ఢిల్లీలో బిజీబిజీగా సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులతో భేటీ.. రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులపై చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హస్తినలో బిజీ బిజీగా ఉన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వచ్చిన సీఎం కేసీఆర్‌.. కేంద్రమంత్రులను కలుస్తున్నారు. శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన కేసీఆర్.. రాష్ట్ర సమస్యలపై చర్చించారు.

ఢిల్లీలో బిజీబిజీగా సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులతో భేటీ.. రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులపై చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హస్తినలో బిజీ బిజీగా ఉన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వచ్చిన సీఎం కేసీఆర్‌.. కేంద్రమంత్రులను కలుస్తున్నారు. శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన కేసీఆర్.. రాష్ట్ర సమస్యలపై చర్చించారు. దాదాపు 40 నిమిషాలపాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వరద సాయం, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కృష్ణా నదీ జలాల పునఃపంపిణీ, సాగునీటి ప్రాజెక్టులకు సాయం, విభజన చట్టంలోని హామీల అమలు తదితర కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక, తెలంగాణలో ఆరు ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేసేందుకు అనుమతించాలని.. ఇందుకు కావలసిన నిధులు సమకూర్చాలని ఆయన కోరినట్లు సమాచారం. ముఖ్యంగా వరంగల్‌, సిద్ధిపేటలో ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేయాలని కోరారు. మరోవైపు, రాజకీయపరమైన అంశాలపైనా ఇరువురూ చర్చించి ఉండొచ్చని ఢిల్లీ రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సత్వరం పరిష్కరించాలని మోదీకి సీఎం కేసీఆర్ విన్నవించారు.తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏటా కేంద్రం రాష్ట్రానికి విడుదల చేయాల్సిన రూ. 450 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని, రైల్వే పనులకు అవసరమైన నిధులు కేంద్రం వెంటనే విడుదల చేయాలన్నారు. రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని, వరద కాలువలకు సవరించిన అంచనాల ప్రకారం నిధులు విడుదల చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

అంతకముందు కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌తో సమావేశమయ్యారు. గృహాల మంజూరు, కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి స్థలం కేటాయించినందుకు కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌కు కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ఆరు కొత్త ఎయిర్‌పోర్ట్‌ల కోసం చర్యలు చేపట్టాలని హర్దీప్‌సింగ్‌ను కోరారు. వాటిలో పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌, వరంగల్‌లోని మామునూర్, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌జిల్లా జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా గుడిబండ, భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. వీటిలో భద్రాద్రి మినహా మిగతా ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్దికి భూమి గుర్తించి…కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వెంటనే కొత్త విమానాశ్రయాలపై ప్రధానిని కోరుతూ లేఖ రాసినట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఇందుకు కేంద్రమంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.