Chandrababu Cabinet: కొందరు దూరం..మరికొందరు కేసుల్లో.. ఇంకొందరు మిస్సింగ్! చంద్రబాబు కేబినెట్ సహచరులకేమైంది?

చంద్రబాబును అందరూ రాజకీయ చాణక్యునితో పోలుస్తారు. అధికారంలో వున్నప్పుడు ఆయనంతటి బలమైన నేత ఎవరూ కనిపించరు. కానీ టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో కీలక నేతలు ఏదో ఓరకంగా దూరం కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

  • Rajesh Sharma
  • Publish Date - 2:47 pm, Thu, 7 January 21
Chandrababu Cabinet: కొందరు దూరం..మరికొందరు కేసుల్లో.. ఇంకొందరు మిస్సింగ్! చంద్రబాబు కేబినెట్ సహచరులకేమైంది?

What happened to Chandrababu cabinet colleagues: అధికారంలో వున్నప్పుడున్న డాబు దర్పం.. అధికారాంతమున కనిపించవు. అందుకు చక్కని ఉదాహరణ గతంలో చక్రం తిప్పిన మంత్రులిప్పుడు ఏదో ఓ రూపంలో రాజకీయాల్లో కనుమరుగవుతున్న పరిస్థితి. కొందరు రాజకీయాలకే దూరమైతే.. మరికొందరు అధికారం కోల్పోగానే వేరు దారి చూసుకుంటున్నారు. మరికొందరు ఏదో ఓ కేసులో ఇరుక్కుని వార్తల్లో వివాదాస్పదులుగా తేలుతున్నారు. ఇంకొందరైతే రాజకీయాల్లో వుంటూనే కంటికి కనిపించకుండా దాగుడు మూతలాడుతున్నారు.

ఈ ఉపోద్ఘాతమంతా 2014 నుంచి 2019 దాకా ఏపీ పాలిటిక్స్‌లో కీలకంగా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సహచరుల గురించే. చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు వీరంతా కేబినెట్ మంత్రుల హోదాలో ఏపీ పాలిటిక్స్‌లో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన వారే. కానీ 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోగానే ఆయన కేబినెట్‌లో మంత్రులుగా వ్యవహరించిన వారంతా తలో రకంగా దూరమయ్యారు. కొందరు ఆయన దగ్గరుంటూనే వివాదాస్పదులుగా వార్తలకెక్కి పరోక్షంగా పార్టీ పరువు తీస్తున్నట్లు కనిపిస్తోంది.

2014లో రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆ తర్వాత అయిదేళ్ళ పాటు ఆయన ఏపీని తనదైన శైలిలో పరిపాలించారు. 2019లో మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా మిత్ర పక్షాలు బీజేపీ, జనసేన దూరం కాగా… వైసీపీ దూకుడుకు ఎదురు నిల్వలేకపోయారు చంద్రబాబు. 2019లో తెలుగు దేశం పార్టీ కేవలం 23 సీట్లకే పరిమితం కాగా.. అప్పటి దాకా బలంగా కనిపించిన టీడీపీ ఒక్కసారిగా బలహీన పార్టీగా నిలిచింది. ఆ తర్వాత పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. పార్టీ తరపున గెలిచిన 23 మందిలో పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంపయ్యారు. చంద్రబాబు మంత్రివర్గంలో పని చేసిన మాజీ మంత్రులు శిద్దా రాఘవ రావు, రావెల కిశోర్ బాబు, ఆదినారాయణ రెడ్డి.. పార్టీని వీడారు. వీరిలో శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరిపోయారు.

ప్రముఖ గ్రానైట్ వ్యాపారిగా రాజకీయాల్లో ప్రవేశించిన శిద్ధా రాఘవరావు 2014లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ చంద్రబాబు ఆయనపై విశ్వాసంతో మంత్రి పదవిని కట్టబెట్టారు. అయితేనేం.. పార్టీ 2019లో ఓడిపోగానే ఆయన పార్టీ మారిపోయారు. అప్పటి దాకా రాజకీయ ప్రత్యర్థిగా భావించిన వైసీపీలో చేరిపోయారు. రావెల కిశోర్ బాబుది దాదాపు ఇదే పరిస్థితి. వివిధ ప్రభుత్వ విభాగాలలో అధికారిగా పని చేసిన రావెల కిశోర్ బాబు 2014లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక కాగా.. అడ్మినిస్ట్రేటర్‌గా ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు మంత్రి పదవినిచ్చారు. కారణాలేంటో గానీ.. ఆయన టీడీపీని వీడి బీజేపీలో చేరిపోయారు.

ఇక కడప జిల్లా ఫ్యాక్షన్ రాజకీయాల్లో తరచూ వినిపించే పేరు ఆదినారాయణ రెడ్డి. చిరకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆదినారాయణ రెడ్డి.. ఆ తర్వాత జగన్ నేతృత్వాన్ని మెచ్చి వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కానీ.. ఆ తర్వాత చంద్రబాబు విసిరిన ఆకర్ష్‌లో భాగంగా ఆయన టీడీపీలో చేరారు. ఏకంగా మంత్రిపదవిని చేపట్టారు. అయితే అదెంతో కాలం నిలవలేదు. అధికారాంతమున ఆదినారాయణ రెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు.

