తెలంగాణ సర్కార్‌పై బీజేపీ ఫిర్యాదు

తెలంగాణ సర్కార్‌పై బీజేపీ ఫిర్యాదు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలు.. కేసీఆర్ ప్రభుత్వం చెబుతున్న విధంగా లేదని.. రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఒక కన్‌క్లూజన్‌కు రావద్దని బీజేపీ రాష్ట్ర నేతలు కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు.

Rajesh Sharma

|

May 02, 2020 | 5:48 PM

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలు.. కేసీఆర్ ప్రభుత్వం చెబుతున్న విధంగా లేదని.. రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఒక కన్‌క్లూజన్‌కు రావద్దని బీజేపీ రాష్ట్ర నేతలు కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి శనివారం లేఖ రాశారు.

ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ప్రతినిధి బృందం.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు సమాచారంతో కన్విన్స్ అయిందని.. వాస్తవ పరిస్థితిని పూర్తిస్థాయిలో తెలుసుకోలేక పోయిందని బండి సంజయ్ కుమార్ తన లేఖలో కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువచ్చారు. కేంద్ర బృందం పర్యటన తొలి రెండు రోజులు మాత్రమే షెడ్యూల్ ప్రకారం కొనసాగిందని, ఆ తర్వాత నాలుగు రోజులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిర్దేశించిన విధంగా జరిగిపోయిందని.. వారిచ్చే నివేదిక వాస్తవ పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకురాలేదన్న భావనతో తాము లేఖ రాస్తున్నామని సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కరోనా వైరస్ నియంత్రణ చర్యలు, వ్యాధి చికిత్స అమలు చేస్తున్న తీరు సంతృప్తికర ఉన్నాయని కేంద్ర బృందం అభిప్రాయం వ్యక్తం చేసినట్లు స్థానిక మీడియా రిపోర్టు చేసిందని.. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించడం లేదని సంజయ్ కుమార్ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. వ్యాధి కారక మూలాలను తెలుసుకునే ప్రయత్నం కెసిఆర్ ప్రభుత్వం చేయడం లేదని కోవిడ్ ఆసుపత్రిగా పేర్కొంటున్న గాంధీ హాస్పిటల్‌లో పూర్తిస్థాయి సౌకర్యాలు కూడా కల్పించలేదని.. ఈ మేరకు తమకు ఎన్నో ఫిర్యాదులు అందాయని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రోటోకాల్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఆయన వివరించారు. ఇందుకోసం సి.ఎస్.శాస్త్రి అనే 80 ఏళ్ల వ్యక్తి విషయాన్ని ఉదాహరణగా బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ‘‘ఏప్రిల్ 12వ తేదీన గాంధీ ఆసుపత్రిలో చేరిన శాస్త్రి అనే వృద్ధుడికి పరీక్షలు నిర్వహించి నెగిటివ్‌గా తేల్చారు.. ఆ తర్వాత నాలుగు రోజులకు అదే వ్యక్తిని నిమ్స్ ఆసుపత్రిలో పరీక్షించినప్పుడు పాజిటివ్‌గా ప్రకటించారు.. ఆ తర్వాత ఆయన ఏప్రిల్ 26వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు’’ అని సంజయ్ కుమార్ తన లేఖలో కేంద్ర హోం శాఖ మంత్రికి తెలియజేశారు. అయితే కరోనా వైరస్ వల్ల మరణించిన శాస్త్రి మృతిని గణాంకాలలో స్థానిక ప్రభుత్వం పేర్కొనలేదని ఫిర్యాదు చేశారు సంజయ్ కుమార్.

రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ మినిస్టీరియల్ బృందాన్ని తప్పుదోవ పట్టించిందని తెలంగాణ బీజేపీ భావిస్తోందని, అందుకే బాధ్యతాయుతంగా వాస్తవాన్ని హోం శాఖ దృష్టికి తీసుకురావాలని ఈ లేఖ రాస్తున్నానని సంజయ్ కుమార్ వివరించారు. మరోసారి ప్రత్యేకంగా ఇంటర్ మినిస్టీరియల్ బృందాన్ని తెలంగాణ రాష్ట్రానికి పంపించి వాస్తవ పరిస్థితిని సమీక్ష జరిపించాలని సంజయ్ కుమార్ హోం శాఖ సెక్రటరీని కోరారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu