యాదాద్రి-వరంగల్‌ జాతీయ రహదారిని ప్రారంభించిన మంత్రి నితిన్‌ గడ్కరీ..అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని హామీ

యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వరంగల్‌ నగర జిల్లా ఆరేపల్లి వరకు నిర్మించిన నేషనల్‌ హైవేను ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారంభించారు. జాతీయ రహదారి 163ను 1,905 కోట్ల రూపాయలతో నిర్మించారు...

  • Sanjay Kasula
  • Publish Date - 5:44 pm, Mon, 21 December 20
యాదాద్రి-వరంగల్‌ జాతీయ రహదారిని ప్రారంభించిన మంత్రి నితిన్‌ గడ్కరీ..అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని హామీ

యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వరంగల్‌ నగర జిల్లా ఆరేపల్లి వరకు నిర్మించిన నేషనల్‌ హైవేను ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారంభించారు. జాతీయ రహదారి 163ను 1,905 కోట్ల రూపాయలతో నిర్మించారు. మరికొన్ని రహదారులకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వీకే సింగ్‌, కిషన్‌రెడ్డి, తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. జాతీయ రహదారి 163తోపాటు 13,169 కోట్లతో 766కి.మీ మేర రహదారులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మొత్తం 14 రహదారుల్లో 6 ప్రాజెక్టులను గడ్కరీ జాతికి అంకితం చేయగా..మరో 8 నూతన రహదారులకు భూమి పూజ చేశారు.

అనంతరం మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. అవసరమైతే ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి… దానిపై దృష్టి సారిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణలో రోడ్ల విస్తరణకు కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటుందని హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దీనికి సంబంధించి భూ సేకరణను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని ఆయన సూచించారు.

హైదరాబాద్‌లో రోజు రోజుకూ పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని రీజనల్‌ రింగ్‌ రోడ్‌ నిర్మించనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. దీనికి కేంద్రం సహకరించాలని ఆయన కోరారు.