నిలకడగా సౌరవ్ గంగూలీ ఆరోగ్యం.. యాంజియోప్లాస్టీ వాయిదా వేయాలని మెడికల్ బోర్డు నిర్ణయం

గంగూలీ ఆరోగ్యం పరిస్థితిపై ఇవాళ ఉడ్‌లాండ్ ఆసుపత్రిలో సమావేశమైన 9 మంది సభ్యుల మెడికల్ బోర్డు.

నిలకడగా సౌరవ్ గంగూలీ ఆరోగ్యం.. యాంజియోప్లాస్టీ వాయిదా వేయాలని మెడికల్ బోర్డు నిర్ణయం
Follow us

|

Updated on: Jan 04, 2021 | 5:13 PM

గుండెనొప్పితో శనివారం ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ఆయనకు నిర్వహించాల్సిన యాంజియోప్లాస్టీని తర్వాతి దశకు వాయిదా వేశామని వెల్లడించారు. గంగూలీ ఆరోగ్యం పరిస్థితిపై ఇవాళ ఉడ్‌లాండ్ ఆసుపత్రిలో సమావేశమైన 9 మంది సభ్యుల మెడికల్ బోర్డు ఈ మేరకు నిర్ణయించింది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో మూడు చోట్ల అడ్డంకులు గుర్తించిన వైద్యులు.. యాంజియోప్లాస్టీ నిర్వహించి ఓ దానిని తొలగించారు. అయితే, ఎల్ఏ‌డీ, ఓఎం2లకు మాత్రం తర్వాతి దశలో యాంజియోప్లాస్టీ నిర్వహించాలని నిర్ణయించింది.

ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉండడం, చాతీలో మళ్లీ నొప్పి రాకపోవడంతో ప్రస్తుతానికి యాంజియోప్లాస్టీని వాయిదా వేయడమే మంచిదని మెడికల్ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయించింది. మెడికల్ బోర్డు సమావేశానికి గంగూలీ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. గంగూలీని చూసేందుకు వచ్చే వారి కోసం ఆసుపత్రిలో ‘సౌరవ్ గంగూలీ లాంజ్’ను ఏర్పాటు చేసిన యాజమాన్యం.. దాదా గదిలోకి ప్రవేశించడానికి ముందు పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేసింది. గంగూలీ చికిత్స పొందుతున్న ఐసీయూలోకి వెళ్లేందుకు వారి కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతిస్తోంది. గంగూలీని త్వరలోనే డిశ్చార్జ్ చేయాలని మెడికల్ బోర్డు భావిస్తోంది.