బీహార్ వాసులకు శుభవార్త.. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్.. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఫ్రీ..!

బీహార్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తీసుకువచ్చింది. అక్కడి ప్రజలందరికీ ఉచితంగా టీకా వేస్తామని ప్రకటించింది.

  • Balaraju Goud
  • Publish Date - 3:34 pm, Tue, 2 March 21
బీహార్ వాసులకు శుభవార్త.. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్.. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఫ్రీ..!

Free Covid 19 Vaccine : బీహార్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తీసుకువచ్చింది. అక్కడి ప్రజలందరికీ ఉచితంగా టీకా వేస్తామని ప్రకటించింది. ఇంతకాలం పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలో కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ను పూర్తిగా ఉచితంగా చేపడతామని ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్‌ హస్పిటల్స్‌లోనూ కరోనా వైరస్‌ కట్టడికి అందించే వ్యాక్సిన్లను ఉచితంగా ప్రజలకు అందేలా ఏర్పాట్లు చేస్తామని నితీష్‌ వెల్లడించారు. కాగా, దేశవ్యాప్తంగా మార్చి 1నుంచి 60 ఏండ్లు పైబడిన వారితో పాటు పలు వ్యాధులతో బాధపడే 45 ఏండ్లు దాటినవారికి కరోనా వ్యాక్సిన్లను ఇచ్చే ప్రక్రియ మొదలైంది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సాగుతుండగా, ప్రైవేట్‌ కేంద్రాల్లో వ్యాక్సిన్‌కు రూ 150తో పాటు సర్వీస్‌ చార్జ్‌ కింద రూ 100 వసూలు చేస్తారు. గరిష్టంగా వ్యాక్సిన్‌ ధర రూ 250 మించరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించింది. అయితే, కరోనా దెబ్బకు లాక్‌డౌన్ కారణంగా జనం ఆర్థికంగా చితికిపోయారు. పేదల ప్రజలు కనీసం వ్యాక్సిన్ కొనే పరిస్థితి లేదు. దీంతో బీహార్ ప్రభుత్వం ఓ అడుగు ముందు వేసి ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్నట్లు ప్రకటించింది.


మరోవైపు, గత ఏడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలిస్తే కోవిడ్ టీకా ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే చేసిన హామీని నిలబెట్టుకునేందుకు బీహార్ వాసులకు ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేపడుతున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు.

ఇదిలావుంటే, మరోవైపు, దేశంలో మార్చి 1నుంచి కరోనా టీకా అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. దేశ‌వ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20 వేల ప్రైవేటు వ్యాక్సినేష‌న్ సెంటర్లలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామ‌ని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ప్రైవేటు ఆసుప‌త్రులలో వ్యాక్సిన్ వేసుకోవాల‌ని అనుకునే వాళ్లు డ‌బ్బులు చెల్లించాల‌ని తెలిపింది. బీహార్ రాష్ట్ర సర్కార్ అందరికీ ఉచితంగా వ్యాక్సిన పంపిణీ చేయడం అన్నివర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Read Also..  IPhone13 Features: ఐఫోన్ 13లో ఉండనున్న ఫీచర్లు ఇవేనా..? స్టోరేజ్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..