బతకనిద్దాం… చదవనిద్దాం.. ఎదగనిద్దాం..

ఆడపిల్ల.. ఇంటికి మహాలక్ష్మి. లక్ష్మీకళ వచ్చిందని చెప్పుకునే వాళ్లు. ఆనందించే వాళ్లు. కాలం మారుతోంది. ఇప్పుడు ఆడపిల్లను భారంగా భావించే వాళ్లు చాలా మందే వున్నారు. పుట్టక ముందే ఉసురు తీస్తున్న వాళ్ళు..పురిట్లోనే ఊపిరి తీసేసే వాళ్ళు మరికొందరు. పుట్టాక పారేసే వాళ్లు ఇంకొందరు. అంటే ఆడ పిల్ల పుట్టకగానే మనసులో ఏదో తెలియని బాధను వ్యక్తం చేస్తున్న వాళ్లు కోకొల్లలు. అయ్యో ఆడపిల్ల పుట్టిందా అనే నిట్టూర్పు. ఆడపిల్ల పుట్టకముందు నుండే వివక్షత మొదలువుతోంది. పుట్టాక […]

బతకనిద్దాం... చదవనిద్దాం.. ఎదగనిద్దాం..
Follow us

|

Updated on: Jan 13, 2020 | 7:15 PM

ఆడపిల్ల.. ఇంటికి మహాలక్ష్మి. లక్ష్మీకళ వచ్చిందని చెప్పుకునే వాళ్లు. ఆనందించే వాళ్లు. కాలం మారుతోంది. ఇప్పుడు ఆడపిల్లను భారంగా భావించే వాళ్లు చాలా మందే వున్నారు. పుట్టక ముందే ఉసురు తీస్తున్న వాళ్ళు..పురిట్లోనే ఊపిరి తీసేసే వాళ్ళు మరికొందరు. పుట్టాక పారేసే వాళ్లు ఇంకొందరు. అంటే ఆడ పిల్ల పుట్టకగానే మనసులో ఏదో తెలియని బాధను వ్యక్తం చేస్తున్న వాళ్లు కోకొల్లలు. అయ్యో ఆడపిల్ల పుట్టిందా అనే నిట్టూర్పు. ఆడపిల్ల పుట్టకముందు నుండే వివక్షత మొదలువుతోంది. పుట్టాక ఆంక్షల సంగతి తెలియంది కాదు. ఫలితంగా స్త్రీ, పురుష నిష్పత్తిలో ఊహించనంత తేడా వస్తోంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇద్దరు పురుషలకు ఒక మహిళ ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వివాహానికి ఆడ పిల్లలు దొరక్క ఇబ్బంది పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బాలికల హక్కుల ఉల్లంఘన సాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆడపిల్లలు ఎదుర్కునే సవాళ్లను అధిగమించేందుకు ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 11వ తేదీని అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుతోంది.

తల్లి గర్భంలో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిస్తేనే అంతమొందిస్తున్నారు. భ్రూణ హత్యలు చేస్తున్నారు. అసలు పుట్టేది ఆడ పిల్లా కాదా అన్న లింగ నిర్థారణ పరీక్షలు వద్దని ప్రభుత్వం చెబుతున్నా..ఆచరణలో పాటిస్తున్నవారు అంతంత మాత్రమే. ఫలితంగా ఆడపిల్ల అందరికీ దూరమవుతోంది. అన్ని అంతరాలను దాటి కళ్లు తెరిచి భూమ్మీదకి వచ్చినా ఆడబిడ్డ అడుగడుగునా వివక్షకు గురవుతోంది. ఫలితంగా ఆడపిల్లల భవిష్యత్తు చిన్నప్పట్నించే ప్రశ్నార్థకమవుతోంది. జనాభా లెక్కల ప్రకారం స్త్రీ, పురుష నిష్పత్తిలో అనూహ్యమైన తేడా కనిపిస్తోంది.

దూరమవుతున్న అమ్మాయిలు

2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యిమంది పురుషులకు 940మంది మాత్రమే మహిళలున్నట్లు తేలింది. 2001లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 933 మంది బాలికలే ఉన్నారు. అదే ఆరేళ్ల లోపు బాలికలైతే కేవలం 914 మంది ఉన్నారు. 1981 లెక్కల ప్రకారం ప్రతి 1000మంది బాలురకు 962మంది బాలికలు ఉండగా, 1991 నాటికి ఆ సంఖ్య 945కు తగ్గింది. 2001 నాటికి 927కు పడిపోయింది. బాలికల సంఖ్య అతి వేగంగా తగ్గడానికి లింగ వివక్షే ప్రధాన కారణం.

