
తీవ్రమైన వేడిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి పుచ్చకాయకు మించిన ప్రత్యామ్నాయం లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే పుచ్చకాయలో దాదాపు 95 శాతం నీరు ఉంటుంది. అయితే పోషకాహార నిపుణుల ప్రకారం ఈ పండు పూర్తి ప్రయోజనాలను పొందాలంటే దానిని తినడానికి సరైన నియమాలను పాటించాలి. పుచ్చకాయను తప్పుడు ఆహారంతో కలిపి తినడం వల్ల శరీరానికి మేలు కంటే కీడే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది పుచ్చకాయను కోసి తినడానికి ముందు చాలా సేపు బయట లేదా ఫ్రిజ్‌లో ఉంచుతారు. కోసిన పుచ్చకాయపై సాల్మొనెల్లా లేదా ఇ. కోలి వంటి హానికరమైన బ్యాక్టీరియా త్వరగా పెరుగుతుంది. అందువల్ల పచ్చకాయను కోసిన వెంటనే ఎక్కువ సేపు ఉంచకుండా వెంటనే తినడం మంచిది.
పుచ్చకాయ తిన్న వెంటనే చేపలు, మాంసం, గుడ్లు వంటి అధిక ప్రోటీన్ ఉన్న ఆహారాలను తినకూడదు. పుచ్చకాయ చాలా త్వరగా జీర్ణమైనప్పటికీ, దానిలోని ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేయడానికి శరీరానికి చాలా సమయం పడుతుంది. ఈ రెండింటి కలయిక కడుపు ఉబ్బరానికి, తీవ్రమైన అజీర్ణానికి దారితీయవచ్చు. అలాగేపుచ్చకాయ తిన్న వెంటనే పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల కడుపులోని pH స్థాయిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పుచ్చకాయలోని నీటి శాతం కడుపులోని ఆమ్లాన్ని పలుచబరుస్తుంది. దీనివల్ల పాల ఉత్పత్తులను జీర్ణం చేసుకోవడం కష్టమవుతుంది. ఇది కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ వంటి అసౌకర్యానికి దారితీసే ప్రమాదం ఉంది. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానిని తిన్న వెంటనే ఎక్కువగా నీళ్లు తాగడం మంచిది కాదు. పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మందగించి, కడుపులో అసౌకర్యం పెరగవచ్చు. ఈ పండును తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల తర్వాత నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
నారింజ, నిమ్మకాయలు, ద్రాక్ష వంటి పుల్లని పండ్లతో పుచ్చకాయను తినడం అస్సలు ఆరోగ్యకరం కాదు. పుచ్చకాయ తీపి పండు. కాబట్టి పుల్లని పండ్లతో దాని కలయిక జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. కడుపు సమస్యలు ఉన్నవారు ఈ రెండు రకాల పండ్లను కలిపి తినడం మానుకోవాలి. రాత్రిపూట లేదా నిద్రపోయే ముందు పుచ్చకాయ తినడం వల్ల జీర్ణక్రియపై అదనపు భారం పడి, నిద్రకు భంగం కలుగుతుంది. జీర్ణక్రియ చురుకుగా ఉండే ఉదయం లేదా మధ్యాహ్నం పూట పుచ్చకాయ తినడం ఉత్తమం. శరీరానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, భారీ భోజనం చేసిన వెంటనే పుచ్చకాయ తినడం మానుకోండి. పుచ్చకాయ తినేటప్పుడు ఈ చిన్న విషయాలను పాటిస్తే మీరు తాజాగా ఉండటమే కాకుండా పూర్తి పోషకాలను కూడా పొందుతారు. ఆరోగ్యంగా ఉండటానికి కాలానుగుణంగా లభించే పండ్లను సరైన సమయంలో, సరైన పద్ధతిలో తినే అలవాటును పెంచుకోవడం చాలా అవసరం.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.