శ్రీవారి ఆభరణాలు గోవిందా..?

ఎంత సొంపు..ఏమి మైమరపు..ఎంతెంత అందం..ఎంతెంత ఆనందం!! నిత్య కల్యాణమూర్తిని చూసినంతనే తెలియని తన్మయత్వం!! తిరుమల పెరుమాళ్లు ఒడలెల్ల ధరించిన ఆభరణాలకు ఎంతో చరిత్ర ఉంది. గత వెయ్యేళ్లలో వేంకటేశ్వరునికి ఎంతోమంది ప్రభువులు ఎన్నో వెలకట్టలేని ఆభరణాలను సమర్పించారు. కానీ ఆ జాబితాలో మొదటి పేరు శ్రీకృష్ణదేవరాయలవారిదే! ఏడుమార్లు ఏడుకొండలవాడి దర్శనం చేసుకున్న రాయలవారు..అపురూపమైన కానుకలను శ్రీవారికి సమర్పించారు. మరి సాహితీ సమరాంగణ సార్వభౌముడు..శ్రీనివాస ప్రభువు ముందు చేతులు జోడించి.. ఏయే కానుకలు అర్పించారో శాసనాల ఆధారంగా మీముందుంచుతున్నాం!! […]

  • Ram Naramaneni
  • Publish Date - 6:39 pm, Sat, 2 November 19
శ్రీవారి ఆభరణాలు గోవిందా..?

ఎంత సొంపు..ఏమి మైమరపు..ఎంతెంత అందం..ఎంతెంత ఆనందం!! నిత్య కల్యాణమూర్తిని చూసినంతనే తెలియని తన్మయత్వం!! తిరుమల పెరుమాళ్లు ఒడలెల్ల ధరించిన ఆభరణాలకు ఎంతో చరిత్ర ఉంది. గత వెయ్యేళ్లలో వేంకటేశ్వరునికి ఎంతోమంది ప్రభువులు ఎన్నో వెలకట్టలేని ఆభరణాలను సమర్పించారు. కానీ ఆ జాబితాలో మొదటి పేరు శ్రీకృష్ణదేవరాయలవారిదే! ఏడుమార్లు ఏడుకొండలవాడి దర్శనం చేసుకున్న రాయలవారు..అపురూపమైన కానుకలను శ్రీవారికి సమర్పించారు. మరి సాహితీ సమరాంగణ సార్వభౌముడు..శ్రీనివాస ప్రభువు ముందు చేతులు జోడించి.. ఏయే కానుకలు అర్పించారో శాసనాల ఆధారంగా మీముందుంచుతున్నాం!! ‌‌

ఎంతటి రాజులైనా…రారాజులైనా సర్వజగత్‌ సార్వభౌముడుగా భావించే శ్రీనివాసుడి ముందు ఎంతటివారు? మహా చక్రవర్తులు కూడా వేంకటేశ్వర విభుని ముందు వినమ్రంగా మోకరిల్లినవారే!. మా రాజ్యాలు..మా భోగాలు నీ దయతో వచ్చినవే అంటూ శ్రీవారికి సవినయంగా కానుకలు సమర్పించినవారే! అనాటి పల్లవుల నుంచి ఈనాటి పారిశ్రామికవేత్తల వరకు ఎవరెన్ని కానుకలిచ్చినా..శ్రీవారికి కృష్ణదేవరాయలు సమర్పించిన కానుకలే ఎక్కువ!!

కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని క్రీ.శ.1509 నుంచి క్రీ.శ.1529 వరకు పాలించారు. సాహితీ సమరాంగణ సార్వభౌముడైన రాయలవారు దేవదేవునికి పరమభక్తుడు! ఆయన ఏడుసార్లు ఏడుకొండలవాడి దర్శనం కోసం తిరుమల యాత్ర చేశారు. క్రీ.శ.1513 నుంచి క్రీ.శ.1521 మధ్యకాలంలో రాయలవారు ఏడుసార్లు తిరుమల యాత్ర చేసినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఆ ఏడుసార్లూ వెలకట్టలేని ఆభరణాలను శ్రీవారికి సమర్పించారని శాసనాలు చెబుతున్నాయి. తిరుమల ఆలయంలో దాదాపు 1200కు పైగా శాసనాలు లభ్యమయ్యాయి. వాటిలో 50 శాసనాల్లో కృష్ణదేవరాయలు ఆయన దేవేరులైన తిరుమల దేవి, చిన్నాదేవిల ప్రస్తావన ఉంది. కృష్ణదేవరాయలు తిరుమల యాత్ర, శ్రీవారికి సమర్పించిన కానుకల వివరాలు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోని శాసనాల్లో ప్రకటితం అవుతున్నాయి. తిరుమల శాసనాలను బట్టి..కృష్ణదేవరాయలు క్రీ.శ.1513, ఫిబ్రవరి 10న మొట్టమొదటిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సందర్భంలోనే 3.3 కేజీల నవరత్న కిరీటం, ముత్యాలు పొదిగిన మూడుపేటల కంఠహారం, 25 వెండి హారతి పళ్లాలు సమర్పించారు. ఇక కృష్ణదేవరాయల పట్టపురాణులైన చిన్నాదేవి, తిరుమలదేవిలు శ్రీనివాసుడి ఏకాంతసేవలో ఉపయోగించే రెండు బంగారు గిన్నెలు సమర్పించారు.

క్రీ.శ.1513, మే2న కృష్ణదేవరాయలు రెండోసారి తిరుమలకు వెళ్లారు. ఆ సందర్భంలో వజ్రాలు, కెంపులు, పచ్చలు, రత్నాలు పొదిగిన 662 గ్రాముల మొలతాడును స్వామికి సమర్పించారు. ఇంకా వైజ్రవైఢూర్యాలు పొదిగిన కత్తి, 132 గ్రాముల నిచ్చకం కఠారి, ముత్యాలతో కూడిన కఠారి, వజ్రాల కఠారి, 98 గ్రాముల వజ్రాల పతకం, 573 గ్రాముల వజ్రాల భుజకీర్తులు, 168 గ్రాముల నిచ్చకం భుజకీర్తుల జోడు, 205 గ్రాముల బంగారుపేట, 276 గ్రాముల వజ్రాలమాలతోబాటు ఉత్సవమూర్తులను అలంకరించేందుకు 380 గ్రాముల బరువైన మూడు వజ్ర కిరీటాలు సమర్పించారు. క్రీ.శ.1513, జూన్‌ 13న దేవరాయలవారు మూడోసారి శ్రీవారిని దర్శించి..నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు, బంగారు గిన్నెలు సమర్పించారు. నిత్య నైవేద్యాలకుగాను ఐదు గ్రామాలను ఇనాముగా ఇచ్చారు. ప్రతి ఏటా తమిళనెల తై-మాసంలో తన తల్లిదండ్రుల ఆత్మోద్ధరణకై తిరుమలలో ఉత్సవం నిర్వహించారు.

క్రీ.శ.1514, జులై 6న ఉదయగిరి కోటను జయించిన కృష్ణదేవరాయలు.. విజయనగరానికి తిరిగివెళుతూ తిరుమల స్వామిని దర్శించుకున్నారు. ఆ ఆనందంలో 30వేల బంగారు వరహాలతో శ్రీవేంకటేశ్వరుడికి కనకాభిషేకం చేశారు. 250 గ్రాముల బంగారు త్రిసరం దండ, రెండు వజ్రాల కడియాలు సమర్పించారు. అంతేకాదు శ్రీవారి నిత్యారాధనకు తాళ్లపాక గ్రామాన్ని దానమిచ్చారు. అదే సమయంలో రాణి చిన్నాదేవి 200 గ్రాముల వజ్రాలు పొదిగిన మూడు కంఠమాలలతోబాటు.. నిత్య కైంకర్యాల కోసం ఓ గ్రామాన్ని కూడా స్వామికి సమర్పించారు. ఇక రాణి తిరుమలా దేవి.. ముత్యాలు, పచ్చలు, వజ్రాలు పొదిగిన 225న్నర గ్రాముల చక్ర పాదకం సమర్పించారు. క్రీ.శ. 1515, అక్టోబరు 25న కలింగ వరకు విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరించిన ఆనందంలో..తిరుమల యాత్ర చేశారు కృష్ణదేవరాయలు. ఆ సంతోషాన్ని పురస్కరించుకుని 27 కేజీల బరువున్న మకర తోరణాన్ని కానుకగా ఇచ్చారు.

