ఎన్సీపీ నేత శరద్ పవార్ తో మమతా బెనర్జీ సంప్రదింపులు, బీజేపీపై పోరాటమే లక్ష్యం, త్వరలో బెంగాల్ కు పవార్ ?

ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలనుఅస్థిర పరచేందుకు బీజేపీ యత్నిస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి..

  • Umakanth Rao
  • Publish Date - 7:35 pm, Mon, 21 December 20
ఎన్సీపీ నేత శరద్ పవార్ తో మమతా బెనర్జీ సంప్రదింపులు, బీజేపీపై పోరాటమే లక్ష్యం, త్వరలో బెంగాల్ కు పవార్ ?

ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలనుఅస్థిర పరచేందుకు బీజేపీ యత్నిస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఈ మేరకు సోమవారం ఆమె ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ తో ఫోన్ లో మాట్లాడారని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తెలిపారు. మా ప్రభుత్వాన్ని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది, మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ముఖ్యంగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను తిరిగి ఢిల్లీకి రావలసిందిగా ఆదేశించింది అని మమత..పవార్ దృష్టికి తెచ్చారు. బెంగాల్ ను అస్థిర పరచేందుకు బీజేపీ యత్నిస్తోందన్న మమత ఆరోపణను తమ నేత సమర్థించారని నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. ఒక రాష్ట్ర హక్కులపై పెత్తనం చెలాయించాలని కమలం పార్టీ చూస్తోందన్న దీదీ అభిప్రాయంతో పవార్ ఏకీభవించినట్టు తెలుస్తోంది. కాగా అవసరమైతే పవార్ త్వరలో బెంగాల్ వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మమతా బెనర్జీ, పవార్ ఇద్దరూ ఇతర జాతీయ నాయకులను కూడా కలుసుకోవచ్ఛునని భావిస్తున్నారు.

ఇలా ఉండగా భారతీయ జనతా పార్టీని మమత..’ఛీటింగ్ బాజ్’ (మోసపూరిత పార్టీ) గా అభివర్ణించారు. సంకుచిత రాజకీయాల కోసం వారు ఎంత నీచానికైనా పాల్పడతారని అన్నారు. ముగ్గురు ఐ పీ ఎస్ అధికారులను కేంద్రానికి పంపేందుకు ఆమె నిరాకరిస్తున్నారు. దీంతో ఆ అధికారుల్లో అయోమయం నెలకొంది.