Parenting: పిల్లలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త.. నోరు జారితే అంతే సంగతులు!
ఈరోజుల్లో పిల్లల్ని పెంచడం ఒక సవాలుగా మారింది. తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం కేవలం వారికి ఆహారం, విద్య అందించడం మాత్రమే అనుకుంటే పొరపాటే అవుతుంది. వారితో బలమైన, ఆరోగ్యకరమైన అనుబంధాన్ని నిర్మించడం చాలా ముఖ్యం. దీనికి మూలం సమర్థవంతమైన సంభాషణ ..

ఈరోజుల్లో పిల్లల్ని పెంచడం ఒక సవాలుగా మారింది. తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం కేవలం వారికి ఆహారం, విద్య అందించడం మాత్రమే కాదు. వారితో బలమైన, ఆరోగ్యకరమైన అనుబంధాన్ని నిర్మించడం ముఖ్యం. దీనికి మూలం సమర్థవంతమైన సంభాషణ.
తల్లిదండ్రులు తమ పిల్లలతో మెరుగైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి, వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడటానికి నాలుగు ముఖ్యమైన చిట్కాలను సూచిస్తున్నారు నిపుణులు. ఈ చిట్కాలు పిల్లలు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడానికి, తల్లిదండ్రులపై నమ్మకాన్ని పెంచుకోవడానికి తోడ్పడతాయని సూచిస్తున్నారు. పిల్లలతో మాట్లాడేందుకు పాటించాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం..
చెప్పేది వినాలి..
పిల్లలు మీతో మాట్లాడేటప్పుడు, వారి మాటలను అస్సలు అడ్డుకోకుండా, వారు చెప్పేది పూర్తిగా వినడం చాలా ముఖ్యం. ‘యాక్టివ్ లిజనింగ్’ అంటే కేవలం వినడం కాదు, వారి వైపు చూడటం, ఫోన్‌ను పక్కన పెట్టడం, వారు చెప్పేదానిపై నిజమైన ఆసక్తి చూపించడం. వారు తమ బాధను, సంతోషాన్ని లేదా భయాన్ని వ్యక్తం చేసినప్పుడు, ‘ఓహ్, ఇది నీకు చాలా కష్టంగా ఉందా?’ అని వారి భావాలను ధృవీకరించడం చేయాలి. ఇది పిల్లలకు తమ భావాలకు విలువ ఇస్తున్నారనే భావనను కలిగిస్తుంది.
జడ్జ్ చేయకూడదు
పిల్లలు తమ తప్పులు, భయాల గురించి చెప్పినప్పుడు, తల్లిదండ్రులు వెంటనే తీర్పు చెప్పకూడదు, విమర్శించకూడదు. ‘నీకు ఇప్పుడైనా బుద్ధి వచ్చిందా?’,‘ఇది చిన్న విషయం, దీనికే ఎందుకు భయపడుతున్నావ్?’ వంటి మాటలు వారిని బాధపెడతాయి. ఇలాంటి ప్రతిస్పందనలు పిల్లలు భవిష్యత్తులో ముఖ్యమైన విషయాలను దాచడానికి దారితీస్తాయి. బదులుగా, ప్రశాంతంగా పరిస్థితిని అర్థం చేసుకుని, పరిష్కారం వైపు నడిపించాలి.
నిందించకూడదు
పిల్లలతో మాట్లాడేటప్పుడు వారిని నిందించడం మానుకోవాలి. ‘నీవు ఎప్పుడూ ఇలాగే చేస్తావు’ అని చెప్పే బదులు, ‘నువ్వు ఇలా చేసినప్పుడు నాకు బాధగా అనిపిస్తుంది’ అనే వాక్యాలను ఉపయోగించడం వల్ల సంభాషణలో సున్నితత్వం పెరుగుతుంది. ఇది పిల్లలు తమ చర్యల వల్ల ఇతరులపై పడే ప్రభావాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది.
సమయాన్ని కేటాయించడం
రోజులో కొంత సమయాన్ని పిల్లలతో గడపడానికి కేటాయించాలి. ఆ సమయంలో వారు ఏం చేయాలనుకుంటే అది చేయనివ్వాలి. బొమ్మలు ఆడటం, సైకిల్ తొక్కడం వంటివాటిలో వారితో కలిసిపోవాలి. ఈ నాణ్యమైన సమయం ద్వారా పిల్లలు తమ తల్లిదండ్రులు తమ కోసం అందుబాటులో ఉన్నారని, తమతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారని భావిస్తారు. ఈ సాధారణ క్షణాలు వారి అనుబంధాన్ని మరింత బలపరుస్తాయి.
పిల్లలతో పెంచడంలో ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా, వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. తల్లిదండ్రులు, పిల్లల మధ్య బలమైన బంధం ఏర్పడటానికి ఈ చిట్కాలు చక్కగా పనిచేస్తాయి. మీరూ ట్రై చేసి చూడండి!