క్రీ.శ.1517, జులై 2న కలింగ దేశాన్ని పూర్తిగా హస్తగతం చేసుకున్న తర్వాత తిరుమల సందర్శించారు కృష్ణదేవరాయలు! ఆ ఆనందంలో..శ్రీవారి ఆనంద నిలయానికి 30 వేల వరహాలతో బంగారు తాపడం చేయించారు. అలాగే వేంకటేశ్వరునికి బంగారు కంఠమాల, పతకం సమర్పించారు. అంతేకాదు కృష్ణదేవరాయలు స్వయంగా తమ విగ్రహాలను తిరుమల ఆలయంలో ప్రతిష్టించుకున్నారని శాసనాలు చెబుతున్నాయి. ఆనంద నిలయ గోపురానికి బంగారు తాపడం 1518 సెప్టెంబరు 9న పూర్తయింది. క్రీ.శ. 1521, ఫిబ్రవరి 17న కృష్ణదేవరాయలు ఏడోసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సందర్భంలో నవరత్న ఖచిత పీతాంబరం..రత్నాలు పొదిగిన వింజామర..రత్నాలు, పచ్చలు, నీలాలు పొదిగిన కుళ్లాయి, 31 కేజీల 124 గ్రాముల మకర తోరణం సమర్పించారు. అంతేకాదు 10 వేల బంగారు వరహాలు కూడా స్వామికి అర్పించారు. అయితే క్రీ.శ.1518, అక్టోబరు 16న రాణి తిరుమలాదేవితో కలిసి రాయలవారు తిరుమలకు వచ్చినట్లు కమలాపురం శాసనాల్లో ఉంది. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు తిరుమల శాసనాల్లో లేవు. ఏదిఏమైనా దేవదేవుడికి అపురూప కానుకలు సమర్పించిన రాజుల్లో దేవరాయలు అందరికంటే ముందుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించడానికి ముందు కృష్ణరాయ మండపంలో ప్రవేశిస్తారు భక్తులు! ఈ మండపం కుడివైపున తిరుమలదేవి, చిన్నాదేవిలతో కలిసి కృష్ణదేవరాయలు వేంకటేశ్వరునికి నమస్కరిస్తున్నట్లు ప్రతిష్టితులై కనిపిస్తారు. తిరుమల వైభవాన్ని చాటుతూనే ఉన్నారు.

స్వామివారి ఆభరణాలు ఉన్నాయా? స్వాహా అయ్యాయా?

మరి శ్రీవారికి శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన కానుకలు ఎక్కడున్నాయి. ఆయన అత్యంత భక్తితో ఇచ్చిన వజ్రకిరీటం ఏమైంది. అసలు ఆభరణాలకు చెందిన లెక్కలన్నీ ఖచ్చితంగా ఉన్నాయా?. అవి మిస్ అయ్యిపోతున్నాయన్న వాదనల్లో నిజం ఎంత..? ఇప్పుడు తెలుసుకుందాం.

తాను శ్రీవారికి ఏం..ఏం ఆభరణాలు ఇచ్చారనేది శ్రీకృష్ణదేవరాయలు శాసనాల వేయించారు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే..రాయలు ఇచ్చిన ఒక్క నగ కూడా ఇప్పుడు స్వామివారికి మిగలలేదు. స్వామివారి విశిష్టత, తిరుమల వైభవం, ఆభరణాలు గురించి.. ‘తిరుపతి శ్రీ వెంకటేశ్వర’ అనే బుక్‌లో..డా..సాదు సుబ్రమణ్యశాస్త్రిగారు 1921లో పబ్లిష్ చేశారు. ఆ బుక్‌ రాయడానికి ఆయన చేసిన అధ్యయనంలో భాగంగా..శాసనాలతో పోల్చి చూడగా అప్పటికే రాయలువారు ఇచ్చిన ఒక్క నగ కూాడా 1921కే లేనట్లు ధృవీకరించారు. ఈ విషయాన్ని ప్రస్తుత టీటీడీ ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి టీవీ9 చర్చావేదికగా తెలిపారు.