ఆ 18 మంది ఎమ్మెల్యేల డుమ్మా వెనుక రీజన్ ఇదే

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానాన్ని శాసనసభలో ఆమోదించారు. ఆ సమయంలో ఓటింగ్ కు దూరంగా ఉన్నారు 18 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అధికార పార్టీ నేతలే ఓటింగ్‌కు రాక పోవడంపై సర్వత్రా చర్చకు దారి తీసింది. కావాలనే వారు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారా లేక వేరే కారణాలున్నాయనే అంశం హాట్ టాపికైంది. టీడీపీ ముందుగానే సభకు గైర్హాజరు కావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు లేకుండానే సభలో మండలి రద్దు తీర్మానం పై చర్చ జరిగింది. టీడీపీకి […]

  • Siva Nagaraju
  • Publish Date - 2:12 pm, Tue, 28 January 20
ఆ 18 మంది ఎమ్మెల్యేల డుమ్మా వెనుక రీజన్ ఇదే

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానాన్ని శాసనసభలో ఆమోదించారు. ఆ సమయంలో ఓటింగ్ కు దూరంగా ఉన్నారు 18 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అధికార పార్టీ నేతలే ఓటింగ్‌కు రాక పోవడంపై సర్వత్రా చర్చకు దారి తీసింది. కావాలనే వారు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారా లేక వేరే కారణాలున్నాయనే అంశం హాట్ టాపికైంది. టీడీపీ ముందుగానే సభకు గైర్హాజరు కావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు లేకుండానే సభలో మండలి రద్దు తీర్మానం పై చర్చ జరిగింది. టీడీపీకి చెందిన 21 మంది సభకు దూరంగా ఉండగా…గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలగిరిలు సభకు వచ్చారు.

మండలి రద్దు తీర్మానంపై చర్చ జరిగే సమయంలో వారు సభలోనే ఉన్నప్పటికీ.. ఓటింగ్ జరిగేటప్పుడు వారిద్దరు లేరు. ఒకవేళ వారు సభలో ఉండి తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే విప్ ధిక్కరణకు గురయ్యే అవకాశముంది. సభ్యులుగా అనర్హత వేటు పడే వీలుండేది. అందుకే దూరంగా ఉన్నారంటున్నారు. అధికారికంగా వారు టీడీపీ సభ్యులే అయినా…కొద్ది కాలంగా వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఫలితంగా పేరుకు 23 మంది టీడీపీ సభ్యులున్నా వారిద్దరిని పరిగణనలోకి తీసుకోవడం లేదు పార్టీ అధిష్టానం. మరోవైపు టీడీఎల్పీ భేటీకి వారు హాజరు కావడం లేదు.

 

ఇక సభలో మండలి రద్దు తీర్మానంపై ఓటింగ్ జరిగే సమయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభ బయట ఉన్నారు. సిఎం జగన్మోహనరెడ్డి సభలో ప్రసంగించే సమయంలో కొందరు సభ్యులు బయటకు వెళ్లారు. సిఎం ప్రసంగం ముగిసిన వెంటనే లాంగ్ బెల్ కొట్టి ఓటింగ్ జరపాలని ఆదేశించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. కొందరు సభ్యులు తిరిగి సభలోకి వచ్చే సమయానికే తలుపులు మూసేశారు అసెంబ్లీ సిబ్బంది. ఫలితంగా సభలో ఉన్న సభ్యులే ఓటేశారు. ఇందులోను గందరగోళం కనిపించింది.

రద్దు తీర్మానానికి అనుకూలంగా 121 మంది ఓటేశారని తొలుత స్పీకర్ ప్రకటించారు. ఇందుకు అధికార పార్టీ సభ్యుల నుంచే అభ్యంతరం వ్యక్తమైంది. ఆ తర్వాత మరోసారి సభ్యులను లెక్కించారు. ఆ తర్వాత 133 మంది తీర్మానానికి అనుకూలంగా ఓటేశారని ప్రకటించారు స్పీకర్. వారిలో జనసేన పార్టీకి చెందిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద రావు కూడ ఉండటం ఆసక్తికరం. సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 మంది సభ్యుల బలం ఉంది. స్పీకర్‌గా ఉండటంతో తమ్మినేని సీతారాం తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. తీర్మానానికి సమానంగా ఓట్లు వచ్చినప్పుడు స్పీకర్ తన నిర్ణయాత్మక ఓటు హక్కును వినియోగించుకునే వీలుంది. ఈ తీర్మానం విషయంలో సంపూర్ణ మెజార్టీ ఉండటంతో అంత అవసరం రాలేదు.

ప్రభుత్వ విప్‌లే డుమ్మా…

మిగిలిన 150 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 132 మంది మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు. 18 మంది ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. కారణాలేవైనా ఎందుకు వారు రాలేదనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సిఎం జగన్మోహనరెడ్డి సైతం సభ్యులు ఎందుకు ఓటింగ్ కు దూరంగా ఉన్నారనే విషయంపై ఆరా తీశారు. మరోసారి అలా జరగకుండా చూడాలని తమ పార్టీ నేతలకు ఆదేశించారు. ఓటింగ్ కు కొద్ది సమయం ముందు విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటకు వెళ్లారు. చెన్నైలో తన సోదరుడు ఆసుపత్రిలో చేరడంతో బయటకు వెళ్లారంటున్నారు. మరోవిప్ దాడిశెట్టి రాజా ఆరోగ్యం బాగోలేక పోవడంతో సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. కీలక సమయంలో ప్రభుత్వ విప్‌లే సభలో లేకపోవడం ఏంటనే చర్చ జరుగుతోంది.

ఇక ఓటింగ్ జరిగే సమయంలో సభ బయట గ్రంధి శ్రీనివాస్ (భీమవరం), మేకా ప్రతాప్ అప్పారావు(నూజివీడు)లు ఉన్నారు. వారు లోపలకు వచ్చేందుకు ప్రయత్నించినా అప్పటికే తలుపులు మూసేయడంతో బయటే నిలబడాల్సి వచ్చింది. సభకు వచ్చి బయటకు వెళ్లిపోయిన వారిలో పర్వత పూర్ణ చంద్రప్రసాద్ (ప్రత్తిపాడు), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ( ఉదయగిరి), యూవీ రమణమూర్తి రాజు ( యలమంచిలి)లు ఉన్నారు. వివిధ కారణాలతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (కాకినాడ), కొలుసు పార్థసారధి( పెనమలూరు)లు సభ నుంచి వెళ్లిపోయారు.

ఇక కోన రఘపతి ( బాపట్ల) వ్యక్తిగత కారణాలతో అసలు సభకు రాలేదు. ఇక ప్రొద్టుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిలు ఆసుపత్రికి వెళ్లడంతో సభకు దూరంగా ఉన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిలు అసలు సభవైపే తొంగి చూడలేదు. మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ భాషా బెంగళూరులో స్నేహితుడి కోసం వెళ్లి తిరిగి సభలో అడుగు పెట్టలేదు. తన తల్లి చనిపోవడంతో సత్యవేడు ఎమ్మెల్యే కే. ఆదిమూలం ఇంటి వద్దే ఉండటంతో సభకు రాలేదు.

ఇక రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి జ్వరంతో సభకు దూరంగా ఉన్నారని చెబుతుండగా…పుట్టపర్తి ఎమ్మెల్యే డి. శ్రీధర్ రెడ్డి అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారని తెలుస్తోంది. విషయం ఏదైనా 18 మంది ఓటింగ్‌కు దూరంగా ఉండటం అధికార పార్టీలో కలకలం రేపుతోంది. సభలో టీడీపీకి పెద్దగా సభ్యులు లేరు కాబట్టి సరిపోయింది. అదే టీడీపీ సభ్యులు పోటా పోటీగా ఉండి ఓటింగ్ జరిగితే అధికార పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఉండేది. భవిష్యత్‌లో అధికార పార్టీ సభ్యులంతా సభకు వచ్చేలా చూడాలని విప్‌లకు వైసీపీ కీలక నేతల నుంచి ఆదేశాలు రావడం చర్చనీయాంశమైంది.

-కొండవీటి శివనాగరాజు
సీనియర్ జర్నలిస్టు, టీవీ9