నలుగురిపై క్రిమినల్ కేసులు

చంద్రబాబు మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరించిన నలుగురు మాజీ మంత్రులు క్రిమినల్ కేసుల పాలయ్యారు. ముగ్గురు అరెస్టయి వార్తలకెక్కారు. వీరిలో మొదటి వ్యక్తి కొల్లు రవీంద్ర. మచిలీపట్నంకు చెందిన కొల్లు రవీంద్ర చంద్రబాబు హయాంలో అయిదేళ్ళ పాటు మంత్రిగా వ్యవహరించారు. కాగా.. 2020 జూన్ 29న వైసీపీకి చెందిన మోకా భాస్కర రావు పట్టపగలు దారుణ హత్యకు గురికాగా.. ఆ కేసులో ఏ4గా అభియోగాన్ని ఎదుర్కొన్న కొల్లు రవీంద్రను పోలీసులు జులై 3న అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం వెళుతుండగా.. తూర్పు గోదావరి జిల్లా తుని వద్ద పోలీసులు రవీంద్రను అరెస్టు చేశారు. దాదాపు నెలన్నర పాటు కొల్లు రవీంద్ర జ్యూడిషియల్ రిమాండ్‌లో జైలు జీవితం గడిపారు. ఆగస్టు 23, 2020న కొల్లు రవీంద్రకు కోర్టు కండీషనల్ బెయిల్ మంజూరు చేయగా విడుదలయ్యారు. కానీ ఆ తర్వాత యాక్టివ్ రాజకీయాల్లో ఆయన కనిపించడం మానేశారు.

ఇక మరో కీలక నేత.. ఏపీ టీడీపీ ప్రస్తుత అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టయ్యారు. చిరకాలం పాటు ఆయన జైలుకు పరిమితమయ్యారు. జ్యూడిషియల్ రిమాండ్‌లో వుండగా.. ఆయన అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. అక్కడ వుండగానే ఆయన కరోనా వైరస్ సోకింది. చికిత్స తర్వాత బెయిల్ మీద విడుదలైన వెంటనే ఆయన్ను తెలుగుదేశం పార్టీ ఏపీ విభాగం అధ్యక్షునిగా నియమించారు చంద్రబాబు. అదే ఈఎస్ఐ స్కామ్‌లో మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా అభియోగాలను ఎదుర్కొన్నారు. మెడిసిన్స్ కొనుగోలు పేమెంట్లలో నిబంధనలను, మెమోలను పట్టించుకోలేదన్నది ఆయనపై మోపిన అభియోగం.

ఇక తాజాగా మరో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కిడ్నాపింగ్ కేసులో అరెస్టయ్యారు. ఆమెను 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీతో చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులుగా భావిస్తున్న ప్రవీణ్ రావు తదితరులు ముగ్గురిని హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని వారి స్వగృహం నుంచి కిడ్నాప్ చేసిన కేసులో ముందుగా ఏ2గా భూమా అఖిల ప్రియను పేర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత ఏ1గా మార్చారు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.

ఇద్దరు రాజకీయ సన్యాసం

చంద్రబాబు హయాంలో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కర్నూలు జిల్లా సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి అయితే ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. వయసు మీదపడడం ప్రధాన కారణంగా చెబుతున్నప్పటికీ.. పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గడం.. కొత్తగా చేరిన వారికి జిల్లా రాజకీయాల్లో కీలక బాధ్యతలు అప్పగించడం వల్లనే కేఈ క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలిగారని చెబుతున్నారు. మరో సీనియర్ నేత.. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు సమకాలికుడు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి కూడా క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలిగారు. అనారోగ్యం కారణంగా ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు సమాచారం.

పలువురు మాజీలు మిస్సింగ్!

ఇదంతా ఒకెత్తైతే.. చంద్రబాబు మంత్రివర్గంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన మరికొందరు రాజకీయంగా అదృశ్యమవడం మరింత చర్చనీయాంశమైంది. ఈ కోవలో గంటా శ్రీనివాస్ రావు, నారాయణ వస్తారు. వీరిలో గంటా అయితే వైసీపీలోగానీ.. బీజేపీలోగానీ చేరతారంటూ గత ఏడాది కాలంగా జోరుగా చర్చ జరుగుతోంది. అడపాదడపా పబ్లిగ్గా దర్శనమిస్తున్న గంటా శ్రీనివాస్ రావు.. అంతరంగం ఏమిటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. పార్టీ మారతారా లేక టీడీపీలోనే కొనసాగుతారా అన్నది తేలడం లేదు. కానీ.. టీడీపీలో యాక్టివ్‌గా లేరన్నది మాత్రం క్లియర్ కట్‌గా అందరికీ అర్థమవుతోంది. మరో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణ కూడా 2019లో పార్టీ ఓడిపోయిన తర్వాత క్రియాశీలకంగా లేరు. ఆయన గంటా శ్రీనివాస్ రావుకు దగ్గరి బంధువు అన్న సంగతి అందరికీ తెలిసిందే.

పరిటాల సునీత, సుజయ రంగారావు, పల్లె రఘునాథరెడ్డి, పీతల సుజాత, కిడారు శ్రవణ్ లాంటి చంద్రబాబు మంత్రి వర్గ సహచరులు కూడా ప్రస్తుతం క్రియాశీలకంగా కనిపించడం లేదు. వీరిలో పరిటాల సునీత అయితే ఏకంగా పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా జరిగింది. ఈ ప్రచారాన్ని పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ ఖండించినప్పటికీ.. ఆమె పార్టీలో మాత్రం యాక్టివ్‌గా కనిపించడం లేదు. ఈరకంగా చంద్రబాబు మంత్రివర్గంలో కీలకంగా పని చేసిన పలువురు అయితే వివాదాస్పదులుగానో.. లేక జంపింగ్ జపాంగ్‌లుగానో.. లేక రాజకీయ సన్యాసం తీసుకోవడమో జరగడం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి:

కిడ్నాప్ కేసులో కీలక మలుపు.. ఏ1గా అఖిల ప్రియ.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

సీపీ సజ్జనార్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సవాల్