బాలికల జీవితం వివక్షకు, అణచివేతకు గురవుతుంది. బాలికగా పుట్టే హక్కును లేకుండా చేస్తున్నారు. ఇప్పటికీ 40 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయి. చట్టాలు ఎన్ని వచ్చినా పరిస్థితిలో మార్పు రావడంలేదు. ఆడపిల్లలను కనడం దగ్గరనుంచి పెంచడం, పెద్ద చేయడం, చదివించడం, పెళ్ళి, కట్నం, ఉద్యోగం, కుటుంబం వంటి అనేక చోట్ల తల్లిదండ్రులు అవమానాలకు గురికావాల్సి వస్తోంది. ఈ సమాజ మనుగడకోసం ప్రతి పురుషుడు తనకొక భార్య కావాలని కోరుతున్నారు. కానీ తనకొక కూతుర్ని కంటానని అనుకోవడంలేదు. అందుకే ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయి వారు కరువవుతున్నారు. విద్యలోను వివక్షత ఉంది.

ఆడపిల్లలకు అందించే విద్యావకాశాలు తగ్గుతున్నాయి. ఫలితంగా ఆడపిల్లల చదువులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. మగపిల్లలతో వారిని పాఠశాలల్లో చేర్పించినా, కుటుంబ ఆర్థిక అవసరాల కోసమో, ఇతర బాధ్యతల కోసమో ఆడపిల్లలను చదువుకు దూరం పెడుతున్నారు. పెళ్లి పేరుతో వారిని ఉన్నత విద్యావకాశాలు అందకుండా చేస్తున్నారు. నూటికి 10 నుండి 30 శాతం మాత్రమే ఉన్నత చదువులకు వెళుతున్నారనేది నిజం.

ఆడ పిల్లలకు పోషకాహార లోపం ప్రధాన సమస్య. కుటుంబ ఆర్థిక సమస్యలు ఇందుకు ఒక కారణం. ఏదో ఒక పనిచేసి కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సొంతూరులో పని లేక ఆడపిల్లలు వలస పోతున్నారు. అక్కడ ఆదుకునే వాళ్లు లేక లైంగిక దాడుల బారిన పడేవారికి కొదవలేదు. ఏటా కనిపించకుండా పోతున్న వారి సంఖ్య వందల్లోనే ఉంది. సామాజిక, ఆర్థిక పరిస్థితిల్లో వచ్చిన మార్పుల ఫలితంగా బాలికలంటే కేవలం కట్నం ఇచ్చే యంత్రంగా చూస్తున్నారు. అందుకే ఆడపిల్లల పెళ్లిళ్లు భారంగా మారాయి. పేద తల్లిదండ్రులు తప్పని పరిస్థితుల్లో మైనార్టీ నిండకుండానే తమ పిల్లలను ఓ అయ్య చేతిలోపెడుతున్నాడు. ఫలితంగా చిన్న వయస్సులోనే అమ్మలుగా మారుతున్నారు.

ఆడుకోవాల్సిన వయసులో ఆడించాల్సిన పరిస్థితి చూసి… భవిష్యత్తును తలచుకుని వారు కుమిలిపోతున్నారు. ఇటు అమ్మ ఇంటికి రాలేక.. అలా అని అక్కడ ఉండలేక తల్లడిల్లుతున్నారు. మానసిక వేదనతో ఆరోగ్యసమస్యలను తెచ్చుకుంటున్నారు.

నిర్భయకాండ

చదువుకుంటున్న బాలికలకు భద్రత కరువైంది. పసి బాలికలపై కూడా పైశాచిక దాడులు సాధారణమయ్యాయి. ప్రైవేటు రంగాల్లో పని చేసే మహిళలకు పని వేళలు సరిగా ఉండటం లేదు. ఫలితంగా రాత్రివేళల్లో ఉంటున్నారు. అలాంటి సమయా ల్లో తమ గమ్యస్థానాలకు చేరడం ఇబ్బందిగా మారింది. బస్టాండుల్లో, రైల్వేస్టేషన్, రహదారుల్లో, వాహనాల్లో ఆకతాయిల ఆగడాలు మితి మీరుతున్నాయి. ఆకాశంలో సగంగా పిలిచే మహిళలపై అమానుష కాండ సాగుతోంది. గుర్ గావ్ లో శ్రీలక్ష్మీ అనే మహిళ క్యాబ్ బుక్ చేసుకుని వెళుతుండగా…డ్రైవర్ అత్యాచారం చేసి చంపేసిన ఉదతం ఉంది. అక్కడే కాదు..దేశ రాజధానిలో ఢిల్లీలో నిర్భయ అత్యాచారకాండ తెలియంది కాదు. ఒక్కచోట ఏంటి..దేశంలో చాలా చోట్ల ఇదే తంతు సాగుతోంది. చట్టాలు ఎన్ని ఉన్నా వికృత చేష్టలు ఆగడం లేదు. మానవ మృగాల దాడులు తగ్గడం లేదు. గత దశాబ్ద కాలంలో సుమారు 30 లక్షల మంది బాలికలు అదృశ్యమయ్యారు.

