నాయకత్వం కోసం అమెరికా పరితపిస్తోందని అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా ఎంపికైన కమలా హారిస్ అన్నారు. అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రాట్ క్యాండిడేట్ జో బిడెన్ తో కలిసి ఆమె మొదటిసారిగా డెల్వర్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ దేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని, ట్రంప్ అధ్యక్ష పదవికి తగినవారు కాదని ఆమె అన్నారు. దేశాన్ని ఈ అధినేత గాలికి వదిలేశారని ఆమె ఆరోపించారు. ప్రజలను ఆప్తులుగా చూసుకునే అధ్యక్షుడు రానున్నారని తన పక్కనే ఉన్న జో బిడెన్ ని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. ఈ దేశాన్ని పునర్నిర్మిద్దాం అన్నదే ఆయన నినాదమని ఆమె చెప్పారు. కరోనా వైరస్ పరిస్థితిని, దేశ ఆర్థిక వ్యవస్థను ట్రంప్ సమర్థంగా హ్యాండిల్ చేయలేకపోయారని కమలా హారిస్ ఆరోపించారు.
ఈ దేశం రేసిజం, సిస్టమిక్ ఇన్ జస్టిస్ (పథకం ప్రకారం జరిగే అన్యాయం) వంటి అవలక్షణాలతో బాధ పడుతోందని, మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. అటు-జో బిడెన్ ఈమె ప్రతిభను, వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ మాట్లాడారు. బిడెన్, ట్రంప్ కన్నా సుమారు 20 ఏళ్ళు చిన్న వయస్కురాలైన కమలా హారిస్ తన ప్రసంగాలతో యువతను ఆకట్టుకోగలరని భావిస్తున్నారు.