ఆపరేషన్ కమలం… టీడీపీ నేతలకు గాలం!

Leaders From TDP and Other Parties Will Join BJP in Telangana, ఆపరేషన్ కమలం… టీడీపీ నేతలకు గాలం!

తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించాలి. అందుకు 2023 టార్గెట్ గా పక్కా వ్యూహంతో అడుగులు వెయ్యబోతున్నారు కమలం నేతలు. అందుకు ఆగస్ట్ 18 టైటిల్ గా పక్కా స్కెచ్ వేసింది బీజేపీ. తెలంగాణాలో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా ఆగస్ట్ 18న రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. అయితే ఈ పర్యటన వెనుక బీజేపీ వ్యూహమేంటి? అసలు 18న వీళ్లు ఏం చేయబోతున్నారు.. ఇదే రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకున్న బీజేపీ రాష్ట్రం పై మరింత ఉత్సాహం ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే నడ్డా ఆధ్వర్యంలో ఆపరేషన్ ఆకర్స్ కు భారీగానే ప్లాన్ చేశారని తెలుస్తోంది. అందులో భాగంగా ఆగస్ట్ 18న తెలంగాణలో ఉన్న టీడీపీని దాదాపుగా బీజేపీలో విలీనం చేసుకోబోతోంది. అంతే కాదు ప్రతి జిల్లానుంచి బాగా గుర్తింపు పొందిన ఒక లీడర్ ని పార్టీలో చేర్చుకోబోతున్నారు.

తెలంగాణలో టీడీపీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, రావుల చంద్ర శేఖర్ రెడ్డి తప్ప ఎవరూ లేరు. కానీ జిల్లా స్థాయినుంచి గ్రామ స్థాయి వరకు టీడీపీ కార్యకర్తలు బాగానే ఉన్నారు. వీరందరినీ కమల దళంలో కలిపేసుకోవాలనుకుంటోంది బీజేపీ. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది టీడీపీ కార్యకర్తలు, నేతలు ఒకేసారి బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. దాంతో టీడీపీ శాఖ మన పార్టీలో విలీనం కాబోతుందని కాషాయ కండువాలు చెబుతున్నాయి. ఎల్ రమణ తప్ప టీడీపీ నేతలంతా ఆగస్ట్ 18న టీడీపీలో చేరబోతున్నారట.

ఇటు ఫేమస్ లీడర్స్ కి గాలం వేసేందుకు టీఆర్ఎస్ నేతలతో కూడా టచ్ లోకి వెళ్తున్నారు బీజేపీ నేతలు. అయితే కారుకి షాకిచ్చి కాషాయ కండువా వేసుకోబోయేదెవరు? ఇదే చర్చ రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్ 17 తేదీ విమోచన దినం కేంద్రంగా టీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ మరో స్కెచ్ వేస్తోంది బీజేపీ. అంతకన్నా ముందు భారీస్థాయిలో వలసలను ప్రోత్సహించే వ్యూహానికి పదునుపెడుతోంది కమలదళం. కమలం ఎత్తులను ఓ కంట కనిపెడుతున్న గులాబీదళం కూడా అందుకు తగ్గట్టుగా ప్రతి వ్యూహాలను సిద్ధం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *