సందిగ్ధంలో తెలంగాణ సర్కార్‌.. మందు వుందా? లేదా?

సందిగ్ధంలో తెలంగాణ సర్కార్‌.. మందు వుందా? లేదా?

కేంద్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను చేపట్టవచ్చు అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంపై తెలంగాణ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ....

Rajesh Sharma

|

May 03, 2020 | 12:21 PM

కేంద్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను చేపట్టవచ్చు అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంపై తెలంగాణ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో సహచర మంత్రులు, పార్టీ సీనియర్లు, సీనియర్ అధికారులతో శనివారం నుంచి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 4వ తేదీ నుంచి రెండు వారాల పాటు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు వారాల పాటు లాక్‌డౌన్ పొడిగించిన కేంద్ర హోంశాఖ.. అనేక సడలింపులను కూడా ప్రకటించింది. ముఖ్యంగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలు నిర్దిష్ట నియంత్రణలకు అనుగుణంగా కొనసాగించవచ్చని హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణలో లాక్ డౌన్ మే 7వ తేదీ దాకా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో మే 8వ తేదీ తర్వాత రాష్ట్రంలో మద్యం దుకాణాలను తెరవాలా? వద్దా? విషయంలో తెలంగాణ ప్రభుత్వం సందిగ్ధంలో పడింది.

మద్యం దుకాణాలను తెరిస్తే అక్కడ భారీ సంఖ్యలో గుమికూడే ప్రజలను నియంత్రించడం కష్టమవుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు మద్యం దుకాణాలు తెరవాలా? వద్దా? అనే విషయంలో తుది నిర్ణయం తీసుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కల్పించింది. ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టుకునేందుకు అవసరమైతే మద్యం దుకాణాలు తెరుచుకునే సౌకర్యం వుంది. తెలంగాణ రాష్ట్ర రాష్ట్రానికి ప్రధాన ఆదాయం మద్యం విక్రయాలపై వస్తుండడంతో మద్యం దుకాణాలను తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ మద్యం దుకాణాలను తెరిస్తే ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోవచ్చనే విషయం ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు.

మే 5వ తేదీ మంగళవారం తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతున్న నేపథ్యంలో ఈలోగా ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మద్యం దుకాణాలు తెరవాలా? వద్దా? అన్న విషయంపై సీనియర్ మంత్రులు, సీనియర్ అధికారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులతో కెసీఆర్ అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. అయితే రాష్ట్రంలో సోమవారం నుంచి మద్యం ఉత్పత్తి చేసుకోవచ్చంటూ మే 2వ తేదీన ఆరు డిస్టిల్లరీలకు అనుమతులిచ్చారు. ఈ నేపథ్యంలో మే 8వ తేదీ నుంచి రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరిచేందుకే ముఖ్యమంత్రి మొగ్గు చూపవచ్చని తెలుస్తోంది.

వేసవిలో ఉత్పన్నమయ్యే బీర్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి చేయాలని రాష్ట్రంలోని ఆరు లిక్కర్ డిస్టిలరీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మద్యం దుకాణాల వద్ద ప్రజలు భారీ సంఖ్యలో గుమికూడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మే 5వ తేదీన జరిగే కేబినెట్ ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu