గమ్ నములుతుంటారు. కానీ అతిగా నమలడం వల్ల దవడ కండరాలు విపరీతంగా గట్టిపడి, వాపునకు గురవుతాయి. దీనివల్ల ముఖం సన్నగా మారాల్సింది పోయి.. మరింత వెడల్పుగా, బరువుగా కనిపిస్తుంది. ఫలితంగా చాలా సందర్భాలలో ఈ అలవాటు వారి సహజ ముఖ ఆకృతిని పూర్తిగా వికృతం చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
దవడ నొప్పులు.. మైగ్రేన్ ముప్పు
నిరంతరం చూయింగ్ గమ్ నమలడం వల్ల మన దవడను అంటిపెట్టుకుని ఉండే టెంపోరోమాండిబ్యులర్ జాయింట్‌పై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దీనివల్ల దవడ తీవ్రమైన నొప్పికి గురవ్వడం, నోరు తెరవడం మరియు మూయడంలో ఇబ్బంది కలగడం, నమిలేటప్పుడు దవడల నుండి క్లిక్ క్లిక్ మనే శబ్దాలు రావడం వంటి రుగ్మతలు తలెత్తుతాయి. ఇప్పటికే దవడ నొప్పి లేదా నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఉన్నవారికి ఈ అలవాటు మరింత హానికరం. దీనికి తోడు దవడ కండరాలను నిరంతరం యాక్టివ్‌గా ఉంచడం వల్ల మెదడు నరాలు ఒత్తిడికి గురై టెన్షన్ తలనొప్పులు, మైగ్రేన్ వచ్చే ప్రమాదం విపరీతంగా పెరుగుతుంది.
ఖాళీ కడుపుతో నమలితే ఎసిడిటీ బాంబ్..
మనం నోట్లో వేసుకుని నమలడం ప్రారంభించగానే.. లోపలికి ఆహారం రాబోతుందనే సంకేతం శరీరానికి అందుతుంది. దీంతో జీర్ణ ప్రక్రియ కోసం కడుపులో గ్యాస్ట్రిక్ ఆమ్లాల ఉత్పత్తి పెరుగుతుంది. ఒకవేళ మీరు ఖాళీ కడుపుతో ఎక్కువసేపు చూయింగ్ గమ్ నమలితే.. ఆ యాసిడ్స్ కడుపు లైనింగ్‌ను దెబ్బతీసి తీవ్రమైన ఎసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం మరియు గుండెల్లో మంట వంటి సమస్యలకు దారితీస్తాయి. అలాగే నమిలేటప్పుడు తెలియకుండానే ఎక్కువ గాలిని మింగడం వల్ల పొట్ట ఎప్పుడూ ఉబ్బరంగా తయారవుతుంది.
దంతాల ఎనామెల్ దెబ్బతింటుంది.. మోషన్స్ ప్రమాదం
చక్కెర ఉన్న చూయింగ్ గమ్ నమలడం వల్ల దంత క్షయం, పళ్లపై పాచి పేరుకుపోవడం, పిప్ప పళ్లు రావడం సర్వసాధారణం. అయితే షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ వాడినా ముప్పే. ఎందుకంటే వాటిలో వాడే సార్బిటాల్, ఆస్పార్టేమ్ వంటి కృత్రిమ తీపి పదార్థాలు దంతాల ఎనామెల్‌ను బలహీనపరిచి, చిగుళ్లకు చికాకు కలిగిస్తాయి. అంతేకాదు ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ మన జీర్ణవ్యవస్థలో పూర్తిగా జీర్ణం కావు. వీటిని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పి మరియు ప్రేగుల సమస్యలు తలెత్తుతాయి.
నిపుణులు సూచిస్తున్న సరైన మార్గం
మీ ముఖ ఆకృతిని సహజంగా, ఆరోగ్యకరంగా మెరుగుపరుచుకోవడానికి చూయింగ్ గమ్స్ నమలడం సరైన పరిష్కారం కాదు. దానికి బదులుగా సమతుల్య ఆహారం తీసుకోవడం, డైట్‌లో ఉప్పు, చక్కెర శాతాన్ని తగ్గించడం, ప్రతిరోజూ తగినంత నీరు త్రాగడం ద్వారా శరీరంలోని మొత్తం కొవ్వును తగ్గించుకోవాలి. దాంతో పాటు నిపుణులు సూచించే సురక్షితమైన ముఖ వ్యాయామాలు చేయడం వల్ల మాత్రమే పదునైన, అందమైన దవడ ఆకృతిని శాశ్వతంగా సొంతం చేసుకోగలరు.
