ఆర్టీసీ సమ్మె పై కేసీఆర్ ఉక్కుపాదం.. మరో మలుపు తిరుగుతున్న “రాజకీయం”

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. సమ్మె నుంచి వెనక్కు తగ్గేది లేదని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ సంఘాలు పట్టు బడుతున్నాయి. అయినప్పటికీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం దిగిరాదని కేసీఆర్ తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ పోరాట సమయంలో జరిగిన ఘటనలను.. ఆర్టీసీ కార్మికులు గుర్తుచేస్తున్నారు. నాడు తమకు సంఘీభావం తెలిపిన కేసీఆర్.. […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:18 am, Mon, 7 October 19
ఆర్టీసీ సమ్మె పై కేసీఆర్ ఉక్కుపాదం.. మరో మలుపు తిరుగుతున్న "రాజకీయం"

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. సమ్మె నుంచి వెనక్కు తగ్గేది లేదని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ సంఘాలు పట్టు బడుతున్నాయి. అయినప్పటికీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం దిగిరాదని కేసీఆర్ తేల్చిచెప్పారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ పోరాట సమయంలో జరిగిన ఘటనలను.. ఆర్టీసీ కార్మికులు గుర్తుచేస్తున్నారు. నాడు తమకు సంఘీభావం తెలిపిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకత చూపుతున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. తాము ప్రభుత్వ పథకాలకు అనర్హులం కాదని.. మరి తమ డిమాండ్లను నెరవేర్చడానికి సీఎం ఎందుకు యోచిస్తున్నారని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసి.. తెలంగాణ ఉద్యమంలో తమ వంతు ప్రధాన పాత్ర పోషించారు. ఆర్టీసీ కార్మికులంతా కలిసి సరిగ్గా 30 రోజుల పాటు విధులను పక్కనపెట్టి.. బస్సులు నిలిపివేసి ఉద్యమానికి దిగారు. కేసీఆర్ కూడా ఆర్టీసీ కార్మికుల త్యాగాలను ప్రశంసించారు. అప్పుడు అధికారమే ఎజెండాగా కేసీఆర్ వ్యవహరించారని.. ఎన్నికల ముందు హామీల మీద హామీలు గుప్పించి ఇప్పుడు కార్మికులపై బురద జల్లు తున్నారని అంటున్నారు. హక్కుల కోసం నిలదీస్తుంటే.. ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని బెదిరించడం కరెక్టు కాదంటున్నారు.

పండుగ సమయంలో కార్మికులు సమ్మె చేపడితే ప్రజలు ఇబ్బందులు పడతారని ప్రభుత్వానికి తెలుసు. కాని ప్రజల్లో కార్మికులను విలన్లుగా మార్చేందుకుకే వ్యూహాలు పన్నుతున్నారని కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. కార్మికులు విధుల్లోకి చేరకపోతే డిస్మిస్ చేస్తామనడం కూడా వారి ప్లాన్‌లో భాగమేనని ఆర్టీసీ కార్మికులు ఫైర్ అవుతున్నారు. ప్రతి సారి ఎన్నికల సమయం వచ్చినప్పుడు న్యాయం చేస్తామని.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని మభ్యపెడుతూ వస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క, టీజేఎస్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కూడా ఆర్టీసీ యూనియన్లకు మద్దతు తెలుపడంతో ఇది రాజకీయ రంగు సంతరించుకుంది.

ఇదిలా వుంటే, 2014లో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 56,740 మంది కార్మికులు ఉంటే నేడు సగానికి పైగా తగ్గారు. అయితే 50 శాతం బస్సులు కాలం చెల్లిన బస్సులతోనే 99.83 శాతం బస్సులను ఆపరేట్ చేస్తున్నారు. ఇక బస్సు టైర్ల మన్నికను 1.64 లక్షల కిలోమీటర్ల నుంచి 1.98 కిలోమీటర్లకు పెంచారు. అయినప్పటికీ ఆర్టీసీలో వస్తున్న నష్టాలకు కార్మికులే కారణమని చూపడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.

అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని.. తమ వేతనాన్ని పెంచాలని ఆ సంస్థ కార్మికులు ఆందోళనలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోగా.. వారి వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇక ఆ ఒప్పందం 2017 మార్చి 31తో ముగిసింది. ఏప్రిల్ నుంచి మరలా వారి వేతనాన్ని పెంచుతూ కొత్త ఒప్పందాన్ని అములులోకి తేవాల్సి ఉంది. కాని ఇచ్చిన ఒప్పందాన్ని మరిచి.. కార్మికులు అడిగినప్పుడల్లా రూ. 2,400 కోట్లకు పైగా నష్టాల్లో ఉన్న సంస్థలో మళ్లీ వేతన ఒప్పందం అడుగుతారా.. అసలు ఆర్టీసీని నడపాలో వద్దో కార్మికులే తేల్చుకోవాలని సీఎం కేసీఆర్ చెబుతున్నారు. పండగల సీజన్‌లో సమ్మెకు దిగిన వారితో రాజీ పడే సమస్యే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేకాదు ఇప్పటికే సమ్మె చేపట్టిన వారిలో 48,000 వేల మందిని ఆర్టీసీ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ సమ్మె ఆగదని కార్మికులు పట్టు వదలడం లేదు.