బాలికా విద్య, ఆరోగ్యం, పోషకాహారం, బాల్యవివాహాల నియంత్రణ, అక్రమ రవాణా వంటి విషయాలపై ప్రభుత్వం అవగాహన తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బేటి బచావో బేటి పడావో పథకం ద్వారా ప్రతి ఆడపిల్లకు లబ్ది చేకూర్చే పని చేస్తోంది. కౌమార దశలో ఆడపిల్లలు, యువతులు ఎదుర్కొనే వివిధ రకాల హింసను అంతం చేయాలి. తమ పై జరిగే దాడులను ఆడపిల్లలు తిప్పికొట్టే శక్తి సామర్ధ్యాలను గుర్తించాలి.

ఒక్క భారత్ లోనే కాదు…ప్రపంచ వ్యాప్తంగా బాలికల పట్ల వివక్ష, అసమానత, చిన్నచూపు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హింస, ఆధిపత్యం కొనసాగుతున్నయి. బాలికల విద్యా హక్కు కోసం పాకిస్తానీ బాలిక మలాలా చూపిన చొరవ, సాహసం మిగతా వారిలో చైతన్యం నింపుతోంది. విద్యావంతుల కుటుంబంలో, సామాజిక చైతన్యం కాస్తంత బాగానే ఉంటోంది. కానీ నిరక్షరాస్యుల కుటుంబాల్లోను ఆ మార్పు వస్తే తమపై జరిగే హింస, దాడులు తగ్గుతాయి.

ఆగని లింగ నిర్థారణ పరీక్షలు…

భారతదేశంలో 47 శాతం మంది మధ్య వయసు బాలికల్లో (కౌమార దశ) బరువు తక్కువగా ఉన్న లక్షణాలు ఉన్నాయి. భారత్‌లో లింగ నిర్థారణ పరీక్షలపై నిషేధం ఉంది. అయినా తగ్గడం లేదు. ఏటా ఇది 1000 కోట్ల రూపాయల అక్రమ, అనైతిక పరిశ్రమగా మారింది. భ్రూణ హత్యలకు కారణమవుతోంది. ఆఫ్రికా ఖండంలో మాధ్యమిక విద్య లేని బాలికలు దాదాపు 2కోట్ల మంది. ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల మంది బాలికలు పాఠశాల విద్యకు నోచుకోవడంలేదు. ప్రపంచవ్యాప్తంగా 70 కోట్లమంది అడపిల్లల వివాహాలు 18 సంవత్సరాలలోపు జరుగుతున్నాయి. వీళ్లలో ప్రతి ముగ్గురిలో ఒకరి కంటే ఎక్కువ మంది బాల్య వివాహం 15 సంవత్సరాలలోపే ఉంటోంది. అభివృద్ధి చెందుతున్నదేశాల్లో దాదాపు సగం శాతం ఆడపిల్లలు 18 సంవత్సరాలోపే తల్లులుగా మారుతున్నారు. ఆరోగ్యసమస్యల్ని ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వం పూనుకుంటేనే సరిపోదు. పౌర సంస్థలు, ప్రజలు, ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు ఏకం కావాలి. కలసి కట్టుగా ప్రణాళికా బద్దంగా నిబద్దతతో కృషి చేయాలి. కిశోర బాలికలకి సాంకేతిక, వృత్తి విద్యా అవకాశాలు కల్పించాలి. శిక్షణ ఇవ్వాలి. తన జీవితాన్ని తాను తీర్చి నడిపించుకునేందుకు వృత్తి నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, జీవన నైపుణ్యాలు, సామాజిక , ఆర్ధిక , ఆరోగ్యఅంశాలపై అవగాహన కల్పించాలి. నేటి ఆడపిల్లలకి తప్పని సరి అవసరమైన భద్రత, సాంకేతిక విజ్ఞానాన్ని సేవల్ని అందుబాటులోకి తేవాలి. సామాజిక, ఆర్ధిక , రాజకీయ పరిస్థితులపట్ల అవగాహన కలిగించాలి. అబ్బాయిలతో సమానంగా సరైన వనరులు, విద్యని వారికి అందించాలి.

బాలికలు, స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలి. బాలికలకు సమాజంలో రక్షణ ఉందనే నమ్మకాన్ని కల్పించే బాధ్యత ప్రభుత్వం, పౌర సమాజం తీసుకోవాలి. అందుకే ఆడపిల్లని బతకనిద్దాం, చదవనిద్దాం. ఎదగనిద్దాం.

– కొండవీటి శివనాగరాజు సీనియర్ జర్నలిస్టు, టీవీ9.